లైసెన్స్‌దారులపై ఎక్సైజ్ కత్తి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:27 AM
మద్యం లైసెన్స్‌దారుల మెడపై అఽధికారులు కత్తి పెడుతున్నారు. ఆగస్టు నెల లక్ష్యాన్ని చేరుకోవటానికి కుస్తీ పడుతున్నారు. గతేడాది జిల్లాలో రూ.94 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలు
10 శాతం పెంపునకు కసరత్తు
బెంబేలెత్తుతున్న లైసెన్సుదారులు
వచ్చేనెల 30తో గడువు ముగింపు
రెన్యువల్ ఉంటుందని భరోసా ఇస్తున్న అధికారులు
చేతులెత్తేస్తున్న మద్యం వ్యాపారులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మద్యం లైసెన్స్‌దారుల మెడపై అఽధికారులు కత్తి పెడుతున్నారు. ఆగస్టు నెల లక్ష్యాన్ని చేరుకోవటానికి కుస్తీ పడుతున్నారు. గతేడాది జిల్లాలో రూ.94 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అప్పట్లో లైసెన్సుదారులు డిపోల నుంచి ఆ మేరకు కొనుగోలు చేశారు. ఈసారి మరో 10 శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యాన్ని ఇచ్చింది. ఇదే విషయంలో లైసెన్సు దారులు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చేనెల 30తో రెండేళ్ల లైసెన్స్ గడువు ముగియనుంది అప్పటిదాకా అమ్మకాలు సాగించటానికి వారివద్ద నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఈ నెల లక్ష్యాన్ని చేరుకలేమంటూ మద్యం వ్యాపారులు చేతులె త్తేస్తున్నారు. అఽధికారులు మాత్రం అన్ని విధాల ప్రయాత్నాలు చేస్తున్నారు. లైసెన్స్‌దారులపై ఒత్తిడి తెస్తున్నారు.
రెన్యువల్ ఉంటుందని భరోసా
జిల్లాలో 193 మధ్యం షాపులు ఉన్నాయి. గరిష్టంగా ఒక్కొ షాపులో రూ.2 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని షాపుల్లో మాత్రం రూ.1.50 లక్షలకు మించడం లేదు. లైసెన్స్ దారుల వద్ద రూ.60 లక్షల నుంచి రూ 80 లక్షల విలువైన నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలకు అన్‌సీజన్ నడుస్తోంది. డిసెంబరు మాసాంతం నుంచి అమ్మకాలు జోరందుకుంటాయి. ఫలితంగా లెసెన్సుదారులు ఈనెల లక్ష్యాన్ని చేరుకోలేమని చెబుతున్నారు. డిపోల నుంచి కొనుగోలు చెయ్యటానికి ఆసక్తి చూపటంలేదు. ప్రస్తుత లైసెన్సుదారులకు రెన్యువల్ ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయినా వ్యాపారుల్లో నమ్మకం కుదరడం లేదు. లిఖితపూర్వకంగా హమీ ఇస్తేనే కొనుగోలు చెయ్యగలమని తేల్చి చెబుతున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. అప్పటి దాకా తాము ఎటువంటి కొనుగోళ్లు చెయ్యలేమంటూ కష్టాలు కొని తెచ్చుకోలేమని లైసెన్సు దారులు తేల్చి చెప్పేస్తున్నారు. ఏంచెయ్యాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవలసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలో ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటి దాకా నయానో భయానో లైసెన్సుదారులపై వత్తిడి తీసుకువచ్చారు. లక్ష్యానికి చేరువుగా టర్నోవర్ సాధించారు. ఈసారి మాత్రం లైసెన్సుదారులు అధికారుల మాటలను తోసి పుచ్చుతున్నారు.
ఎన్నికలపైనే ఆశలు
రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. పలితంగా మద్యం కొనుగోళ్ళు అధికంగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసుకుంటోంది. సెప్టెంబరు నెలలో అమ్మకాలకు ఎటు వంటి ఢోకా ఉండదని భావిస్తోంది. స్థానిక ఎన్ని కల్లో పోటీ చేసే ఆశావాహులు అంతా ముందుగానే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికల్లో ఇదే దందా సాగుతోంది. గ్రామాల్లో రహస్యంగా నిల్వలు చేసుకుంటూ వస్తున్నారు. తొలుత మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఆ దిశ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లోను జిల్లాకు చేదు అనుభవం ఎదుర్కోనుంది. వీలీన సమస్యలతో భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీల్లో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. నరసాపురంలోనే ఎన్నికలపై స్ఫష్టత వచ్చింది. హైకోర్ట్డులో కేసు తేలాకే జిల్లాలోని నాలుగు మునిసిపాల్టీలపై స్పష్టత వస్తుంది. ఇది కాస్తా ఎక్సైజ్ శాఖపై ప్రభావం చూపనుంది. ఎన్నికలు జరగకపోతే మద్యం అమ్మకాలు అంతగా ఉండవు.