Share News

ఈ క్రాప్‌ రెడీ..

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:57 PM

రబీ ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమమైంది. ఈ క్రాప్‌ పోర్టల్‌లో రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రాప్‌ రెడీ..

పోర్టల్‌లో రైతుల జాబితా

వరి రైతులు 1.08 లక్షలు

ధాన్యం కొనుగోలుకు రెడీ

బ్యాంకు గ్యారెంటీలతో

మిల్లర్లు అప్రమత్తం

253 కొనుగోలు కేంద్రాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రబీ ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమమైంది. ఈ క్రాప్‌ పోర్టల్‌లో రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల పునర్విభజన వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఈ–క్రాప్‌ నమోదులో జాప్యం అనివార్యమైంది. ఒకేసారి అన్ని జిల్లాలకు సంబంధించి ఈ–క్రాప్‌లో నమోదైన రైతుల జాబితాను విడుదల చేయడానికి ప్రభుత్వం వేచి చూసింది. జిల్లా రైతుల వివరాలను గురువారం పోర్టల్‌లో పెట్టారు. ఈ సారి వరి పండించే రైతులు 1.08 లక్షల మంది ఉన్నట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ప్రస్తుత రబీలో ధాన్యం ఉత్పత్తులు పెరగనున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం రబీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో 7.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సంకల్పించింది. అవసరమైతే మరింత లక్ష్యాన్ని పెంచనున్నట్టు సంకేతాలు పంపింది. రైతులకు గడువులోగానే సొమ్ములు జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేసుకుంది. ఖరీఫ్‌లో 24 గంటల్లోనే రైతులకు సొమ్ములు జమ అయి పోయాయి.రబీలోనూ అదే తరహాలో సొమ్ములు జమ కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ధాన్యం విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. తొలుత తాడేపలి ్లగూడెంలో ధాన్యం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

మిల్లర్లకు లక్ష్యాలు

జిల్లాలో బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన మిల్లర్లకు లక్ష్యాలను ఇవ్వనున్నారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌, అధికారులు సంప్రదింపులు జరిపి జిల్లాలో మిల్లు స్థాయిని బట్టి ధాన్యం కేటాయిస్తున్నారు. ఇప్పటికే మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. దాదాపు రూ.500 కోట్లు మేర బ్యాంకు గ్యారెంటీలున్నాయి. వాటితో రూ.1000 కోట్లు ధాన్యం నిల్వ చేసుకోవడానికి మిల్లర్లకు అవకాశం ఉంటుంది. పౌరసరఫరాల కార్పొరేషన్‌ అంత మొత్తాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగిస్తోంది.కొనుగోలు ప్రారంభమైన తర్వాత మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యాన్ని అప్ప గిస్తారు. తద్వారా మళ్లీ బ్యాంకు గ్యారెంటీలు అందుబాటులోకి వచ్చేస్తాయి. గతంలో బ్యాంకు గ్యారెంటీల సమస్య కూడా ఉండేది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో గ్యారెంటీలు ఇవ్వలేకపోయేవారు. ప్రస్తుతం బిల్లులు విడుదల చేస్తున్నారు.

బిల్లులు సిద్థం చేస్తున్న ప్రభుత్వం

ఖరీఫ్‌లో మిల్లింగ్‌ చార్జీలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో మిల్లింగ్‌ ఛార్జీలు బిల్లులను సిద్ధం చేయాలంటూ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వింటాకు రూ. 15 వంతున ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనిని పెంచాలంటూ మిల్లర్లు నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పటినుంచో ఉన్న ఛార్జీలు కొనసాగిస్తున్నారు. గడచిన ఖరీఫ్‌కు సంబంధించి రూ. 82 కోట్లు చెల్లించాల్సి ఉంది. త్వరితగతిన చెల్లిస్తే రబీ సీజన్‌లో మిల్లర్లకు భారీ ఊరటే లభించనుంది.

Updated Date - Apr 05 , 2026 | 11:57 PM