ఎరువు.. బరువు
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:30 AM
యూరియా, డీఏపీ అమ్మకాలపై కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన యాప్ డీలర్లు, రైతులకు చుక్కలు చూపిస్తోంది.
యాప్‌తో బెంబేలు.. అమ్మకాలపై డీలర్ల విముఖత
తప్పులు దొర్లితే సస్పెండ్ అంటూ అధికారులు ఆదేశాలు
జిల్లా సరిహద్దు గ్రామాల్లో అమ్మకానికి భయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
యూరియా, డీఏపీ అమ్మకాలపై కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన యాప్ డీలర్లు, రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రాప్‌లో నమోదైన భూములకు అనుగుణంగా యాప్‌లో రైతు నమోదు చేసిన వివరాల ఆధారంగానే యూరి యా, డీఏపీ ఇస్తారు. ఇప్పటి వరకు కౌలు రైతు లు కమీషన్‌దారుల ద్వారా ఎరువులు తెచ్చుకునే వారు. ఇప్పుడు డీలర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ నుంచి ఎరువు కొనుగోలుచేయాలి. దీని వల్ల రైతులపై రవాణాభారం పడుతోంది. డీలర్ వద్దకు వెళ్లాక సర్వర్ సమస్య వచ్చినా ఎరువులు ఇవ్వడం లేదు. అధికారులు ముందుగా ఎరువు అందించి తర్వాత నమోదు చేసుకోవాలని చెబు తున్నా వ్యాపారులు తమకు ఏమైనా ఇబ్బందు లు వస్తాయేమోనని యాప్‌లోనే అమ్మకాలు చేస్తున్నారు. మరోవైపు కంపెనీలు టార్గెట్ మేరకు విక్రయించకపోతే మరోసారి ఎరువులు సరఫరా చేసే అవకాశం ఉండదని చెబుతున్నా యి. అయినా సరే ప్రస్తుతం అమ్మకానికి విము ఖత చూపుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
సొసైటీల్లో ఎలా తీసుకోవాలి
రైతులకు రుణాలు ఇవ్వడంలో సొసైటీలకు సడలింపు ఉంది. ఇక్కడ రుణాలు వేగవంతం అవుతాయన్న ఉద్దేశంతో ఏలూరు జిల్లాకు చెందిన సరిహద్దు గ్రామాల రైతులు ఇక్కడ సొసైటీల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇక్కడే ఎరువులు కొనుగోలు చేసుకునేవారు. యాప్ వచ్చిన తర్వాత ఆ రైతులకు సొసైటీల నుంచి ఎరువులు తీసుకునే అవకాశం పోయింది. ఎరువులను రుణం రూపంలో మంజూరు చేస్తుండడంతో రైతులు సొసైటీలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుత యాప్‌తో ఇతర జిల్లాల రైతులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు పెదతాడేపల్లి సొసైటీలో ఏలూరు జిల్లాకు చెందిన 20 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. గతంలో వారికి ఇక్కడే ఎరువులు ఇచ్చేవారు. యాప్ వల్ల ఎరువును ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే యాప్‌తో ఎరువుల వినియోగం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. కాని ఎల్‌నినో ప్రభావంతో నాట్లు ఆలస్యం కావడంతో రైతులు తీసుకోకపోవడంతో వినియోగం తగ్గిందని వ్యాపారులు చెపుతున్నాయి. యాప్‌పైనా రైతుల్లో అసహనం మొదలైంది. గతంలో రెండు పర్యాయాలకు ఒకేసారి ఎరువు తెచ్చుకునేవారు. యూరియా, డీఏపీపై యాప్‌లో పరిమితులు విఽధించారు. దీనివల్ల రైతులు ఏకకాలంలో తీసుకునే అవకాశం లేదు. వాణిజ్య పంటలకు అధికంగా యూరియా వినియోగిస్తుంటారు. ప్రస్తుతం వారికి అవసరమైన యూరియా లభ్యం కావడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 6026 టన్నుల యూరియా అమ్ముడుపోయింది. మరో 11,789 టన్నుల యూరియా నిల్వ ఉంది. మార్క్‌ఫెడ్ వద్దే రెండు వేల టన్నుల వరకు నిల్వ ఉండడం విశేషం. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో జిల్లాలోనూ కాస్త డీఏపీకి డిమాండ్ పెరిగింది. వాస్తవానికి జిల్లాలో డీఏపీ వినియోగం అత్యల్పం. ఇతర కాంప్లెక్స్ ఎరువులనే వినియోగిస్తుంటారు ఇప్పడు డీఏపీని అడుగుతున్నారు. ఖరీఫ్‌లో ప్రస్తుతానికి 1,258 టన్నుల డీఏపీ అమ్ముడుపోయింది. మరో 3,197 టన్నులు నిల్వ ఉంది. యాప్ వల్ల దానిని అమ్మడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. సొసైటీలకు ఇచ్చేయండి అంటూ కంపెనీలకు చెప్పేస్తున్నారు.