Share News

కిక్కు తగ్గిందేం ?

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:53 PM

జిల్లాలో మద్యం కొనుగోళ్లు తగ్గాయి. ఎక్సైజ్‌ శాఖ అంచనా తప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10 శాతం అదనపు టర్నోవర్‌ను సునాయాసంగా చేరుకున్నారు. జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంపై ఎక్సైజ్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది.

కిక్కు తగ్గిందేం ?

జూలై నెలలో టార్గెట్‌ అందుకోని ‘పశ్చిమ’

నిల్వలు అధికంగా ఉన్నాయంటూ

బెంబేలెత్తిపోతున్న లైసెన్స్‌దారులు

నిల్వలపై ఆరా తీస్తున్న ఎక్సైజ్‌ శాఖ

లైసెన్స్‌దారులు వెనుకంజకు కారణమేంటి ?

నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం ఉందా ?

జిల్లాలోని అన్ని షాపుల్లో తనిఖీలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మద్యం కొనుగోళ్లు తగ్గాయి. ఎక్సైజ్‌ శాఖ అంచనా తప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10 శాతం అదనపు టర్నోవర్‌ను సునాయాసంగా చేరుకున్నారు. జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంపై ఎక్సైజ్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. తగ్గడానికి కారణాలను అన్వేషిస్తోంది. పన్ను చెల్లించని మద్యం (నాన్‌ డ్యూటీ పెయిడ్‌) అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల విశ్లేషణలు ఇలా ఉంటే లైసెన్స్‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. నిల్వలు అధికంగా ఉండడంతో డిపోల నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేస్తు న్నారు. గడచిన జూలైలో నాలుగు శాతమే పెరిగింది.అదికూడా బీర్‌ల కొనుగోలుతో టర్నోవర్‌ కాస్తయినా పెరిగింది. లిక్కర్‌ విషయంలో మాత్రం లైసెన్స్‌దారులు వెనుకంజ వేశారు. డిపోల నుంచి కొనుగోలు చేయడాన్ని తగ్గించారు. షాపుల వద్ద అమ్మకాలకు, డిపోల నుంచి కొనుగోలుకు మధ్య వ్యత్యాసం ఉండడంతో నిల్వలు అధికంగా ఉన్నాయని లైసెన్స్‌దారులు చెప్పుకొచ్చారు. ఎక్సైజ్‌ అధికారుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. పశ్చిమలోనే పరిస్థితి ఇలా ఎందుకు ఉందంటూ ఉన్నతాధికారుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో షాపుల్లో ఉన్న నిల్వలపై తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీచేశారు. ఒక సర్కిల్‌ పరిధిలో ఉన్న సిబ్బందిని మరో సర్కిల్‌కు పంపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో బుఽధవారం నుంచి తనిఖీలు ప్రారంభించారు. గురువారంతో తనిఖీలు ముగియనున్నాయి. నివేదికను ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు సమర్పించనున్నారు.

జూలైలో టర్నోవర్‌ ఎంతంటే

గత ఏడాది జూలైలో రూ.128 కోట్ల టర్నోవర్‌ సాధిం చారు. ఈ ఏడాది రూ.134 కోట్లు టర్నోవర్‌ నమోదైంది. వాస్తవానికి ఈ ఏడాది రూ. 140 కోట్లకుపైగా టర్నోవర్‌ నమోదు కావాలని ఆశించారు. లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. బీర్‌ల కొనుగోళ్లు గత ఏడాది 72 వేలు కేసులుంటే ఈ ఏడాది జూలైలో 93 వేలకు చేరింది. కానీ లిక్కర్‌ పడిపోయింది. జిల్లాలోనూ జూన్‌ వరకు పదిశాతం అదనపు అమ్మకాలు సాగుతూ వచ్చాయి. అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబరు 30 నాటికి ప్రస్తుత లైసెన్స్‌ గడువు ముగియనుంది. ఇప్పటికే డిపోల నుంచి తీసుకున్న నిల్వలు దుకాణాల్లో పేరుకుపోయాయి. వాటిని విక్రయించుకోవాల్సి ఉంది. అందువల్ల డిపోల నుంచి కొనుగోళ్లు తగ్గిస్తున్నామంటూ లైసెన్స్‌ దారులు తేల్చేశారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. జిల్లాలో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ అమ్మకాలున్నాయని, నిల్వలు కంటే అదే కారణమంటూ ఉన్నతాధికారులు అనుమా నిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్‌శాఖ రంగంలోకి దిగింది. షాపుల్లో నిల్వలపై తనిఖీలు ప్రారంభించింది.

Updated Date - Aug 05 , 2026 | 11:53 PM