చెరువులు నింపేయండి
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:20 AM
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువుల నింపుకునేందుకు ఎనిమిది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది.
జిల్లాలో 321 మంచినీటి చెరువులు
నిర్లక్ష్యం చేస్తే వేసవిలో తాగునీటికి ఇక్కట్లు
సమస్యాత్మక చెరువులపై ఈసారి దృష్టి లేదు
భీమవరం రూరల్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువుల నింపుకునేందుకు ఎనిమిది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నెల 15 నుంచి కాలువలకు నీటి విడుదల నిలిపివేయనున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఈ వేసవిలో తాగునీటికి ఇక్కట్లు తప్పవు
ఏళ్ళ తరబడి మంచి నీటి చెరువుల అభివృద్ధి జరగలేదు. దానివల్ల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం తక్కువుగా ఉంది. గ్రామాల్లో సమస్యాత్మక తాగునీటి చెరువులపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. గ్రామాల్లో జనాభా పెరుగుతూ వచ్చారు. చెరువులు పూర్తిగా నింపుకుంటేనే వేసవి నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. అయితే చెరువుల నింపడంలో చాలాచోట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. జిల్లాలో 321 మంచినీటి పథకాల చెరువులు ఉన్నాయి. 282 బోరు స్కీములు, 20 సీపీడబ్ల్యు స్కీములు ఉన్నాయి. చెరువుల్లో దాదాపుగా 50 రోజులపాటు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన నీరు ఉండాలి.
పాలకవర్గాలు లేవు...
అధికారులే చూసుకోవాలి
ఈనెల 2వ తేదీ నుంచి పంచాయతీ పాలకవర్గాలు పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. దీంతో వేసవి తాగునీటి ప్రణాళిక అంతా గ్రామ అధికారులు, ప్రత్యేక అధికారుల మీద ఆధారపడి ఉంది.గ్రామాల్లో తాగునీటి చెరువులు అభివృద్ధి ఎన్నో ఏళ్లుగా జరగడం లేదు. జిల్లాలో 50కి పైగా సమస్యాత్మక చెరువులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు వేసవి చివరిలో తాగునీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి చెరువులు ఈ ఏడాది తవ్వకాలు జరగలేదు. దీనివల్ల ఆయా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ మధ్యనే వీరవాసరం మండలం కమతాలపల్లి మంచినీటి చెరువు తవ్వకానికి ఎండబట్టి సరిపడా నిదులు లేక మరలా నీరు పెట్టేశారు. దీంతో ఆ చెరువు అభివృద్ధికి నోచుకోలేదు.