Share News

మైనార్టీ శాఖపై చిరుద్యోగి పెత్తనం

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:02 AM

ఏలూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా ఒక శాఖలో గరిష్టంగా మూడేళ్లకు మించి పనిచేయకూడదు. కాని, జిల్లా పరిషత్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన పదమూడేళ్లుగా ఒకే కుర్చీలో అతుక్కుపోయాడు.

మైనార్టీ శాఖపై చిరుద్యోగి పెత్తనం

డిప్యుటేషన్‌పై వచ్చి పదమూడేళ్లుగా తిష్ట

ప్రతి పనికి లంచాలు, కమీషన్లు ఇవాల్సిందే..!

చోద్యం చూస్తున్న జడ్పీ అఽధికారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఏలూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా ఒక శాఖలో గరిష్టంగా మూడేళ్లకు మించి పనిచేయకూడదు. కాని, జిల్లా పరిషత్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన పదమూడేళ్లుగా ఒకే కుర్చీలో అతుక్కుపోయాడు. అడిగే నాథుడు లేక పోవడంతో ఆ శాఖకు తానే బాస్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. నెలల తరబడి ఫైళ్లను తన వద్దే పెట్టుకుని కాలయాపన చేస్తుంటాడు. ఫైళ్లు కదపాలంటే లంచాలు డిమాండ్‌ చేస్తున్నాడన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి ఖాజీ పోస్టు కోసం ప్రొసీజర్‌ అంతా పూర్తి చేసి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, సదరు ఉద్యోగి ఆ ఫైలును ఉన్న తాధికారుల వద్దకు పంపకుండా తొక్కిపెట్టాడు. విసుగు చెందిన బాధితుడు అప్పటి మంత్రిని ఆశ్రయించగా, ఆయన సదరు ఉద్యోగిని పిలిచి మందలిస్తే తప్ప ఫైలు ముందుకు కదల్లేదు.

ఇఫ్తార్‌ విందుల్లోనూ చేతివాటం

ప్రభుత్వం మైనార్టీలకు ఏటా ఇచ్చే ఇఫ్తార్‌ విందుల్లోనూ ఈ ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తు న్నాడు. ఏలూరు నగరంలో ఇరవైకి పైగా మసీ దులు, అంజుమన్‌ కమిటీలను పిలిచి విందు ఇస్తుంటారు. దీనికి లక్షలోపే ఖర్చవుతుంది. కానీ, ఒకటిన్నర లక్షలకు పైగా నిధులను స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే సెమీ క్రిస్మస్‌, మైనార్టీ దినోత్సవాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ అంతా ఈయన కను సన్నల్లోనే జరుగుతుంది. కొందరు రాజకీయ నాయకులతోపాటు గతంలో పనిచేసిన కొంద రు జడ్పీ సీఈవోల అండదండలు ఉండటంతో ఇతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జడ్పీ విభజనతో మాతృశాఖలో సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో.. వివాదాస్పదంగా మారిన ఈ ఉద్యోగి డిప్యుటేషన్‌ రద్దుపై జడ్పీ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి దృష్టి సారించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 01:02 AM