Share News

గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:46 AM

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఇడా) పరిపాలనా వ్యవస్థ గాడిలో పడుతోంది. గత వైసీపీ హయాంలో పనులు కేటాయించినా.. ఆశిం చిన మేర అభివృద్ధి చేసి చూపించలేక పోయా రు.

గ్రీన్‌సిగ్నల్‌
ఏలూరులోని ఇడా ప్రధాన కార్యాలయం

ఇడాతో పురాల అభివృద్ధి!

పది మున్సిపాల్టీలకు రూ.57 కోట్లు

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

ఎంఐజీ ప్లాట్ల విక్రయాలతో ఆదాయార్జన

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఇడా) పరిపాలనా వ్యవస్థ గాడిలో పడుతోంది. గత వైసీపీ హయాంలో పనులు కేటాయించినా.. ఆశిం చిన మేర అభివృద్ధి చేసి చూపించలేక పోయా రు. పేద వర్గాలకు అతి తక్కువ ధరకు ఎంఐజీ ప్లాట్లు వేసి విక్రయాలు చేయాలని తలపోసినా చేయలేక పోయారు. అప్పట్లో ఆగిన పనులన్నీ గాడిన పెట్టడం ద్వారా 10 మున్సిపాల్టీల్లో రూ.57 కోట్ల వ్యయంతో అభి వృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఇడా ఆవిర్భవించిన ఆరేళ్ల కాలం తర్వాత కార్పొ రేషన్లు, పట్టణాల్లో అభివృద్ధి పనులకు మంత్రి నారా యణ పచ్చజెండా ఊపారు. ప్రధానంగా దీని పరిధిలో 37.32 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 6,658 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగి వుంది. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్‌ నియోజకర్గాలతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని కొంతభాగం కలుపుని ఇది 2019లో ఏర్పడింది. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు తొమ్మిది పురపాలక సంఘాలు, నగర పంచాయతీలున్నాయి.

లే–అవుట్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ ఆదాయాలు

ఇడా పరిధిలో పది పురపాలక సంఘాలే కాకుండా, 40 మండలాల్లోని 727 పంచాయతీలున్నాయి. వీటిల్లో లే–అవుట్లు మంజూరు, బిల్డింగ్‌ ఫీజులు, బిల్డింగ్‌ పీన లైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌), లే–అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఇడాకు ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు, ఇతర చెల్లింపుల కింద రూ.12 కోట్ల సీఎంఎఫ్‌ఎస్‌ ఫండ్‌ సిద్ధంగా వుంది. దీంతో పాటు నగర శివారులో 36.41 ఎకరాల విస్తీ ర్ణంలో 383 ప్లాట్లను ఇడా రెవెన్యూ స్థలంలో అభివృద్ధి చేసింది. వీటిని ఈ–ఆక్షన్‌, ఓపెన్‌ ఆక్షన్‌ల ద్వారా అమ్మ డం ద్వారా రూ.45 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ 73 ప్లాట్లకు వైసీపీ హయాంలో కొంత అడ్వాన్సులు చెల్లింపుల జరిగాయి. వీటిని పూర్తిగా మధ్యతరగతి వర్గాలు అమ్మకం చేపట్టా లని నిర్ణయించారు. అటు తర్వాత మిగిలిన 310 ప్లాట్ల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోందని ఇడా అంచనాలు వేసింది. ఈ ప్రకారం నిధులు మంజూరుకు మంత్రి నారాయణ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

నిధులు మంజూరు ఇలా..

జనాభా దామాషా పద్ధతిలో పురాల్లో తొలి విడతగా సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్డు, డ్రెయిన్లు, పార్కులు, స్ర్టీట్‌లైట్లు ప్రధాన కూడళ్లలో ఏర్పాటుకు ప్రాధాన్యతల వారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఏలూరు కార్పొరేషన్‌కు రూ.16 కోట్లు, జంగారెడ్డిగూడెంకు రూ.2.5 కోట్లు, తాడేపల్లిగూడెంకు రూ.4.5 కోట్లు, తణుకుకు రూ.4కోట్లు, నర్సాపురానికి రూ.2.5 కోట్లు, పాలకొల్లుకు రూ.3 కోట్లు, భీమవరానికి రూ.7 కోట్లు, చింతలపూడి, ఆకివీడు, తిరువూరు నగరపంచాయతీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేశారు. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు.

ఇడా ద్వారా మరిన్ని పనులు చేస్తాం : పెద్దిబోయిన శివప్రసాద్‌, చైర్మన్‌

ఇడా పరిధిలో పది మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చొరవతో శ్రీకారం చుట్టాం. ప్రధానంగా శనివారపుపేటలో అభివృద్ధి చేసిన ఎంఐజీ ప్లాట్ల విక్రయాలతోనే అభివృద్ధి చేయనున్నాం. ఒకవేళ అక్కడ ఆదాయం రాకపోతే ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ల కింద వచ్చే ఆదాయాలను ఇక్కడ ఖర్చు చేస్తాం. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులన్నీ గాడినపెట్టేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం.

Updated Date - Jul 07 , 2026 | 12:46 AM