అగ్ని ప్రమాదాలు ఆపుదాం
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:21 AM
అగ్ని ప్రమాదాల నివారణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
ఏలూరు క్రైం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాల నివారణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడవచ్చని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్.రత్నబాబు చెబుతున్నారు. అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారం ప్రారంభం కావడంతో అగ్నిమాపక జిల్లా కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. విధి నిర్వహణలో కార్మికులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి మంటలను అదుపుచేసే యంత్రపరికరాలపై అవగాహన ఉండాలని, ప్రమాదాన్ని వెంటనే పసిగట్టి వ్యాప్తి చెందకుండా అదుపు చేయాలన్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం, ఏమరుపాటుతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఐఎస్‌ఐ నాణ్యత కల్గిన విద్యుత్ వైర్లను, పరికరాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొత్తగా రెండు ఫైర్ ఇంజన్లు
జిల్లాకు రెండు కొత్త ఫైర్ ఇంజన్లు వచ్చినట్లు రత్నబాబు తెలిపారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఫైర్‌స్టేషన్లకు వాటిని కేటాయిస్తామన్నారు. రెండు బోట్లు కూడా వచ్చాయని, ఒకటి జంగారెడ్డిగూడెం, మరొకటి భీమడోలు అగ్నిమాపక కేంద్రాలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. క్విక్ రెస్పాన్స్ వాహనం ఒకటి జిల్లా కేంద్రంలోనే ఉంచి అవసరాన్ని బట్టి వినియోగిస్తామన్నారు. కొయ్యలగూడెంలో మరో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి వి.రామకృష్ణ, ఫైర్ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.