Share News

ఉత్సాహంగా క్రీడా పోటీలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:56 PM

శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని, ధృఢంగా ఉంటేనే వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ గాయత్రి అన్నారు.

ఉత్సాహంగా క్రీడా పోటీలు
ఏలూరులో మహిళా క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ గాయత్రి

మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు పోటీల నిర్వహణ

ఏలూరు రూరల్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి) : శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని, ధృఢంగా ఉంటేనే వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ గాయత్రి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీవో మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ కె.సునీత ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఏఎస్‌ఆర్‌ స్టేడియం సమీపంలోని ఇరిగేషన్‌ కార్యాలయం ప్రాంగణంలో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలను ఏలూరు తహసీల్దార్‌ గాయత్రి, ఏపీ ఎన్జీవోస్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఏపీ ఎన్జీవోస్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడం అన్నారు. విజేతలకు ఈనెల 7న జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఖోఖో, కబడ్డీ, పరుగు పందెం, ఛైర్‌, రింగ్‌ ఆట, అథ్లెటిక్స్‌, షాట్‌ఫుట్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం కార్యదర్శి నెరుసు రామారావు, ఏలూరు యూనియన్‌ అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్‌రాజు, ఇన్‌చార్జి ఐసీడీఎస్‌ అధికారి తులసి, సూర్యచక్రవేణి, అసోసియేషన్‌ కార్యదర్శి మల్లిక, ట్రెజరర్‌ బి.వసంత, కో–కన్వీనర్‌ టి.కుసుమ కుమారి పాల్గొన్నారు. మహిళ వింగ్‌ ఛైర్‌పర్సన్‌ కె.సునీత, కోచ్‌ ఛైర్‌పర్సన్‌ వి.తులసి, ఏపీ ఎన్జీవో వైస్‌ ప్రెసిడెంట్‌ ఈ సత్యభారతి, కన్వీనర్‌ డి కృష్ణవేణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:56 PM