విద్యార్థులపై ఫీజుల కత్తి
ABN , Publish Date - May 11 , 2026 | 12:31 AM
ఉన్నత విద్య పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులపై ఫీజల కత్తి వేలాడుతోంది.
వైసీపీ హయాంలో మూడు క్వార్టర్ల బకాయిలు
రూ.75 కోట్ల వరకు పెండింగ్
ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు
స్పష్టం చేస్తున్న యాజమాన్యాలు
ఆందోళనలో విద్యార్థులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్య పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులపై ఫీజల కత్తి వేలాడుతోంది. సర్టిఫికెట్టు ఇవ్వాలంటే బకాయి పడ్డ ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ హయాంలో మూడు క్వార్టర్ల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చెయ్యలేదు. జిల్లాలో రూ.75 కోట్లు మేర బకాయిలు ఉండిపోయాయి. అప్పట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం చదువులు పూర్తిచేసుకున్నారు. ఒక బ్యాచ్ బయటకు వెళ్ళింది. మరో బ్యాచ్ బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. సర్టిఫికెట్లు కావాలంటూ విద్యార్థులు తమ కళాశాలలను సంప్రదిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో బకాయిపడ్డ ఫీజును చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం నాల్గవ సంవత్సరం పూర్తిచేసుకున్న విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగాలు పొందారు. పైచదువుల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. బీటెక్, బీఎస్‌సీ, మేనేజ్‌మెంట్, బీఫార్మసీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగం లేదా పైచదువులు చేరాలంటే సర్టిఫికెట్లు అవసరం కానున్నాయి. కళాశాలను బట్టి ప్రభుత్వం ఫీజలు నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీస ఫీజు రూ.40 వేలు, గరిష్ట ఫీజు రూ.73 వేలుగా నిర్ణయించారు. అందులో నాల్గో వంతు మాత్రమే నాటి ప్రభుత్వం ఫీజు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని చెల్లించి సర్టిఫికెట్లు తీసుకువెళ్ళాలంటూ యాజమాన్యాలు పట్టు పడుతున్నాయి. బకాయిలను ప్రభుత్వం చెల్లించిన తరువాత తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళాశాలల ఖాతాల్లో ఫీజులు జమ చేస్తున్నారు. ఐనా సరే బకాయిలను చెల్లించాలంటూ కళాశాల నుంచి ఒత్తిడి రావటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి ఇంజనీరింగ్ కళాశాలను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి అంత పెద్ద మొత్తం కట్టే స్తోమత లేక ఆందోళనకు గురవుతున్నారు.
అప్పుల ఊబిలో యాజమాన్యాలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకేసారి మూడు క్వార్టర్ల ఫీజు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. అందులో 75 శాతమే కళాశాలలకు జమ చేసింది.ఈ ఏడాది ఫీజులను పూర్తిగా చెల్లించలేదు. వైసీపీ హయంలో బకాయిలపైనా స్పందించడం లేదు. ఫలితంగా కళాశాలలు అప్పులు ఊబిలో కూరుకుపోయాయి.విద్యాసంస్థలు బస్సులను తాకట్టు పెట్టి ప్రైవేట్ పైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు తెచ్చుకుంటున్నాయి. అందువల్లే ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు యాజ మాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపైనే విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.