Share News

వేటకు విరామం

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 AM

తీరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి సుముద్ర వేట నిషేధ ఆజ్ఞలు అమల్లోకి రానున్నాయి. జూన్‌ 15 వరకు అంటే 60 రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.

వేటకు విరామం

14 నుంచి సముద్రంలో చేపల వేటకు బ్రేక్‌

జూన్‌ 15 వ రకు నిషేధ ఆజ్ఞలు

నోటీసులు జారీ చేస్తున్న మత్స్యశాఖ అధికారులు

2 నెలలు మత్స్యకారులకు ఉపాధి దూరం

నరసాపురం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తీరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి సుముద్ర వేట నిషేధ ఆజ్ఞలు అమల్లోకి రానున్నాయి. జూన్‌ 15 వరకు అంటే 60 రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. ఇప్పటికే కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వుల్ని మత్స్యశాఖ అధికారులు వేట సాగించే బోట్ల నిర్వాహకులకు అందిస్తున్నారు. నిషేధం అమల్లోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన సుమారు 10 వేల మంది రెండు నెలల పాటు ఉపాధి కోల్పోనున్నారు. వీరిలో 1,830 మంది మత్స్యకారులు ఉన్నారు. మిగిలిన వారంతా ఐస్‌ ఫ్యాక్టరీ, మత్స్యసంపదను ఎగుమతి చేసే కంపెనీల్లో పనిచేసే కార్మికులు, లారీ డ్రైవర్లు ఉన్నారు. నెలకు సుమారు రూ.20 కోట్లు మత్స్య సంపద ఎగుమతులు నిలిచిపోనున్నాయి.

1,830 మంది మత్స్యకారులకు భృతి

నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం నెలకు రూ.10 వేలు చొప్పున రెండు నెలల కాలానికి రూ.20 వేలు భృతి అందించనుంది. జిల్లాలో ప్రస్తుతం 1830 మంది గుర్తింపు పొందిన మత్స్యకారులు ఉన్నారు. మే, జూన్‌ నెలలో ఈ భృతి మొత్తం వారి ఖాతాల్లో జమ చేయ నున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు నిషేధ సమయంలో కేవలం రూ.10 వేలు మాత్రమే భృతి అందేది. గత రెండేళ్ల నుంచి పెంచిన మొత్తం రూ.20 వేలు అందిస్తున్నారు.

ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు కేంద్ర దేశవ్యాప్తంగా సముద్ర వేటను నిషేధిస్తూ వస్తుంది. ఈ రెండు నెలల కాలంలో సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి ఎక్కవుగా జరుగుతుంటుంది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించిపోతుందన్న జాగ్రత్తతో నిషేధం అమలు చేస్తారు. జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలంలో సముద్ర తీరం విస్తరించి ఉన్న 19 కిలోమీటర్ల పరధిలోనూ ఈ నిషేధ అజ్జలు 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి.

తిరుగుముఖం పడుతున్న బోట్లు

నరసాపురం తీరం సముద్ర వేటకు పెట్టింది పేరు. గోదావరి, సముద్రం కలిసే ప్రదేశం కావడంతో ఏటా ఈ ప్రాంతంలో వేట సాగించేందుకు వందలాది బోట్లు వస్తుంటాయి. ఎక్కువుగా కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన బోట్లు ఈ ప్రాంతంలో వేట సాగిస్తుంటాయి. విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న టైగర్‌ రొయ్య, పండుగొప్ప, మగ, సందువాయి. టోనా వంటి రకాలకు చెందిన చేపలు ఈ ప్రాంతంలో పుష్కలంగా దొరుకుతాయి. ఇలా వేటాడిన మత్స్య సంపదను కోనసీమ జిల్లా అంతర్వేది, నరసాపురం మండలం బియ్యపుతిప్ప, పట్టణంలోని లాకుల వద్ద నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం సీజన్‌ ముగిస్తుంటడంతో వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి.

Updated Date - Apr 11 , 2026 | 12:15 AM