అంతా మా ఇష్టం
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:30 AM
ఆకివీడులోని పలు ప్రభుత్వ స్థలాలు ఆక్ర మణలకు గురయ్యాయి.
ఆకివీడులో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు
తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆదేశించినా..
కౌన్సిల్ చెప్పినా స్పందించని అధికారులు
ఆకివీడు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆకివీడులోని పలు ప్రభుత్వ స్థలాలు ఆక్ర మణలకు గురయ్యాయి. ఇప్పటికే డ్రెయిన్లు ఆక్రమణలకు గురై పూడుకుపోయి నీటి పారుదల క్షీణించడంతో వర్షాలకు పట్టణం ముంపునకు గురవుతోంది. డ్రెయిన్లు ప్రక్షాళన చేయాలి. జాతీయ రహదారికి సమీపం లోని బందిల దొడ్డి, అయి–భీమవరం రోడ్‌కు ఎదురుగా శ్మశానానికి వెళ్లే రహదారి ఆక్ర మించుకొని దుకాణాలు నిర్మించారు. స్థానిక హై డాక్టర్ వీధిలో ఎనిమిదిసెంట్లు స్థలాన్ని పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి బందిలదొడ్డిగా వినియోగిస్తున్నారు. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గిపోవడంతో ఇది వినియోగంలో లేకపోయింది. ఈ స్థలం ప్రెవేట్ మార్కెట్ రేటు ప్రకారం రూ.4 కోట్లపైమాటే. శ్మశానం రోడ్‌లోని స్థలం కోట్లలో ఉంటుంది. ఈ స్థలాలు చుట్టూ ఆక్రమణలు జరిగినా అధి కారులు చర్యలు చేపట్టడం లేదు. అక్కడ దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చుకున్నారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకో వాలి. ‘నగర పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వం స్థలాన్ని దేన్నీ వదలం. సర్వే చేయించి స్వాధీనం చేసుకుం టా’మని నగర పంచాయతీ కమిషనర్ జి.కృష్ణమోహన్ తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ చెప్పినా లెక్కలేదు
బందిలదొడ్డి ఆక్రమణపై డిప్యూటీ స్పీకర్ రఘురామ దృష్టికి తీసుకెళ్లగా సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని కమీషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నా సర్వే చే యలేదు. కౌన్సిల్ సమావేశంలో కమిష నర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.
– బొల్లా వీరశ్వేత, కౌన్సిలర్, ఆకివీడు
నగర పంచాయతీ నుంచి వచ్చే ఆదాయం జీతాలు, ఖర్చులకు సరిపోతోంది. ఇలాంటి ఆక్రమణలు తొలగించి, దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇస్తే ఆదాయం సమకూరుతుంది.
– కట్టా రవి, కౌన్సిలర్, ఆకివీడు
నగర పంచాయతీ పరిధిలోని పలు ఆక్రమణలకు సంబంధించి సర్వే నెంబర్లతో సహా ఆధారాలున్నాయి. వాటిని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
– మోరా రామిరెడ్డి, ఆకివీడు