Share News

నీటి మాట కారాదు..!

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:46 AM

ఏలూరు నగర వాసులకు ఈ వేసవిలో తాగునీటి సమస్య ఎదురు కాబోతుందా..? ఈ ప్రశ్నకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించకపోతే అవుననే చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీటి నిల్వలు తొమ్మిది అడుగులకు పడిపోయాయి.

నీటి మాట కారాదు..!
సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

ఏలూరు జిల్లాకు వేసవిలో పొంచివున్న నీటి గండం

ఎస్‌ఎస్‌ ట్యాంకులో అడుగంటిన నీటి నిల్వలు

తొమ్మిది అడుగులకు పడిపోయిన నీటిమట్టం

త్వరలో గోదావరి కాల్వ మూసివేత

ఏలూరు నగర ప్రజల్లో మొదలైన ఆందోళన

ఏలూరు టూ టౌన్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర వాసులకు ఈ వేసవిలో తాగునీటి సమస్య ఎదురు కాబోతుందా..? ఈ ప్రశ్నకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించకపోతే అవుననే చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీటి నిల్వలు తొమ్మిది అడుగులకు పడిపోయాయి. ఇది మరింత కిందకు పడిపోతుంది. వేసవిలో గోదావరి కాల్వ మూసివేస్తే ఇరవై ఏళ్లుగా ఎదురుకాని తాగునీటి సమస్య ఈసారి ఏర్పడవచ్చు.

దెందులూరు వద్ద 117 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించినప్పటి నుంచి రోజూ ఉదయం గంట, సాయంత్రం గంటపాటు నగర ప్రజలకు తాగు నీరందిస్తున్నారు. రోజుకు ఒక్కొక్క వ్యక్తికి 135 లీటర్ల నీరు అందుతోంది. ఈ స్టోరేజ్‌ ట్యాంకులో 16 అడుగుల వరకు నీరు నిల్వ ఉంటే రెండు పూటలా సరఫరా చేయవచ్చు. 14 అడుగుల వరకు ఉంటే వేసవిలో తాగునీటి సమస్య రాదు. కాని, ఇప్పుడు తొమ్మిది అడుగులలోపు మాత్రమే నీరు నిల్వ ఉంది. దీనిని ఒకటి, రెండు రోజులు ఉపయోగిస్తే ఖాళీ అవుతుంది.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు గోదావరి కాల్వ నుంచి తోడి నింపుతారు. ఈ కాల్వకు శివారున ఉండటంతో నీరు అధిక ఎత్తులో ప్రవాహం ఉండదు. కనీసం నాలుగడుగుల ఎత్తు నీరు ప్రవహిస్తేనే మోటార్లతో తోడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడుగున్నర ఎత్తులో మాత్రమే నీరు ప్రవహించడంతో తోడే అవకాశం తక్కువ. ఈ నెల 15 నుంచి గోదావరి కాల్వ మూసివేయనున్నారు. తిరిగి జూన్‌ ఒకటో తేదీన తెరిచే అవకాశం వుంది. రానున్న ఈ 45 రోజుల్లో నగర ప్రజలకు తాగు నీరు ఎలా అందించాలన్నదే నగర పాలక సంస్థ పాలకమండలి, అధికారుల ముందున్న ప్రశ్న.

ఎందుకిలా జరిగింది ?

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు గతేడాది తొమ్మిది అడుగుల ఎత్తులో గండి పడింది. దీంతో ట్యాంకులో నీరంతా బయటకు వెళ్లిపోయింది. అప్పుడు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, కమిషనర్‌ భానుప్రతాప్‌, మున్సిపల్‌ యంత్రాంగం వారంపాటు కృషి చేసి గండిని తాత్కాలికంగా పూడ్పించారు. బలహీనపడిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు గట్ల బలోపేతానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) రూ.ఐదు కోట్లు అవసరమని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ట్యాంకు బలోపేతానికి, చుట్టూ గ్రీనరీ ఏర్పాటుకు రూ.ఐదు కోట్లు మంజూరు చేయాలని కార్పొరేషన్‌ పాలక మండలి తీర్మానించింది. మొదటి విడతగా రూ.1.94 కోట్లు రిలీజ్‌ చేసి ట్యాంకు గట్లు బలోపేతం పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో గోదావరి కాల్వ నుంచి నీటిని తోడి ట్యాంకు నింపే అవకాశం లేకపోవడంతో ట్యాంకులో నీరు తొమ్మిది అడుగులకు పడిపోయింది. కాల్వ నుంచి నీరు తోడేందుకు కోట్లు వెచ్చించి 150 హెచ్‌పీ, 75 హెచ్‌పీ, 20 హెచ్‌పీ, 10 హెచ్‌పీ మోటార్లను కొనుగోలు చేసినప్పటికి కాల్వలో నీటి ప్రవాహం లేక మోటార్లు వృథాగా ఉన్నాయి. ఈ వేసవిలో తాగు నీరందించడం కష్టంగా మారనున్నట్లు కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు చెప్పడంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీని కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు జోక్యం చేసుకుని గోదావరి కాల్వ కట్టివేయకుండా ఎస్‌ఎస్‌ ట్యాంకు నింపేందుకు చర్యలు తీసుకోవాలి.

తాగునీటికొరత రానివ్వం

– సురేంద్రబాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌, నగరపాలకసంస్థ

నగర ప్రజలకు వేసవిలో తాగునీటిని అందిస్తాం. గోదావరి నదిజలాలను అధిక మొత్తంలో రిలీజ్‌ చేయడానికి ఇరిగేషన్‌ అధికారులతో సంప్రదిం పులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 15 తర్వాత వినియోగించుకునేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి, కలెక్టర్‌ వెట్రి సెల్వి కృషి చేస్తున్నారు. 13.5 మీటర్ల ఎత్తు వరకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నీటిని నింపి వేసవిలో తాగునీటి కొరత లేకుండా చేస్తాం.

Updated Date - Apr 09 , 2026 | 12:46 AM