Share News

కన్నీటి ఘోష

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:54 PM

తుఫాన్ల దెబ్బకు వరి సాగు కుదేలవడంతో వ్యవసాయంపై ఆధారపడిన అనుబంధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.

కన్నీటి ఘోష
ఆకివీడు మండలంలో పడవలపై తరలిస్తున్న వరి పంట

వ్యవసాయ అనుబంధ రంగాల్లో సంక్షోభం

జిల్లాలో ఆగిపోయిన 207 రైస్‌ మిల్లులు

పనులు లేక ఇబ్బందుల్లో మిల్లు కార్మికులు, వ్యవసాయ కూలీలు

రోడ్డెక్కని వెయ్యికి పైగా ధాన్యం రవాణా వాహనాలు

ఆరు లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడిపై ఆశలు గల్లంతు

తుఫాన్ల దెబ్బకు వరి సాగు కుదేలవడంతో వ్యవసాయంపై ఆధారపడిన అనుబంధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. సార్వా పంట దెబ్బ తినడంతో రైస్‌ మిల్లులకు గడ్డుకాలం దాపురించింది. రైతులు పన్నెండు వందల కోట్లకు పైగా నష్టపోగా.. వారి నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేసే మిల్లర్లకు, అందులో పనిచేసే కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ధాన్యం రవాణా చేసే వాహనదారుల కు భారీగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గొలుసుకట్టుగా సాగే ఈ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది.

భీమవరం రూరల్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో రెండు లక్షల 30 వేల 875 ఎకరాల్లో సార్వా సాగు జరిగింది. దీని ద్వారా ఆరు లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, తుఫాను వర్షాలకు పంటంతా నీట మునగడంతో అంచనాలు తారుమారయ్యా యి. కనీసం లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యమైనా వస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా లో 207 రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రతి పంటకూ వీటికి సార్టెక్స్‌ చార్జీల కింద క్వింటాకు అరవై రూపాయలు, కస్టమ్‌ మిల్లింగ్‌ కింద పది రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. ధాన్యం వస్తేనే మిల్లర్లకు ఆదాయం. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పది శాతం ధాన్యం మిల్లులకు వచ్చే పరిస్థితి లేదు. చిన్న మిల్లులకు ఐదు నుంచి ఆరు లక్షలు, పెద్ద మిల్లులకు 15 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఏడాదికి లీజులు ఉంటాయి. పంట మాసూళ్లు జరిగి టార్గెట్‌ చేరుకుంటేనే వాళ్లకు ఈ ఖర్చులు పోను లాభం మిగులుతుంది. ఇప్పుడు పంట దెబ్బతినడం, ఒకవేళ మాసూలు చేసినా రంగుమారి, లేత గింజ రావడం వల్ల బియ్యం నాణ్యత ఉండదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

ఉపాధి కోల్పోయిన మిల్లు కార్మికులు

రైస్‌ మిల్లులను నమ్ముకుని జిల్లాలో ఐదు వేల మందికి పైగా కార్మికులు జీవిస్తున్నారు. సార్వాలో రెండు నెలలు, దాళ్వాలో రెండు నెలలపాటు బస్తాకు ఇంత చొప్పున కూలీ తీసుకుంటూ వీరు ఉపాధి పొందుతారు. ఇప్పు డు చేలు పూర్తిగా కుళ్లిపోవడం వల్ల మిల్లులు నడిచే పరిస్థితి లేదు. దీంతో రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయ పనులు చూసు కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

వ్యవసాయ కూలీలకూ గడ్డుకాలమే

సార్వా మాసూళ్ల నుంచి ధాన్యం మిల్లులకు చేరే వరకు వ్యవసాయ కూలీలదే కీలక పాత్ర. జిల్లాలో దాదాపు పది వేల మందికి పైగా వ్యవసాయ పనులకు వెళ్తారు. కోత మిషన్లు తిరగని చోట పంట కోసి, నూర్పిడి చేసి, ధాన్యం ఎండబెట్టడం వంటి పనుల ద్వారా నెలకు పైగా ఉపాధి పొందుతారు. ఒక్కో కూలీ ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం గడిస్తారు. ఇప్పుడు మాసూళ్లు జరిగే అవకాశం లేకపోవడంతో మళ్లీ నారుమడులు వేసే వరకు వీరికి పనులు లేకుండా పోయాయి.

నిలిచిన రవాణా వాహనాలు

ధాన్యం రవాణా చేసే వాహనాల పరిస్థితీ ఇదే విధంగా తయారైంది. జిల్లాలో సుమారు వెయ్యి వరకు ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లబండ్లు ధాన్యం రవాణాకు ఉపయోగపడతాయి. పంట మాసూ ళ్లు ప్రారంభమైన నాటి నుంచి రెండు నెలల పాటు రోజుకు రెండు, మూడు ట్రిప్పులు వేస్తూ రవాణా చేస్తారు. బస్తాకు నలభై రూపాయల చొప్పున ఆరు లక్షల యాభై వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వీరే తరలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ధాన్యం లేకపోవడంతో ఆ వాహనాలన్నీ బయటకు తీసే అవసరమే లేకుండా పోయింది.

వణికిస్తున్న మరో తుఫాన్‌!

తణుకు రూరల్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ ఆరంభంలో ఎల్‌నినో వర్షాభావాన్ని ఎదు ర్కొని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్లు రైతుల ను నిలువునా ముంచాయి. గత నెలాఖరులో వచ్చిన అర్నబ్‌, ఈ నెల మొదటి వారంలో వచ్చిన మురసు తుఫాన్ల దెబ్బకు జిల్లాలో వరి పూర్తిగా నేలకొరిగింది. ఈ విపత్తుల వల్ల జిల్లాలో సుమారు పన్నెండు వందల కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఈ కష్టాల నుంచి తేరుకోకముందే, బంగాళాఖా తంలో మరో వాయుగుండం తుఫాన్‌గా మారు తోందంటూ వస్తున్న వార్తలు రైతులు, సామా న్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నా యి. మరో తుఫాన్‌ వస్తే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడిపై మోయలేని భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.

కాసిన్ని గింజలైనా.. దక్కించుకుందామని..

ఆకివీడు రూరల్‌ నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నీటిలో నాని కుళ్లిపోతున్న పంటను వదిలేయలేక, కాస్తయినా కాపాడుకుందా మని భావించిన రైతులు పడవలపై మాసూ ళ్లు చేస్తున్నారు. బుధవారం ఆకివీడు మండ లం సిద్దాపురం, రాజులపేట, మాదివాడ, గుమ్ములూరు, చినకాపవరం గ్రామాలలో పంటను కోసి పడవపై తరలిస్తున్నారు. నీటి లో దిగి కొయ్యడానికి కూలీలకు, పడవలకు, గట్టుకు చేరవేసేందుకు రైతులకు అదనంగా ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యిం ది. ఇప్పటికే ఎకరాకు పెట్టుబడి రూ.40 వేలు అయ్యిందని, రూ.30 వేలు అదనంగా అయినప్పటికి ఫలితం దక్కలేదని రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:54 PM