ఎరువులు భద్రంగా
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:05 AM
ఎరువుల విషయంలో రైతులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. దశా బ్దాల కాలంగా ప్రతి పంటల సీజన్ లో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది.
ఏపీఏఐఎంఎస్ యాప్‌తో రైతులకు ఎరువుల భరోసా
పారదర్శకంగా పంపిణీ .. ఈనెల 8 నుంచే ప్రారంభం
ఇప్పటివరకు 232 టన్నుల యూరియా.. 77 టన్నుల డీఏపీ పంపిణీ
ఎరువుల విషయంలో రైతులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. దశా బ్దాల కాలంగా ప్రతి పంటల సీజన్ లో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా సబ్సిడీ ఎరువులైన యూరియా, డీఏపీ సక్రమంగా అందించేందుకు ప్రత్యేక ఎరువుల సరఫరా యాప్ (ఏపీఏఐఎంఎస్ యాప్)ను రూపొందించింది. జిల్లాలో ఎక్కడైనా వారు తాము పండించే పంటలకు సంబంధించిన ఎరువులను పారదర్శకంగా తీసుకెళ్లేలా యాప్‌ను రూపొందించారు. ‘నా ఎరువులు...నాకే సొంతం’ అన్నరీతిలో యాప్ ద్వారా రైతులు ఎరువులు పొందడానికి అవకాశం కల్పించారు.
(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)
దశాబ్దాల కాలం నుంచి ఎరువుల పంపిణీలో శాస్త్రీయ పద్ధతి లేదని గమనించిన ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించింది. గతంలో ఆధార్‌కార్డు తీసుకువెళితే ఎవరికి పడితే వారికి ఎరువులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. దీంతో ఒక్కోసారి రైతులు కాని వారు కూడా ఎరువులను తీసుకుని బ్లాక్ మార్కెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏ సీజన్‌లో చూసినా యూరియా, డీఏపీ కొరత అంటూ రైతులు గగ్గోలు పెట్టేవారు. అప్పట్లో ఎన్ని ఎరువులు కావాల్సిన ఇవ్వడంతో పక్క రాష్ట్రాలకు దారి మళ్లేవని ఆరోపణలు వినిపించేవి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ ఎరువుల యాప్ (ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్) ద్వారా సక్రమంగా ఎరువులు పొందటానికి అవకాశం ఏర్పడింది. ఈ యాప్ ద్వారా ఎరువుల సరఫరాలో శాస్త్రీయత ఏర్పడింది. జిల్లాలో ప్రతి సారి చేసే ఈ–పంట నమోదు ద్వారా అర్హులైన రైతులు పేర్లు అందులో నమోదు కావడంతో ప్రతి రైతుకు వారి పండించే పంటలకు అనుగుణంగా తగిన మోతాదులో ఎరువులు పొందడానికి అవకాశం ఏర్పడింది.
ఈ ఖరీఫ్ నుంచే అమలు..
ఈ కొత్త యాప్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని ఈ ఖరీఫ్–2026 నుంచే అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈనెల 8వతేదీ నుంచి ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలను ప్రారంభించారు. ఐఎప్‌ఎంఎస్ ఆధారిత పీవోఎస్ పరికరాల ద్వారా ఎరువుల కొనుగోలు జరుగుతుంది. యూరియా, డీఏపీ కాకుండా ఇతర ఎరువుల విక్రయాలు ఈ యాప్‌లో నమోదు లేకుండానే పీవోఎస్ ద్వారా చేసుకోవచ్చు.
డేటా సమీకరణ
జిల్లాలో ఈ–పంట నమోదు ద్వారా 2025–26లో 2,82,000 మంది రైతులు నమోదు చేసుకున్నారు. వీరందరూ ఆర్‌ఎస్‌కె ఇన్‌చార్జి లాగిన్‌లో నమోదై ఉన్నారు. ప్రధానంగా భూయజమానులు, సీసీఆర్‌సి హోల్డర్లు(కౌలు రైతులు), మౌఖిక కౌలు దారులు, ఉమ్మడి యాజమాన్యాలు, వెబ్‌ల్యాండ్‌లో లేని భూములు, సర్వే కాని భూములు సంబంధించిన డేటా రూపొందించటం జరుగుతుంది. డేటా సమన్వయం చేసుకుని ఆర్‌ఎస్‌కే లాగిన్ ద్వారా ఖరీఫ్ –2026 సాగుదారుల వివరాలను సమీకరిస్తారు. ఈ–పంట నమోదులో వచ్చిన వివరాలు ఆధారంగా ప్రస్తుతం రైతులు పండిస్తున్న పంటలను నమోదు చేసి వారు వేసిన పంటల ఆధారంగా ఎంత యూరియా, డీఏపీ కావాలో నిర్దేశిస్తారు. ఒక వేళ సాగుదారు వేరే పంట వేసినా, సాగుదారు మార్పు జరిగినా మార్చుకునే అవకాశం ఉంది. డేటాబేస్‌లో తమ పేరు లేని పక్షంలో ఓటీపీ ధ్రువీకరణతో పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్‌నెంబర్ ద్వారా మార్చుకోవచ్చు. పంట విస్తీర్ణాన్ని మార్పు చేసుకునే అవకాశం కల్పించారు. ఎరువులు కొనుగోలు చేసే వరకు మాత్రమే పంట వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎరువుల కొనుగోలు చేసిన తర్వాత ఆ సీజన్‌కు సంబంధించిన పంట వివరాలను మార్చడం సాధ్యం కాదు. ఈ–పంట నమోదులో వచ్చిన రైతుల వివరాలు ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జి లాగిన్‌నుంచి ఎరువుల డీలర్లకు మ్యాపింగ్ చేయబడతాయి. అందువల్ల ఎరువుల దుకాణాల్లో ఎక్కడైనా రైతులు మూడు దఫాలుగా తమకు కేటాయించిన ఎరువులను కొనుగోలు చేయవచ్చు.
ఎరువుల పంపిణీ ఇలా..
ఈ యాప్ ద్వారా రైతులు తమకు నిర్దేశించిన ఎరువుల దుకాణాలలో మూడు దఫాలుగా ఎరువులు పొందవచ్చు. రైతు తొలుత ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. ఓటీపీ ధ్రువీకరణ చేయాలి. అప్పుడు ఆ రైతుకు సంబంధించిన మొత్తం పంటల వివరాలు, ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలో అందులో తెలుపుతుంది. మూడో వంతు ఎరువులను మొదటి దఫాలో తీసుకువెళ్ళవచ్చు. ఆపై 15 రోజులకు రెండో దఫా ఎరువులను, మరో 15 రోజుల తర్వాత మూడో దఫా ఎరువులను పొందవచ్చు. ఒక వేళ రెండో దఫా ఎరువులను తీసుకువెళ్ళని పక్షంలో మూడో దఫాలోనే రెండు దఫాలకు చెందిన ఎరువులను తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒక ఆర్‌ఎస్‌కేలో నమోదు అయి వేరే ప్రాంతంలో ఎరువులు పొందే అవకాశం కూడా కల్పించారు. ఎరువుల వారీగా పంటల ప్రకారం పరిమితులను కూడా నిర్ధేశించటం జరిగింది. మొత్తం అర్హత మూడు బస్తాలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే విడతల వారీగా గాని, ఒకే విడతలోగాని కొనుగోలు చేసుకోవచ్చు. వరి, మొక్కజొన్న, పత్తి,మిరప పంటలకు డీఏపీ ఎకరానికి ఒక బస్తా (50 కిలోలు) ఇస్తారు.
జిల్లాలో 377 కేంద్రాల్లో ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఇందులో 125 ప్రాథ మిక వ్యవసాయ పరపతి సంఘాలు, 228 ప్రైవేటు ఎరువుల డీలర్లు, 14 డిసిఎంఎస్ ఎరువుల దుకాణాలు, 10 ఆర్‌ఎస్‌కే ల వద్ద ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఈ యాప్ ద్వారా ఈనెల 8న జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటివరకు 232 టన్నుల యూరియా, 77 టన్నుల డీఏపీ ఎరువులు ఉన్నాయి.