ఖర్చుల పండుగ !
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:15 AM
మార్గశిర మాసం.. శీతాకాలం.. ముగిసి మాఘమాసంలో అడుగు పెడుతుంటే.. ప్రతి ఇంట్లో ఉత్సాహం, ఆనందం కనిపిస్తుంది.
ప్రతి ఇంట భారీగా సంక్రాంతి బడ్జెట్
ఇంటిల్లిపాది బట్టలు.. పిండి వంటల ఖర్చే అధికం
కొత్త అల్లుళ్లకు పండుగ కానుకలు.. అతిథి మర్యాదలకు అదనం
పనివారికి, సిబ్బందికి బోనస్‌లు తప్పనిసరి
నరసాపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి):మార్గశిర మాసం.. శీతాకాలం.. ముగిసి మాఘమాసంలో అడుగు పెడుతుంటే.. ప్రతి ఇంట్లో ఉత్సాహం, ఆనందం కనిపిస్తుంది. జనవరి మొదటి వారం నుంచి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అంటూ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎదురుచూస్తుంటారు. కాని, ఇంటి యజమానికి మాత్రం ఇది బడ్జెట్ పండుగ. ఈ పండుగ కోసం కొంత బడ్జెట్‌ను సమకూర్చుకునేందుకు నెలల ముందు నుంచే పొదుపు చేస్తుంటాడు. ఇలా దాచిన మొత్తాన్ని పండుగ వేళ ఖర్చు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతోపాటు ఇంటికి వచ్చే బంధువులు, అతిథులు, కూతుళ్లు, అల్లుళ్లకు కొత్త బట్టలు తీయాల్సిందే. కొత్త అల్లుడైతే కానుకలు ఇవ్వాల్సిందే. ఇక పిండి వంటల బడ్జెట్ సరేసరి. ముక్కనుమ నాడు మాంసాహారానికి వెచ్చించాలి. అయితే ఈ ఖర్చులో యజమానితోపాటు ఇంటిల్లిపాదికి సంతోషం, ఆనందం వెల్లివిరుస్తుంది.
కొత్త బట్టల వ్యయం..
సంక్రాంతి పెద్ద పండు గగా జరుపుకోవడం మన తెలుగునాట సంప్రదాయం. కటిక పేదవాడు నుంచి ధనవంతుడి వరకు ఈ పండుగ నాడైనా.. కొత్త బట్టలు కొనుగోలు చేసుకోవడం పరిపాటి. దీంతో ప్రతి కుటుంబం తమ స్థోమతను బట్టి పది వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెడుతుంది. ధనికుల ఇళ్లల్లో ఈ ఖర్చుకు పరిమితి లేదు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో కనీసం రెండు రోజులైనా కొత్త బట్టలు వేస్తుంటారు. పిల్లలు వుంటే ఇక మూడు రోజులకు తీస్తుంటారు. ఏడాది పొడవునా కొన్నా, కొనకపోయినా.. కనీసం సంక్రాంతికి కనీసం ఒక జతైనా కొనడం గోదావరి జిల్లాల్లో పరిపాటి. ఈ కారణంగా ప్రతి కుటుంబంపై బట్టల నిమిత్తం ఆర్థిక భారం పడుతుంది. అయినప్పటికీ కొత్త బట్టలు వేసుకునే అనందంలో ఈ బాధలు మరిచిపోతారు.
కిరాణా ఖర్చు
ఇక పండుగకు పిండి వంటలు, మాంసాహారం వండటం అనవాయితీ. ప్రతి ఇంటిలోనూ ఈ పండుగకు సున్నుండలు, జంతికలు, పాకుండలు, అరిసెలు వండుతారు. ఇక నైవేధ్యాలకు గారెలు, బూరెలు, పులిహోర, చక్కెర పొంగళి, ముక్కల పులుసు తప్పనిసరి. ఇందుకోసం మినుములు, బెల్లం, నూనెలు మొదలైనవి కొనాల్సిందే. ఇంటిలో తయారు చేసే సమయం లేకపోతే బయట కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రతి ఇంటికి ఒక ఖర్చు తప్పనిసరి. తమ ఇంటికి వచ్చే బంధువులు, కొత్త అల్లుళ్లు, దూర ప్రాంతాల్లో స్థిరపడి ఇంటికి వచ్చే కొడుకులు, మనుమళ్లకు రకరకాల వంటలు చేస్తుంటారు. ముందుగానే పెద్ద మొత్తంలో కిరాణా పట్టీ సిద్ధం చేసుకుంటారు. కనుమ రోజున మాంసాహారం అదనం. వీట న్నింటికి ప్రతీ నెలా బడ్జెట్‌కు అదనంగా ఐదు నుంచి పది వేల వరకు కేటాయిం చాల్సిందే.
కొత్త అల్లుళ్లకు కానుకలు
ఇక ఇంటికి వచ్చిన బంధువులకు బట్టలు పెట్టి పంపడం అనవాయితీ. లేకపోతే కనీసం బట్టలు కొను క్కోమని చేతిలో ఎంతో కొంత సొమ్ము పెట్టి పంపిస్తుంటారు. ఇంటికి వచ్చిన పిల్లలకు కొంత నగదు ఇస్తుంటారు. ఎవరినీ ఖాళీగా పంపించరు. ఇది మన గోదావరి జిల్లావాసుల సంప్రదాయం. ఇక కొత్త అల్లుళ్లకు ఇచ్చే కానుకలే వేరు. బంగారం, బైక్, స్థోమతను బట్టి కారు, బట్టలు పెట్టి పంపిస్తుంటారు. కొత్తగా పెళ్లి అయిన అల్లుడు వస్తే అతనితో పాటు అతని తల్లిదండ్రులను ఆహ్వానించి బట్టలు పెడుతారు. ఈ కారణంగా ప్రతి ఇంటిలోనూ ఎంతో కొంత బడ్జెట్ కేటాయిస్తారు.
ఉద్యోగులకు, కార్మికులకు బోనస్‌లు
ఇక పండుగకు బోనస్‌లు, కానుకలు, బట్టలు ఇవ్వడం అనవాయితీ. కంపెనీల నుంచి దుకాణాల్లో పనిచేసే వర్కర్లకు యజమానులు బట్టలు పెట్టి బోనస్ ఇస్తారు. దీని కోసం ముందు నుంచే పొదుపు చేస్తారు. లేకపోతే అదనంగా రుణం తీసుకుని మరీ ఇస్తారు. ఏడాది పొడవునా పని చేసే వారికి ఇలా సంతోష పెడితే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. ఈ కారణంగా ఈ పండుగ వచ్చిదంటే వ్యాపారులపై అదనపు బడ్జెట్ పడుతుంది. ఇక రైతులకు ఇదే ఖర్చు. ఏడాది పొడు గునా.. పొలం పనులు, ఇంట్లో పని చేసే పనివాళ్లకు బట్టలు పెట్టి కానుకలు ఇస్తుంటారు. స్థోమతను బట్టి పెద్ద మొత్తంలో వీరి కోసం ఖర్చు పెడుతుంటారు. ఈ కారణంగా రైతు కుటుంబానికి ఈ పండుగ వచ్చిదంటే అదనపు బడ్జెట్ తప్పదు.
బట్టలు పెట్టడం సంప్రదాయం
ఇంటికి వచ్చే పెద్దలకు, ఆడపడుచులు, కొత్త అల్లుళ్లకు బట్టలు, కానుకలు ఇచ్చి పంపడం ఈ పండుగ సంప్రదాయమని మాజీ సర్పంచ్ వైఎస్ బాబులు అన్నారు. కొత్త అల్లుళ్లకు స్థోమతను బట్టి కానుకలు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగకు మీ అత్తోరు ఏ బహుమతి ఇచ్చారు ? అని అడగడం.. దీనికి తగ్గట్టే అత్తింటి వారు ఖరీదైన బహుమతులు ఇవ్వడం.. చూస్తుంటామన్నారు.