Share News

ఫ్యామిలీ సర్వే

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:19 AM

జిల్లాలో గత డిసెంబరు నెలలో చేపట్టిన ఏకీకృత సర్వే వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఫ్యామిలీ సర్వే

ఏకీకృత కుటుంబ సర్వేపై కుస్తీ

ఇంటింటికీ అధికారులు

మొత్తం కుటుంబాలు 6,30,920

పెండింగ్‌ 1,52,532 కుటుంబాలు

ఈ వారంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశం

భీఛవరంటౌన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత డిసెంబరు నెలలో చేపట్టిన ఏకీకృత సర్వే వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. జిల్లాలో 6 లక్షల 30 వేల 920 కుటుంబాలను సర్వే చెయ్యాలని లక్ష్యంతో ప్రారంభించారు. కొన్ని అవాంతరాలతో సర్వే ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 4 లక్షల 78 వేల 388 కుటుంబాలు సర్వే పూర్తి అయింది. లక్షా 52 వేల 532 కుటుంబాలను సర్వే చెయ్యవలసి ఉంది. సర్వే నత్తనడకగా సాగటంతో ఈనెల 19న జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సమీక్ష నిర్వహించారు. వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ వారాంతానికి నూరుశాతం అయ్యేలా ఎంపీడీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

అన్ని శాఖల్లో సర్వేతో ఇబ్బందులు

జిల్లాలోని అన్ని శాఖలకు సంబందించి ఏదో ఇక సర్వే జరగడం, పలు కార్యక్రమాలు నిర్వహణకు ఏకీకృత సర్వేలో ఉద్యోగులే చెయ్యాల్సి రావడంతో సర్వే జాప్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. మొదట్లో రోజుకు 15 వేల కుటుంబాలను సర్వే చేసేవారు. దాంతో రాష్ట్రంలో జిల్లా శాతం తక్కువగా నమోదైంది. ప్రస్తుతం సర్వే వేగం పెరగటంతో మెరుగైన స్థానానికి చేరుకుందని అంటున్నారు. ఈ వారం చివరి నాటికి నూరుశాతం పూర్తి చేసేపనిలో ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 25 వేల కుటుంబాలు సర్వే చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేసి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. జిల్లాలో ఇంకా లక్షా 52 వేల 532 కుటుంబాలు సర్వే చెయ్యవలసి ఉందని ఈ లెక్కన రోజుకు 25 వేల కుటుంబాలు చేస్తే 5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆకివీడు అర్బన్‌లో పెండింగ్‌ ఎక్కువ

ఏకీకృత సర్వేను పరిశీలిస్తే అత్యధికంగా ఆకివీడు అర్బన్‌లో ఇంకా 81 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తణుకు రూరల్‌ ఇంక 2.45 శాతం పూర్తి అయితే నూరుశాతం పూర్తి అయినట్లే . ఇతర మండలాలు, అర్బన్‌ ప్రాంతాలను పరిశీలిస్తే 17 శాతం నుంచి 45 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈనెల 28 నాటికి సర్వే పూర్తి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీ కృతం అవుతాయో చూడాలి.

సర్వే ఎందుకంటే..

ప్రతీ కుంటుంబం సమగ్ర వివరాలను డిజిటల్‌ డేటాబేస్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే–యూఎఫ్‌ఎస్‌) చేపట్టింది. ప్రభుత్వం అందించే పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందిం చేందుకు ఈ సర్వేను చేపట్టారు. సర్వేలో కుటుంబంలోని వ్యక్తులకు సంబందించి పేరు, ఆధార్‌ కార్డు వివరాలు, ఫోన్‌ నెంబరు., విద్యార్హత, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, వయసు ఇలా అన్ని వివరాలు డిజిటల్‌ రూపంలో నమోదు చేస్తున్నారు. వివిధ విభాగాల్లో పదే పదే ధ్రువీకరణ పత్రాలు అందజేసే అవసరం లేకుండా స్మార్ట్‌ ఫ్యామిలీ కార్డు అందజేస్తారు.. సంక్షేమ పథకాలన్నీ ఈ కార్డు ఆధారంగా అందజేస్తారు.

Updated Date - Feb 25 , 2026 | 12:19 AM