Share News

కాసులు గలగల!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:08 AM

రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఇచ్చే శాఖల్లో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ కీలకం. ఈసారి మద్యం పాలసీలో సంస్కరణ లు, షాపులకు పర్మిట్‌ రూమ్‌ కెపాసిటీ పెంచారు. దీంతో ఏలూరు జిల్లాలో ఆదాయం వసూళ్లలో ఇప్పటికే లక్ష్యం కంటే ఏడుశాతం పురోగతిని యంత్రాంగం సాధించింది.

 కాసులు గలగల!

ఆదాయార్జనలో ఎక్సైజ్‌శాఖ ముందంజ

లక్ష్యం రూ.1,187 కోట్లు.. వసూళ్లు రూ.1,265 కోట్లు..

నవోదయ 2.0తో సారా రహిత జిల్లాగా ప్రకటన

‘మార్పు’తో 66 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఇచ్చే శాఖల్లో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ కీలకం. ఈసారి మద్యం పాలసీలో సంస్కరణ లు, షాపులకు పర్మిట్‌ రూమ్‌ కెపాసిటీ పెంచారు. దీంతో ఏలూరు జిల్లాలో ఆదాయం వసూళ్లలో ఇప్పటికే లక్ష్యం కంటే ఏడుశాతం పురోగతిని యంత్రాంగం సాధించింది. నకిలీ మద్యం నివారణకు ఏపీ సురక్ష యాప్‌ ద్వారా ప్రతి బాటిల్‌ను స్కాన్‌ విధిగా అమ్మేలా చర్యలు చేపట్టారు. క్యూఆర్‌ కోడ్‌ ముద్రణతో మద్యం బాటిళ్ల సరఫరా చేపట్టారు. ఇవన్నీ ఆదాయం పెరుగుదలకు దోహద పడ్డాయి.

కూటమి ప్రభుత్వం సరికొత్తగా మద్యం పాలసీ తీసుకురావడంతో పాటు నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల బ్రాండ్ల పేర్లతో మద్యం అమ్మకాలు సాగించడంతో పాటు పొరుగు రాష్ర్టాల బ్రాండ్‌లతో మందుబాబుల జీవితాలతో ఆడుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్‌ పెట్టింది. జాతీయంగా తయారవుతున్న అన్ని బ్రాండ్లను అందించడంతో పాటు ఎంఆర్‌పీ ధరలకు అమ్మకాలు సాగేలా నిరంతర పర్యవేక్షణ సాగుతోంది.

155 షాపుల ద్వారానే..

జిల్లాలో 141 మద్యం దుకాణాలతో పాటు 14 గీత కార్మికులకు ఇచ్చినవి కలిపి 155 మద్యం దుకాణాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎల్‌ డిపోల ద్వారా 14 లక్షల 60 వేల 410 కేసుల లిక్కర్‌, 52 లక్షల 8వేల 655 కేసుల బీరును దుకాణదారులు తరలించుకున్నారు. గతేడాది దసరా, డిసెంబరు 31, ఈ ఏడాది సంక్రాంతికి మందుబాబులు తెగ తేశారు. ఈ క్రమంలో జిల్లాకు రూ.1,187 కోట్లు ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.1,265 కోట్లు వసూళ్లు జరిగాయి. అంటే ఏడు శాతం పురోగతితో రూ.78 కోట్లు అదనపు రాబడి వచ్చింది.

రెవెన్యూ వసూళ్లు ఇలా..

మద్యం విక్రయాల ఆదాయంతో పాటు దరఖాస్తులు, పర్మిట్‌ రూమ్‌ల ఫీజుల తదితర వాటి కింద ఎక్సయిజ్‌ శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. జిల్లాలో 141 షాపుల వివిధ ఇన్‌స్టాల్‌మెంట్‌ల ద్వారా రూ.95.31 కోట్లు, గీత షాపుల ద్వారా రూ.4.44 కోట్లు, 126 పర్మిట్‌ రూమ్‌ల ఫీజుల కింద రూ.4.68 కోట్లు వసూళ్లను చేపట్టారు. మరోవైపు లైసెన్సుల దరఖాస్తుల ఫీజుల కింద 20 బార్‌లకు రూ.2.80 కోట్లు, నాన్‌ రీఫండబుల్‌ ఫీజు రూ.10 వేలు చొప్పున రూ.57 లక్షలు వసూళ్లు చేశారు.

బెల్ట్‌పై దాడులు.. క్యూఆర్‌ కోడ్‌పై అవగాహన

మద్యం షాపుల పరిధిలో బెల్ట్‌షాపులను చాలావరకు ఎక్సైజ్‌ అధికారులు నిలువరించ గలిగారు. టాస్క్‌ఫోర్స్‌తో ప్రత్యేక దాడులు చేస్తూ అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకుంటున్నారు. మరోవైపు నకిలీ మద్యం జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా తనిఖీలు చేస్తున్నారు. మద్యం షాపుల్లోనుక్యూఆర్‌ కోడ్‌ను తనిఖీ చేసుకుని ఆ తర్వాత కొనుగోలు చేసేలా అవగాహన కార్యక్రమాలతో నకిలీలకు అడ్డుకట్ట పడింది.

నవోదయం సక్సెస్‌

జిల్లాలో ఏడు ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 140 గ్రామాల్లో ఏరులై పారిన సారా తయారీని అరికట్టి సారా రహిత జిల్లాగా యంత్రాంగం ప్రకటించింది. ఈ తయారీపై ఆధార పడిన కుటుంబాలకు ‘మార్పు’ కార్యక్రమం 66 కుటుంబాలకు వివిధ రుణాలుగా రూ.52 లక్షలు అందించారు. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాలను చేసేలా ఎక్సైజ్‌శాఖ అధికారులు తీర్చిదిద్దగలిగారు.

Updated Date - Mar 28 , 2026 | 12:08 AM