Share News

ఈఎస్‌ఐ ఆస్పత్రికి సుస్తీ

ABN , Publish Date - May 07 , 2026 | 12:25 AM

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సమస్యలతో సతమతమవుతోంది.

ఈఎస్‌ఐ ఆస్పత్రికి సుస్తీ

సమస్యలతో సతమతమవుతున్న డిస్పెన్సరీ

అరకొర సిబ్బంది..కనీస వసతులు కరవు

కార్మికులకు అందని వైద్యసేవలు

రక్త పరీక్షలే లేవు..అరకొర మందులే

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సమస్యలతో సతమతమవుతోంది. అరకొర సిబ్బంది, పూర్తిస్థాయిలో లేని వైద్యులు, కనీస సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. డిస్పెన్సరీ పరిధిలో సుమారు ఎనిమిది వేల మంది కార్మికుల వరకు ఉన్నారు. వీరందికీ ఈ ఆసుపత్రే దిక్కు.. కానీ ఇక్కడ సరైన వైద్య సేవలు అందక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

తణుకు, మే 6 (ఆంధ్రజ్యోతి) : తణుకు ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. సుగర్‌, రక్త పరీక్షలు చేయాలంటే అవకాశం లేదు. ఇద్దరు వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఒకరు మాత్రమే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మరో వైద్యడు రాజమహేంద్రవరం నుంచి వారానికి మూడు పర్యాయాలు వస్తుంటారు. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఇద్దరు నర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. మహిళలకు అవసరమైన వైద్యురాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గైనకాల జిస్టును నియమించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.మహిళలు వైద్యం కోసం ఖచ్చితంగా రాజమహేంద్రవరం కాని, ప్రభుత్వ ఆసుపత్రికి కాని వెళ్లాల్సిన పరిస్థితి. డిస్పెన్సరీకి వైద్యం కోసం వచ్చే కార్మికులకు ఎలాంటి పరీక్షలు చేయడానికి వీలు లేదు. రక్త పరీక్షలు చేసే యంత్రం మూలనపడింది. కిట్లు అందుబాటులో లేవు.

నెలకు యాబై రిఫరల్‌ కేసులు

ప్రతి నెల కనీసం యాబై రిఫరల్‌ కేసులు రాజమహేంద్రవరం పంపుతుంటారు. జనరల్‌ వైద్యానికి సంబంధించిన మందులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి కూడా ఒకసారి వచ్చిన మందులు మరోసారి రావని కార్మికులు చెబుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు, పక్షవాతం వంటి సమస్యలకు సంబంధించి మందులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వివిధ పరిశ్రమలలో కనీసం ముప్పయి వేల కార్మికులు వరకు పనిచేస్తున్నారు. కానీ ఐఎస్‌ఐ పరిధిలో ఎనిమిది వేల మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారిని కూడా ఐఎస్‌ఐ పరిధిలోకి తీసుకోవాని కార్మికులు కోరుతున్నారు. ప్రతిరోజు వందమంది వరకు డిస్పెన్సరీకి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు.

30 పడకల ఆసుపత్రి చేయాలి

ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీని 30 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది. తణుకు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అదేస్థాయిలో కార్మికులు కూడా పెరుగుతున్నారు. 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తే పూర్తి స్థాయి వైద్యసేవలు అందుతాయి. డిస్పెన్సరీ పనివేళలు మార్చాలి. గతంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా తెరచి ఉండేది. దీనివల్ల కార్మికులు జనరల్‌ డ్యూటీ చేసుకుని సాయంత్రం వచ్చేవారికి ఎంతో ఉపయోగం ఉండేది. ప్రస్తుతం ఉదయం ఒక్కపూట మాత్రమే తెరుస్తున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో కార్మికులకు ఉపయోగపడటం లేదు.

అద్దె భవనంలోనే ..

సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డిస్పెన్సరీకు సొంత భవనం సమకూరలేదు. ప్రారంభం నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతోంది. గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వేల్పూరు గ్రామ సమీపంలో స్థలం చూపించడం, ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు పరిశీలన చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో దాని ఊసే లేకుండా పోయింది.

పేరుకే డిస్పెన్సరీ

తణుకులో డిస్పెన్సరీ పేరుకు మాత్రమే ఉంది. అక్కడ కార్మికు లకు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు. అవసర మైన ఎలాంటి పరీక్షలు చేసే పరిస్థితులు లేదు. కేవలం ప్రాథమిక చికిత్సలు చేయడం, రోజువారీ మందులు ఇవ్వడం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి.

– పీవీ ప్రతాప్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

పరీక్షలు చేయడం లేదు

అనారోగ్యంతో వెళ్ళిన కార్మికులకు అక్కడ ఎలాంటి పరీక్షలు చేయరు. బీపీ షుగర్‌, గ్యాస్‌ అని చెబితే దానికి మందులు ఇచ్చేస్తారు. మందులు కూడా సరిపడ ఇవ్వరు. కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. మైరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలి.

– మంతెన నాగేంద్రకుమార్‌, మున్సిపల్‌ కార్మికుడు, తణుకు

గైనకాలజిస్టు లేక మహిళలకు ఇబ్బంది

తణుకులో ఎక్కువుగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. డిస్పెన్సరీకి వెళితే అక్కడ ఎలాంటి వైద్యసేవలు అందడం లేదు. ప్రధానంగా మహిళలకు అవసరమైన గైనకాలజిస్టు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఆదినారాయణ, సీఐటీయూ మండల కో–కన్వీనర్‌, తణుకు

Updated Date - May 07 , 2026 | 12:25 AM