అడుగంటిన ఆశలు!
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:50 AM
ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొంగువారి గూడెం ఎర్రకాలువ జలాశయం కళ కళలాడేది. వర్షాలు, వరదలతో జలాశయం నిండుకుండలా మారేది. ఖరీఫ్‌తో పాటు రబీ పంటకు సరిపడా నీటిని నిల్వ చేసుకునే పరి స్థితి ఉండేది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా వుం ది.
రికార్డు స్థాయిలో పడిపోయిన ఎర్రకాలువ జలాశయం నీటి మట్టం
గరిష్ఠం నీటిమట్టం 83.5.. కనిష్ఠ నీటిమట్టం 76 మీటర్లు
ప్రస్తుతం 77.8 మీటర్లు.. కనిష్ఠానికి అడుగు దూరం
40 ఏళ్లలో ఏనాడూ లేని దుస్థితి
ఖరీఫ్ చివరి దశలో సాగునీటి గండం..రబీకి నీళ్లు లేనట్టే..
ఆందోళనలో రైతాంగం
జంగారెడ్డిగూడెం రూరల్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి):ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొంగువారి గూడెం ఎర్రకాలువ జలాశయం కళ కళలాడేది. వర్షాలు, వరదలతో జలాశయం నిండుకుండలా మారేది. ఖరీఫ్‌తో పాటు రబీ పంటకు సరిపడా నీటిని నిల్వ చేసుకునే పరి స్థితి ఉండేది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా వుం ది. జలాశయం నీటిమట్టం రికార్డు స్థాయిలో పడిపోయింది. జలాశయం నీటిమట్టం ప్రస్తు తం 77.8 మీటర్లకు చేరింది. జలాశయం నిర్మిం చిన నాటి నుంచి ఈ స్థాయిలో నీటిమట్టం పడి పోవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గరిష్ఠ నీటిమట్టం 83.5 మీటర్లు, కనిష్ఠ నీటిమట్టం 76 మీటర్లు కాగా.. ప్రస్తుతం ఆ స్థాయికి కేవలం ఒక మీటరు దూరంలో నీటిమట్టం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాలు లేక.. వరదలు రాక
సాధారణంగా ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెల ల్లో ఎర్రకాలువ జలాశయానికి ఎగువ ప్రాంతా ల నుంచి భారీగా వరద నీరు చేరుతుండేది. దీనికితోడు వర్షాలకు జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో జలాశయా నికి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరకపోవ డంతో జలాశయంలో నిల్వ ఉన్న నీటిని ఖరీఫ్ సాగుకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెల కొంది. నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది.
ఖరీఫ్ చివరి దశలో గండం
ఏటా జలాశయం నుంచి జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి నుంచి నల్లజర్ల వరకు ఎల్‌ఎంసీ ద్వారా ఐదువేల ఎకరాలకు, ఆర్‌ఎంసీ ద్వారా 10 వేల ఎకరాలకు మొత్తం 15వేల ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్‌లలో సాగు నీరు అందిస్తున్నారు. ఈ ఏడాది కనిష్ఠ నీటి నిల్వల కారణంగా ఖరీఫ్‌లోనే కేవలం ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే
సాగునీరివ్వగలమని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఆయా గ్రామాల నీటి సంఘాల ద్వారా రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం కుడి, ఎడమ కాలువల ద్వారా కలిపి సుమారు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ఉన్న నిల్వలను పరిశీలిస్తే మరికొద్ది రోజులకే నీళ్లు అయిపోయే పరిస్థితి వుంది. వరి పంట చివరి దశలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
రబీకి నీటి కొరత..
ఇక అసలు ఆందోళన రబీ పంటపైనే నెలకొంది. సాధారణంగా ఖరీఫ్ సాగు పూర్తయిన తర్వాత జలాశయంలో మిగిలిన నీటిని రబీ సాగుకు వినియోగించే వారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట చివరి దశకే జలాశయంలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రబీకి చుక్క నీరు విడుదల చేసే పరిస్థితి ఉండక పోవచ్చనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎర్రకాలువ జలాశయం నిర్మించిన 40 ఏళ్లల్లో ఎప్పుడు జలాశయం కింద సాగు చేసే తమకు ఇటువంటి కష్టం ఎదురవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలాశయం నీరే ఆధారం
డి.పార్థసారథి, రైతు, లక్కవరం
గత 35 ఏళ్లుగా ఖరీఫ్, రబీ రెండు సీజన్‌ల్లో వరి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ఎర్రకాలువ పక్కనే మూడు ఎకరాల భూమి కౌలుకు చేస్తున్నా. ఇన్నేళ్లల్లో ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబరు వచ్చినా వర్షాలు పడడం లేదు. జలాశయంపైనే సాగు ఆధారపడి ఉంది. చివరి దశలో నీరందకుంటే దిగుబడి బాగా తగ్గిపోయి పెట్టుబడులూ రావు.
దిగుబడులపై ప్రభావం
బి.జంపాలరెడ్డి, లక్కవరం, రైతు
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎర్రకాలువ నుంచి వచ్చే నీటినే తడులకు వాడుతున్నాం. మరో కొద్దిరోజుల్లో సాగునీరు అందదని చెబుతున్నారు. మరోపక్క వర్షాలు కురవడం లేదు. ఈ క్రమంలో సాగు చివరి వరకు సాగునీరు అందించకుంటే ఆ ప్రభావం దిగుబడిపై పడుతుంది.