Share News

అభివృద్ధికి ల్యాండింగ్‌

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:09 AM

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం దశాబ్దాల కల. ఎన్నిసార్లు శంకుస్థాపనలు జరిగినా.. పనులు ప్రారంభం కాలేదు.

అభివృద్ధికి ల్యాండింగ్‌

బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌

రూ.25 కోట్ల మంజూరుకు సీఎం పచ్చజెండా

మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడిన కూటమి

నరసాపురం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం దశాబ్దాల కల. ఎన్నిసార్లు శంకుస్థాపనలు జరిగినా.. పనులు ప్రారంభం కాలేదు. దీనిని నేరవేర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అమరావతిలో జరిగిన జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి కూటమి ప్రభుత్వం బియ్యపతిప్ప వద్ద ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. 2019లో అప్పటి మంత్రి లోకేశ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఈ స్థానంలో రూ.490 కోట్లతో ఫిషింగ్‌ కార్గో పోర్టును నిర్మిస్తామని ప్రకటించి 2023లో అప్పటి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎన్నికల వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇక హార్బర్‌ కల నేరవేరదని అంతా భావించారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే నల్లి క్రీక్‌ తవ్వకంతోపాటు హార్భర్‌ నిర్మాణం చేపడతామని నేతలు హామీ ఇచ్చారు. దీనికనుగుణంగా క్రీక్‌ పనులు చేపట్టారు. తాజాగా హార్భర్‌కు బదులు 50 బోట్లు నిలిచే విధంగా ప్రాథమికంగా ల్యాండింగ్‌ సెంటర్‌ను నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు నిధులు కేటాయించారు.

త్వరలో పనులు : ఎమ్మెల్యే నాయకర్‌

మత్స్యకారులకు జీవనోపాధి కల్పించే చర్యల్లో భాగంగా రూ.10 కోట్లతో నల్లిక్రిక్‌ పనులు ప్రారంభించాం. తాజాగా బోట్లు నిలిచే విధంగా బియ్యపుతిప్ప వద్ద ల్యాండింగ్‌ సెంటర్‌ను నిర్మిస్తాం. దీనికి సీఎం చంద్రబాబు రూ.25 కోట్లు కేటాయించారు. త్వరలో పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. తర్వాత ల్యాండింగ్‌ సెంటర్‌ను హార్బర్‌గా అభివృద్ధి చేస్తాం.

టౌన్‌ హాల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

తాడేపల్లిగూడెం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడానికి సరైన వేదిక లేకపోవడంతో తాడేపల్లిగూడెంలో టౌన్‌ హాలు నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తొలి విడత రూ.10 కోట్లు అవసరమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రతిపాదనలకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీనిపై కళాకా రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టౌన్‌ హాలుకు ఎంతో చరిత్ర ఉంది. మున్సిపల్‌ కార్యాలయానికి ఆనుకుని వున్న దీనిని అప్పటి చైర్మన్‌ యీలి అంజనేయులు కృషితో నిర్మించారు. దీని నిర్మాణానికి హాస్య నటుడు స్వర్గీయ రేలంగి వెంకట్రామయ్య, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌, అత్తిలి వర్తక సంఘం సహకరించారు. ఇక్కడే రంగస్థల కళాకారులు, వివిధ రంగాలకు చెందిన కళాకారులు ఈ టౌన్‌హాల్లోనే ప్రదర్శనలు ఇచ్చేవారు. లలిత కళాసమితి నిర్వాహకుడు యద్దనపూడి సూర్య నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఎంతో మంది కళాకారులు ప్రదర్శనలు ఇప్పించారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఘంటశాల వెంకటేశ్వరరావు. శ్రీశ్రీ, మద్దాల రామారావు వంటి వారు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చినవారే. దీని మెయింటినెన్స్‌ సరిగా లేకపోవడంతో శిఽథిలావస్థకు చేరింది కరణం అప్పారావు చైర్మన్‌గా ఉండగా కొత్త భవనాన్ని నిర్మించాలని కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఈతకోట తాతాజీ చైర్మన్‌గా వున్న సమయంలో దీన్ని పూర్తిగా తొలగించి నిర్మించాలని మరోసారి కౌన్సిల్‌ ప్రతిపాదన చేసింది. దీనికి రూ.1.20 లక్షలు అవసరం అవుతాయని ప్రతిపాదించారు. అదనంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి నిధులు ఇచ్చేందుకు ముందుకొ చ్చారు. టౌన్‌ హాల్‌ను ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేయాలని అప్పటి ఎమ్మెల్యే యీలి వెంకట మధుసూద నరావు(నాని) ఆలోచించారు. దీని స్థల సేకరణకు కృషి చేశారు. ఇది అక్కడితో ఆగింది.

గొల్లగూడెంలో టౌన్‌హాల్‌

గొల్లగూడెంలో మూడు ఎకరాల భూమిని అప్పటి దివంగత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చదును చేయించారు. అదే ప్రాంతంలో టౌన్‌ హాల్‌ నిర్మించాలనే ఎమ్మెల్యే బొలిశెట్టి సీఎం చంద్రబాబు దృష్టికి ప్రతిపాదనల రూపంలో తీసుకెళ్లారు. సీఎం సానులకూలంగా స్పందించారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని కలెక్టర్‌ నాగరాణి, జేసీలు పరిశీలించారు.

Updated Date - Mar 28 , 2026 | 12:13 AM