ఆరని మంటలు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:23 AM
వేసవి ఎండలు ముదురుతున్నాయి. అదే సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారణ కష్టంగా కనిపిస్తోంది.
కాలం చెల్లిన ఫైరింజన్లతో తంటా
మూలనబడ్డ వాహనాలతో తప్పని తిప్పలు
ప్రమాద స్థలికి చేరడం కూడా గగనమే
కొత్త వాహనాల కోసం ఎదురుచూపులు
వేసవి దృష్ట్యా సత్వర చర్యలు అవసరం
వేసవి ఎండలు ముదురుతున్నాయి. అదే సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారణ కష్టంగా కనిపిస్తోంది. ప్రమాదాలను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలు ఎంతో అవసరం. ఇళ్లలో మాత్రమే కాదు ఫ్యాక్టరీలు, తోటలు, గడ్డివాములు దగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువ. మంటలు అదుపు చేయడం, ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడడంలో అగ్ని మాపక శాఖ కీలకం. జిల్లాలో ఆరు ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. వాహనాలు కూడా కండిషన్‌లో లేవు.
ఏలూరు క్రైం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 13, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో 9, నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో 6 మొత్తం 28 మండలాలున్నాయి. జిల్లాలో సుమారు 30 లక్షల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. జిల్లాలో ఆరు ఫైర్‌స్టేషన్లు ఉం డగా 2014లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు కలిపి కుక్కునూ రులో ఫైర్‌స్టేషన్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ఫైర్‌స్టేషన్ల పరిస్థితి, వాహనాల దుస్ధితి చూస్తే అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమేనా అని ఆశ్చర్యపోకతప్పదు.
డుగ్గు డుగ్గుమంటూ..
జిల్లాలోని 6 ఫైర్‌స్టేషన్లు, ఒక ఔట్ పోస్టు ఫైర్‌స్టేషన్‌లో వాహనాలన్నీ కాలపరిమితి దాటినవే. నూజివీడు ఫైర్ ఇంజను మాత్రమే 2015 మోడల్. మిగిలినవన్ని 17 ఏళ్లు దాటినవే ఉన్నాయే. ఫైర్ ఇంజన్లు 15 ఏళ్ల వరకు మాత్రమే కాగా ఇంకా గడువు ముగిసిన వాహనాలతోనే ఉద్యోగులు విధి నిర్వహణ చేస్తూ అగ్నిప్రమాదాలను నివారించడంలో తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆరు ఫైర్ స్టేషన్లలో ప్రస్తుతం 93 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఇంకా 40 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
ప్రతిపాదనలు ఇవే..
జిల్లాలో అపార్టుమెంట్ కల్చర్ విస్తరించింది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంగా అప్‌గ్రేడ్ చేసినప్పుడే బ్రాంటో స్కైలిట్ ఫైర్ ఇంజన్‌ను ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈఫైర్ ఇంజన్ 18 అంతస్తుల వరకూ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఫైర్ సిబ్బంది వెళ్లి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం, మంటలను అదుపు చేయడానికి వీలుగా ఉంటుంది. ఏలూరు నగరంలోని రోడ్లను పరిశీలించి నగర ప్రధాన రహదారులు మినహా మిగిలిన వీధుల్లో వెళ్లలేదని చివరకు విరమించారు. జిల్లాలో కొయ్యలగూడెం, కలిదిండిలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు పోలవరం లేదా బుట్టాయిగూడెంలో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయా లని భావించారు. ద్వారకాతిరుమల లేదా గోపాలపురంలో ఫైర్ ఇంజన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలు కు కార్యాచరణ శూన్యం. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధి కారులు, జిల్లాలో ఫైర్ స్టేషన్ల పరిస్థితిని, వాహనాల దుస్థితిని పరిశీలించి ప్రక్షాళన చేసి నూతన వాహనాలను ప్రవేశపెడితే తప్ప జిల్లాలో అగ్నిప్రమాదాలను నివారించ గలరే తప్ప ఉన్న వాహనాలతో అగ్ని ప్రమాదాలను నివారించడమంటే అంత సులువైన పనికాదు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
వేలేరుపాడు మండలంలో తరచూ జరగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల సర్వం కోల్పోతున్నారు. మండల కేంద్రంలో వేసవి మూడు నెలలైనా ఒక ఫైర్‌ఇంజన్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా విన్నవిస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వేసవిలోనైనా ఒక ఫైర్ ఇంజన్‌ను ఏర్పాటు చేయాలి.
కారం దారయ్య, జిల్లా అధ్యక్షుడు, ఏపీ గిరిజన సంఘం
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో ఫైర్ ఇంజన్లు అవసరం ఉంది. నూజివీడు ఫైర్ ఇంజన్ బాగా పనిచేస్తుంది. మిగిలినవన్నీ పాతవి. ప్రస్తుతం రాష్ట్రానికి 110 ఫైర్ ఇంజన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. జిల్లాకు రెండు వాహనాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. చింతల పూడి, భీమడోలులో వినియోగించడానికి చర్యలు తీసుకుం టున్నాం. కొయ్యలగూడెం, కలిదిండి ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన అధికారుల పరిశీనలో ఉంది. జిల్లాలో ప్రమాదాలను ప్రస్తుతం ఉన్న వాహనాలు, మోటార్లతో యుద్ధప్రాతిపదికన మంటలు అదుపు చేస్తున్నాం. ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితోనే సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం.
వి.రామకృష్ణ, అదనపు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
వినబడని ఫైర్ ఇంజన్ గంట
వేలేరుపాడు : జిల్లాలో మారుమూల ప్రాంతమైన వేలేరుపాడు మండలంలో అత్యధికం గిరిజన గ్రామాలే. దాదాపు 80 శాతం మంది తాటాకిళ్లల్లో జీవనం సాగిస్తు న్నారు. అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ వచ్చేలోపే నష్టం జరిగిపోతుంది. గత పదేళ్లలో కటుకూరు, కన్నాయిగుట్ట, రామవరం గ్రామాల్లో అగ్నిప్రమాదాల్లో ఆస్తినష్టం సంభ వించింది. వేసవిలో నిత్యం ఏదో గ్రామంలో అగ్నిప్రమాదం జరగడం పరిపాటి. కుక్కునూరులో ఫైర్ ఇంజన్ ఉన్నా 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసరికి బుగ్గి మిగులుతోంది. వేలేరు పాడు మండలానికి ప్రత్యేకంగా వేసవి మూడు నెలలైనా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.