జిల్లా దాటిన ఎరువులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:32 AM
జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తే అధికారుల అనుమతి ఉండాలి.
డీలర్లకు నోటీసులు జారీ చేసిన డైరెక్టర్
పది రోజుల్లో నివేదికకు ఆదేశం
ఎరువుల హోల్‌సేల్ వర్తకులకు వ్యవసాయ శాఖ ఝలక్ ఇచ్చింది. సాగు లేని కాలంలో ఎరువులు విక్రయించడాన్ని తప్పు పట్టింది. నోటీసులు జారీ చేసింది. జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు గత ఏప్రిల్, మే నెలల్లో ఎరువుల తరలించారని గుర్తించింది. 1109 టన్నుల డీఏపీ, యూరియాను తరలించారు. హోల్‌సేల్ డీలర్లు వారీగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి నివేదిక పంపారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తే అధికారుల అనుమతి ఉండాలి. జిల్లా పరిధి దాటి విక్రయించడానికి అనుమతి లేదు. ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచేశాయి. యూరియా, డీఏపీ ధరలను యథాతథంగా ఉంచేలా కేంద్రం రాయితీని పెంచింది. ఈ రెండు రకాల ఎరువుల ధరలు పెరగలేదు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో డీఏపీ, యూరియా ఎరువులకు డిమాండ్ ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాల వారీగా వున్న నిల్వలను సర్దుబాటు చేస్తోంది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు అనధికారికంగా అమ్మకాలు సాగించడాన్ని వ్యవసాయ శాఖ తప్పు పట్టింది. జిల్లా నుంచి ఎక్కువగా తరలి వెళ్లడంపై దృష్టి సారించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని నిల్వలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు.
డీఏపీ లెక్కల్లో తప్పులున్నాయా
రెండు నెలల్లో 1109 మెట్రిక్ టన్నుల ఎరువులు పరిధి దాటి ఇతర జిల్లాలకు తరలించారంటూ ఇచ్చిన నివేదికలో కాస్త తప్పులు దొర్లాయాంటూ వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. ఇతర జిల్లాలకు విక్రయించిన ట్రైసూపర్ ఫాస్పెట్ (టీఎస్పీ) ఎరువును డీఏపీగా నమోదు చేసినట్టు లబోదిబో మంటున్నారు. ఇదే 300 టన్నుల వరకు ఉంది. దీనిని ఆక్వా చెరువుల్లో వినియోగిస్తారు. నాచు కుళ్లిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వరి రైతులు, ఇతర ఉద్యాన రైతులు దీనిని పెద్దగా వినియోగించరు. డైరెక్టర్ నుంచి వచ్చిన నివేదికలో టీఎస్పీకి బదులుగా డీఏపీ నమోదు చేసినట్టు వ్యాపారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ డిమాండ్ లేకపోతే ఇతర జిల్లాలకు తరలించాలంటే అధికారుల అనుమతి ఉండాలి. గతంలో జిల్లా సరిహద్దుల గొడవ ఉండేది కాదు. డీలర్లు ఎక్కడికైనా సరఫరా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇటీవల కాలంలో జిల్లాల సరిహద్దులను పెట్టారు. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో విక్రయించుకునే అవకాశం ఉండేది. జిల్లాల విభజన తర్వాత అదికూడా తగ్గింది. కొత్త జిల్లాల హద్దులకే ఎరువుల విక్రయాన్ని పరిమితం చేశారు. దీంతో వ్యాపారాలు తగ్గిపోయాయి. కంపెనీల నుంచి నిల్వలు వస్తున్నాయి. డీలర్లకు టార్గెట్‌లు ఇస్తున్నారు. ఎరువుల లింకులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర జిల్లాలకు దొంగచాటున విక్రయించడానికి డీలర్లు సాహసిస్తున్నారు. ఇప్పుడదే డైరెక్టర్ స్థాయిలో విచారణ జరుగుతోంది.
లెక్క తేల్చారు..
వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. లెక్కలు తేలుస్తున్నారు. డీఏపీ ఎరువు గతంలో ఏడు వేల టన్నుల వరకు ఉండేది. ఏలూరు జిల్లాకు దానిలో కొంత మొత్తాన్ని అధికారికంగా తరలించారు. ప్రస్తుతం జిల్లాలో 4800 టన్నుల డీఏపీ ఉంది. వాస్తవానికి ఖరీఫ్‌లో 2వేల టన్నులు సరిపోతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరగడంతో రైతులు డిఎపిపై మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఉన్న డీఏపీ నిల్వలను ఇతర జిల్లాలకు తరలించకూడదని నిర్ణయం తీసుకున్నారు. యూరియా 12 వేల టన్నుల వరకు ఉంది. మరో ఐదు వేల టన్నులు అవసరం కానుంది. సీజన్ ప్రారంభమైన తర్వాత దిగుమతి చేసుకునేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు 36 వేల టన్నులు నిల్వ ఉన్నట్టు లెక్క తేల్చారు. ఖరీఫ్‌కు ఎరువుల విషయంలో ఎటువంటి ఢోకా లేదని అధికారులు ధీమాతో ఉన్నారు. ఇతర జిల్లాలకు తరలిపోకుండా కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జెడి వెంకటేశ్వరులు తెలిపారు.