సముద్రంలో వేట జోష్
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:17 AM
మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో మత్స్యకారుల వలకు టైగర్ రొయ్య భారీగా చిక్కుతోంది.
మత్స్యకార్లకు అనుకూల పరిస్థితులు
వలలకు చిక్కుతున్న టైగర్ రొయ్య
నరసాపురం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో మత్స్యకారుల వలకు టైగర్ రొయ్య భారీగా చిక్కుతోంది. ఇటీవల కాకినాడ తీరంలో ఓ బోటుకు సుమారు టన్ను టైగర్ రొయ్య దొరి కింది. ఇటీవల నరసాపురం తీరంలో వేటకు వెళ్లిన బోటుకు 400 కేజీల టైగర్ రొయ్య పడింది. కొద్ది రోజులు గా వేటకు వెళుతున్న మత్స్యకార్లకు పుష్కలంగా మత్స్య సంపద చిక్కుడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది గోదావరికి వరద ఆలస్యంగా తాకడంతో వేటకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్ 14న సముద్ర వేటకు ఆంక్షలు తొలగించినా ఆగస్టు మొదటి వారం వరకు వేట అనుకూలించలేదు. కొత్త నీరు రాకపోవడం, సముద్రంలో గాలులు, ఎండ వేడి తదితర కారణాలతో మత్స్య సంపద చిక్కక ఖాళీ బోట్లతో వెనక్కి వచ్చారు. నష్టాలు భరించలేక చాలామంది బోట్లను కట్టేశారు. వరద, వర్షాలతో కడలి గర్భంలో పరిస్థితులు అనుకూలించి మత్స్య సంపద పడుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైగర్ రొయ్య ఎక్కువుగా లభ్యమవుతోంది. చందువా, మాగ, టూనా వంటి చేపలు పుష్కలంగా పడుతుండంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.