Share News

గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరాలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:14 AM

వరుస తుఫాన్లు రహదారులను ధ్వంసం చేసి, వృక్షాలను నేలకూల్చి, పంటలు, విద్యుత్‌ శాఖకు భారీ నష్టం కలిగించాయి. రోజుల తరబడి పల్లపు ప్రాంతాలు ముంపుబారిన పడడంతో పలుచోట్ల పారిశుధ్యం క్షీణించింది.

గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరాలు
భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రక్తపరీక్షల కోసం వేచిఉన్న బాధితులు

తుఫాను మురుగుతో నీరు కలుషితం

దోమల వ్యాప్తి.. డెంగీ భయం

పీహెచ్‌సీలో పెరిగిన బాధితులు

భీమవరం రూరల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లు రహదారులను ధ్వంసం చేసి, వృక్షాలను నేలకూల్చి, పంటలు, విద్యుత్‌ శాఖకు భారీ నష్టం కలిగించాయి. రోజుల తరబడి పల్లపు ప్రాంతాలు ముంపుబారిన పడడంతో పలుచోట్ల పారిశుధ్యం క్షీణించింది. దీనికితోడు ముంపు సమయంలో డ్రెయిన్ల నీరు కూడా కలవడం, ప్రజలు ఆ నీటిలోనే రాకపోకలు సాగించడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి.

గ్రామాల్లోని రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో నిలిచి పోయిన వర్షపు నీరు మురుగుగా మారడంతో వారం రోజులుగా దోమల బెడద తీవ్రమైంది. ఫలితంగా జిల్లాలోని 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వర పీడి తుల సంఖ్య రెట్టింపు అయింది. తుఫానుకు ముందు రోజుకు 60 మంది వరకు ఉండే ఓపీ ఇప్పుడు వందకు, కొన్నిచోట్ల అంతకుమించి చేరింది. గతంలో నెలకు 1,500 ఉండే ఓపీ ప్రస్తుతం మూడు వేలకు పెరిగినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. పల్లెల్లో నిలిచిన వర్షపు నీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు ఉధృతంగా కుడుతుం డడంతో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. కాలువల నుంచి మురుగునీరు పంట పొలాల్లో నిలిచిఉండడంతో వ్యాధులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అక్వాన్‌ తుఫాను ప్రభావం లేక వర్షాలు కురవకపోవడంతో ముప్పు తప్పింది. వర్షాలు పడి ఉంటే నిలిచిన నీరు మరింత పెరిగి రోగాలు తీవ్రమయ్యేవి. ప్రస్తుతం తాగునీరు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. దోమల విజృంభణతో డెంగీ జ్వరాలు వస్తాయేమోనన్న భయాందోళన ప్రజల్లో నెలకొంది. వైద్యశాఖ తక్షణమే ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పారిశుధ్యం మరిచిన పంచాయతీలు

గ్రామాల్లో రెండు నెలలుగా పాలకవర్గాలు లేకపోవడం, పంచాయతీ ఎన్నికల హడావుడిలో అధికారులు తలమునకలుగా ఉండడంతో పారిశుధ్య పనులు మంద గించాయి. దీనితో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తుఫాన్‌ అనంతరం ప్రతి గ్రామంలోని పల్లపు రహదారులపై అడుగు లోతు నీరు నిలిచిపోయింది. వర్షాలు ఆగిన పది రోజుల వరకు కూడా నీరు బయటకు వెళ్లే దారి చూపలేదు. ఖాళీ స్థలాలు మురుగు నీటికి ఆవాసాలుగా మారినా పంచాయతీల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడా బ్లీచింగ్‌ చల్లడం గానీ, పారిశుధ్య పనులు గానీ చేపట్టలేదు. దీనికి వాతావరణ మార్పులు తోడవడంతో రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఈ అంశమే..

పల్లెల్లో పారిశుధ్యంపై శ్రద్ధ తగ్గడంతో కొత్త పాలక వర్గాలు వస్తే కానీ పనులు జరగవా అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారా నికి వస్తున్న అభ్యర్థుల నుంచి రహదారుల మరమ్మతు, డ్రెయినేజీల నిర్మాణం, మంచినీటి చెరువుల అభివృద్ధిపై ప్రజలు హామీలు తీసుకుంటున్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లోనూ అభ్యర్థి ఇచ్చే సొమ్మును తాగునీరు, పారిశుధ్య అభివృద్ధి కోసమే వెచ్చించాలని గ్రామపెద్దలు నిర్ణయిస్తున్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:14 AM