Share News

ఆక్రమణల కోరల్లో కాల్వ పరిసరాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:18 AM

ఏలూరు నగరంలో ఐదు కిలోమీటర్ల మేర కృష్ణా కాల్వ కబ్జాకు గురై బక్కచిక్కుతోంది.

ఆక్రమణల కోరల్లో కాల్వ పరిసరాలు
మళ్లీ వెలుస్తున్న బడ్డీలు, షెడ్లు

హే.. కృష్ణా

ఆక్రమణల కోరల్లో కాల్వ పరిసరాలు

తొలగించినా మళ్లీ వెలుస్తున్న బడ్డీలు, షెడ్లు

కాలగర్భంలో కలిసిన రెండు పార్కులు

చోద్యం చూస్తున్న జలవనరులశాఖ, కార్పొరేషన్‌ అధికారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు నగరంలో ఐదు కిలోమీటర్ల మేర కృష్ణా కాల్వ కబ్జాకు గురై బక్కచిక్కుతోంది. ఏళ్ల తరబడి కాల్వ అభివృద్ధికి నోచుకోక పోగా... ప్రజాప్రతినిధుల అండదండలతో ఇష్టారాజ్యంగా వివిధ రకాల షాపులు, జ్యూస్‌ దుకాణాలు, తినుబండారాల అమ్మే కేంద్రా లు కాల్వ ఒడ్డునే సాగిస్తున్నారు. జలవనరుల శాఖ స్థలాలు ఆక్రమణల వ్యవహారంలో గతంలో కలెక్టర్ల పైన కోర్టు ధిక్కార నోటీ సులు జారీ చేసిన సందర్భాలున్నాయి. అయినా చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇక్కడ షాపులకు కరెంట్‌ సరఫరాకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులే ఎన్‌వోసీలు ఇవ్వడం కొసమెరుపు.

ఒకప్పుడు నగరంలో కృష్ణా కాల్వ పరిసరాలంటే కాస్తో, కూస్తో పరిశుభ్రంగా ఉండేది. గత 15 ఏళ్ల నుంచి ఆక్రమణలు పెరిగిపోవడంతో కాల్వ పరిసరాల్లో టన్నుల కొద్ది చెత్త, ఇతర వ్యర్థాల పేరుకుపోయి హే.. కృష్ణా అన్న రీతిన పరిసరాలు కాలుష్యకాసారంగా మారిపోయాయి. కాల్వ ప్రక్షాళనకు అడుగులు పడక పోవడంతో కబ్జా రాయుళ్లకు కలిసొచ్చింది. ఎడాపెడా ఆక్రమణలను వేసి నగరంలో కర్రల వంతెన, వసంత మహల్‌ వంతెనల పరిసరాల్లో విపరీతంగా ఆక్రమణ లు పెరిగిపోయాయి. ఇక్కడ అడ్డగోలు దుకాణాలు ఏర్పాటుకు తెర వెనుక కొందరు దళారీల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎడాపెడా ఆక్ర మణలను ప్రోత్సహించడంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారు లు పాత్ర ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సుందరీకరణ.. పర్యవేక్షణ లేక అధ్వానం

ఏలూరు మునిసిపాలిటీగా ఉన్న కాలంలో 2004లో అప్పటి చైర్‌పర్సన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్‌ సంజయ్‌జాజు, నాటి ఎమ్మెల్యే ఆళ్ల నానిల పర్యవేక్షణలో కృష్ణా కాల్వకు రివిట్‌మెంట్‌ చేసి గ్రీనరీగా పార్కులుగా చేసి.. ఫెన్సింగ్‌ వేశారు. కాల క్రమంలో దీనిని పర్యవేక్షణ చేయకపోవడంతో చేసిన సుందరీకరణ అంతా నీరుగారిపోయింది. పాత బస్టాం డ్‌ వంతెన నుంచి వసంతమహల్‌ కర్మల భవనం వరకు పార్కుగా అభివృద్ధి చేసిన ప్రాంతా లను కార్లు, ఇతర వాహనాలు నిలుపుదల చేసే పార్కింగ్‌ ప్రాంతంగా మార్చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోం ది. ఇక్కడ ఎవ్వరికి ఏ విధమైన అనుమ తులు లేకపోవడం విశేషం. ఇప్పడు కృష్ణాకాల్వ పరిస రాల తీవ్ర దుర్వాసన, చెత్త, మట్టి దిబ్బలతో రూపు రేఖలు మారిపోయాయి.

నర్సరీల కోసం పార్కులు అద్దెకు..

కృష్ణా కాల్వ పరిసరాల్లో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ దామరాజు వెంకట్రావు పంతులు పేరిట ఏర్పాటు చేసిన పార్కు పరిసరాలను నర్సరీల నిర్వహణకు నామమాత్రపు అద్దెలకు ఇచ్చారు. వన్‌టౌన్‌ ప్రజలు, కార్పొరేషన్‌ వచ్చే వారు సేద తీరేందుకు పార్కులు కరువయ్యాయి. మరోవైపు ఆర్యవైశ్య ప్రముఖల ఆధ్వర్యంలో వసంత మహల్‌ నుంచి జూట్‌మిల్లు పరిసరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో ఏర్పాటు చేసిన పార్కు కళావిహీ నంగా మారింది. ఇక్కడ తాగుబోతులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పరిసరాలను అడ్డాగా మార్చేశారు. ఈ రెండు పార్కులను కార్పొరేషన్‌ గ్రాంట్‌తో కొంత మొత్తాలు ఖర్చుపెట్టి బాగు చేస్తే పరిసరాలు ఆహ్లాదకరంగా మార తాయని నగరవాసులు కోరుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే బుజ్జి ఆశయాలకు తూట్లు: ఏలూరు ఎమ్మెల్యేగా పని చేసిన దివంగత బడేటి బుజ్జి ఆధ్వర్యంలో 2018లో, కర్రల వంతెన, బాల యోగి పార్కు పరిసరాల్లో ఆక్రమణలను తొలగించేశారు. ఇక్కడ సుంద రంగా పార్కు చేద్దామని ఆయన భావించారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా అందర్ని ఒప్పించి ఆక్రమణలను ఎడాపెడా తీసేశారు. ఇంతలోనే ఇటీవల ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ మళ్లీ ఆక్రమణలు ఇదే ప్రాంతంలో వెలుస్తున్నాయి. ప్రధానంగా హలీమ్‌ దుకాణాల ఏర్పాటుకు తెరవెనుక భారీ ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా కదులుతారా? : కృష్ణా కాల్వ పరిసరాలు కబ్జా కోరల్లో మరింత చిక్కకుండా ఉండే దిశగా కలెక్టర్‌ వెట్రిసెల్వి, జలవనరులశాఖ, కార్పొరేషన్‌ శాఖలను మరింత కఠినంగా వ్యవహరించకపోతే కాల్వ పూర్తిగా కబ్జాకోరులు చేతుల్లో చిక్కిపోవడం ఖాయమనే భావన నగరవాసులు వ్యక్త పరుస్తున్నారు. ఈ పరిసరాలను అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విషయంలో ఎంపీ పుట్టా మహేశ్‌, ఎమ్మెల్యే బడేటి చంటిలు పూను కోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:18 AM