ఎప్పుడొస్తాయో !
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:25 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో కళాశాలల యాజమాన్యాలు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్
నిధుల విడుదలకు ఉత్తర్వులు
ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్
కళాశాల ఖాతాల్లో జమకాని సొమ్ములు
ఆశగా ఎదురుచూస్తున్న యాజమాన్యాలు
మార్చి నెల జీతాలు, నిర్వహణపై ఆందోళన
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు కోసం ప్రయత్నం
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో కళాశాలల యాజమాన్యాలు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఫిబ్రవరి నెలలో కళాశాల నిర్వహణ కోసం అసర మైన నిధులు వచ్చేశాయంటూ యాజమాన్యాలు సంబరపడ్డాయి. రోజులు గడచి పోతున్నా కళాశాలల ఖాతాలో ఫీజులు జమ కాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆస్తులు తాకట్టు పెట్టేందుకు పలు కళాశాలలు సన్నాహాలు చేసుకుం టున్నాయి. జిల్లాలో సాంకేతిక విద్యను అందించే ఓ కళాశాల అయితే బస్సులను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవా లన్న ఆలోచనలో ఉంది. ప్రభుత్వం నుంచి తొమ్మిది క్వార్టర్ల సొమ్ములు బకాయిలు ఉండిపోవడంతో అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఈ నెలలో జమ అయిపోతాయని అంతా ఆశించారు. దీంతో కళాశాల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. సొమ్ములు ఎప్పుడు వస్తాయా అని క్షణమొక యుగంలా యాజమాన్యాలు గడుపుతున్నాయి.
బకాయి పడ్డ కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు 60 శాతం సొమ్ము జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎస్సీ విద్యార్థులకు సొమ్ములు చెల్లించింది. అవి విద్యార్థుల ఖాతాలోనే జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన ఫీజును ఎస్సీ కేటగిరీ విద్యార్థులు కళాశాలలకు కట్టేశారు. కేంద్ర ప్రభుత్వం బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంజ నీరింగ్ కళాశాలల్లో ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు కనిష్టంగా రూ. 1.50 కోట్ల నుంచి గరిష్టంగా రూ. 3 కోట్లు వరకు కేంద్రం చెల్లించాల్సి ఉంది. అవి కూడా జమ కాకపోవడంతో కళాశాలలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. విద్యార్థులకు చెల్లిస్తే వారి నుంచి రాబట్టవచ్చని ఆశిస్తున్నాయి. బీసీ, ఓసీ విద్యార్థులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు భరి స్తోంది. తొమ్మిది క్వార్టర్లకు సంబంధించి జిల్లాలో దాదాపు రూ.250 కోట్లు చెల్లించాలి. ప్రస్తుతం మూడు క్వార్టర్ల సొమ్ములకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. సొమ్ముల కోసం యాజమాన్యాలు ప్రతిరోజు ఎదురు చూస్తున్నాయి.
మార్చి ఒకటో తేదీ గుబులు
ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులను ఫిబ్రవరి నెలలో ఇచ్చేస్తుందని ఇప్పటిదాకా యాజమాన్యాలు ఎటు వంటి ప్రయత్నాలు చేయలేదు. ఫిబ్రవరి నెలలో నిర్వహ ణకు ఏదో ఒక విధంగా గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. మార్చి ఒకటో తేదీ వచ్చిందంటే సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. గతంలో అయితే రెండు వారాల ముందు నుంచే కళాశాలలు నిధుల వేటలో పడేవి. ఒకటో తేదీనాటికి ఏదో ఒక రూపంలో జీతాలు ఇవ్వడానికి అవస్థలు పడేవి. ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరుకైనా బకాయిలు చెల్లిస్తుందన్న ఉద్దేశంతో రాబోయే వేతనాలపై ధీమాతో ఉన్నారు. ఫిబ్రవరి మాసాంతంలోగానే జమ చేస్తామంటూ ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో యాజమాన్యాలు వేచి చూస్తున్నాయి.