ఫిట్‌నెస్.. ఇక.. ఇక్కడే
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:55 AM
వాహనాల ఫిట్‌నెస్ తనిఖీకి ఇతర జిల్లాలకు వెళ్లే అవస్థలు తప్పనున్నాయి. రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి సామర్థ్య ధృవీకరణ (ిఫిట్‌నెస్ సర్టిఫికెట్)లు ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.
జిల్లా వాహనాలన్నీ అక్కడే తనిఖీ
ప్రస్తుతం 42 వేల వాహనాలు
ఇప్పటిదాకా ఇతర జిల్లాలకు
వెళ్లాల్సిన పరిస్థితి
అధికారుల తనిఖీల్లో లోపాలు
బయటపడితే మరోసారి ఫిట్‌నెస్
దూరాభారమంటూ వాహన యజమానులు ఆందోళన
రేపు ప్రారంభించనున్న
డిప్యూటీ స్పీకర్ రఘురామ
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వాహనాల ఫిట్‌నెస్ తనిఖీకి ఇతర జిల్లాలకు వెళ్లే అవస్థలు తప్పనున్నాయి. రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి సామర్థ్య ధృవీకరణ (ిఫిట్‌నెస్ సర్టిఫికెట్)లు ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. దేశ వ్యాప్తంగా ఏటీఎస్ కేంద్రాలు అమలులోకి వచ్చాయి. అక్కడే వాహనాలను ఆటోమెషిన్ ద్వారా తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే సామర్థ్య ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వమే ఏటీఎస్ కేంద్రాలను నిర్వహిస్తోంది. రవాణా శాఖ ఆ బాధ్యతలు నిర్వహిస్తోంది, రాష్ట్రంలో దీనిని ప్రైవేటు ఏజన్సీకి అప్పగించారు. ఇప్పటిదాకా కోనసీమ, కృష్ణా జిల్లాలకు వాహనాలను తీసుకుని వెళ్లేవారు. సామర్థ్య పరీక్షలు చేయించేవారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లాలోనే ఏటీఎస్ కేంద్రం అందుబాటులోకి వస్తోంది. పాలకోడేరు మండలం కోరుమామిడి గ్రామంలో ఏటీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 30న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దీన్ని ప్రారంభించనున్నారు. ఇకపై భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు రవాణా శాఖ ఉప కార్యాలయాల పరిధిలో ఉన్న రవాణా వాహనా లన్నీ కోరుమామిడి కేంద్రంలోనే పరీక్షించుకునే వెసులుబాటు లభించింది.
వాహనదారులకు ఎంతో ఊరట
జిల్లాలో 42 రవాణా వాహనాలున్నాయి. అందులో లారీలు, టిప్పర్‌లు, ఆటోలు, సరకు రవాణా ఆటోలు, విద్యా సంస్థల బస్సులు , ట్రావెల్ బస్సులు ఇలా అన్ని రవాణా వాహనాలకు ఫిట్ నెస్ తప్పనిసరి. ఇప్పటిదాకా ఏటీఎస్ కేంద్రాల్లో వాహన పరీక్షల కోసం ఇతర జిల్లాలకు వెళ్లేవారు. అక్కడ నుంచి ధృవీకరణ పత్రం తీసుకొచ్చేవారు.తీరా రవాణా శాఖ అధికారుల తనిఖీలు నిర్వహిస్తే డొల్లతనం బయటపడేది. మరోసారి లోపాలు సరిదిద్దుకుని ధృవీకరణ పత్రం తెమ్మనేవారు. దీనివల్ల రెండు సార్లు డీజిల్ ఖర్చుతో సహా రవాణా లేకుండా పోయేది. కిరాయిలు పోతున్నాయంటూ యజమానులు ఆందోళన చెందేవారు. కోరుమామిడిలో ఫిట్‌నెస్ అందు బాటులోకి రావడంతో జిల్లా వాహనాల తనిఖీలు సునాయాసం కానున్నాయి.