విముక్తి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:35 AM
నిషేధిత జాబితాలో చేర్చిన జిరాయితీ, అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాబితా నుంచి విముక్తినిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం కీలక నిర్ణయం
అసైన్ ్డ , జిరాయితీ భూముల రైతులకు ఊరట
అన్యాక్రాంతమైన అసైన్డ్ ల్యాండ్‌లపైనే సందిగ్ధత
గతంలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలత
పెద్దల చేతుల్లోనే భూములు
(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)
నిషేధిత జాబితాలో చేర్చిన జిరాయితీ, అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాబితా నుంచి విముక్తినిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో వందల మంది రైతులకు ప్రయో జనం చేకూరనుంది. జిల్లాలో దాదాపు 1000 ఎకరాల భూములను నిషేధిత (22 ఎ) జాబితాలో చేరిపోయాయి. అసైన్డ్ భూములు అనుభవిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం లభించనుంది. సుదీర్ఘకాలంగా అంటే 20 ఏళ్లపాటు అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులకు రిజిస్ర్టేషన్ చేసుకునే హక్కును కల్పించనున్నారు. మరోవైపు జిరాయితీ భూములు కూడా నిషేధిత జాబితాలో కలసిపోయాయి. వాటిని కూడా పరిష్కరించ డానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆర్జీలను స్వీకరిస్తు న్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరలోనే రైతులకు సానుకూలంగా ప్రకటన చేయనున్నారు. వాస్తవానికి జిల్లాలో కాళ్ల, నర్సాపురం, భీమవరం రూరల్ మండలా ల్లోనే అసైన్డ్ భూములు అధికంగా ఉన్నాయి. కొందరి వద్దే అవి ఇప్పటికీ ఉన్నాయి. గతంలో భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ లాండ్‌ను ప్రభుత్వం కేటాయిం చింది. అప్పటినుంచి అతికొద్ది మంది రైతులు మాత్రమే సొంతంగా అనుభవిస్తున్నారు.మిగిలిన భూములన్నీ అన్యాక్రాంతమై పోయాయి. బినామీ పేర్లతో కొనుగోలు చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు అయిపోయాయి. కాళ్ల మండలంలో ఇటువంటి దందా అధికంగా ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో అసైన్ట్ ల్యాండ్ భూములు పేరుతో ఇంకా భూము లున్నాయి. వాటిని రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు.కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.భూములను అనుభవిస్తున్న సన్న, చిన్నకారు రైతులకు వారి పేరుమీదే క్రమబద్ధీకరించాలంటూ గత తెలుగుదేశం ప్రభుత్వం లోనే నిర్ణయించింది. అప్పట్లో అది అమలుకు నోచుకోలేదు. వైసీపీ హయాంలో మాత్రం నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి ఫ్రీ హోల్డ్ ఇచ్చారు. అప్పట్లో చుక్కల భూములను మినహాయింపు నిచ్చారు. దేవదాయ, రెవెన్యూ భూములను కూడా అక్రమ రిజిస్ర్టేషన్‌లు చేసుకోవడానికి ఫ్రీహోల్డ్ ఇచ్చిందంటూ గతంలో విమర్శలు వెల్లువెత్తాయి.
కూటమి ప్రభుత్వంలో పరిశీలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ హోల్డ్ భూములపై మళ్లీ నిషేధం అమలులోకి తెచ్చింది. గత ప్రభు త్వంలో రిజిస్ర్టేషన్‌లు జరిగిన భూములను పరిశీలించింది. రిజిస్ర్టేషన్ శాఖ నుంచి రికార్డులను తెప్పించుకుంది. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ రికార్డులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2.50 ఎకరాల్లోనే అక్రమ రిజిస్ర్టేషన్ జరిగినట్టు గుర్తించారు. వాటిని కూడా రద్దు చేస్తూ రిజిస్ర్టేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంకోవైపు ప్రీహోల్డ్‌ను నిలిపివేసింది. జిరాయితీ భూముల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం తాజాగా వెసులు బాటు కల్పిం చింది. కాళ్ల, భీమవరం, నర్సాపురం తీర ప్రాంత పరిధిలో సుమారు 8 వేల ఎకరాల్లో అసైన్డ్, ఇతర భూములున్నాయి. అందులో వెయ్యి ఎకరాలకు మినహాయింపు ఇవ్వడానికి అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. వాటికి ఇప్పుడు 22ఎ నుంచి విముక్తి లభించనుంది.
పెద్దల చేతుల్లో భూములు
జిల్లాలో అసైన్ట్ భూములు చేతులు మారిపోయాయి. పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అనధికారి అగ్రిమెం ట్‌లతో పెద్దలు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. చేపల చెరువులు కూడా తవ్వుకు న్నారు. సాగు చేసుకుంటున్నారు. గతంలో వామపక్షాలు ధర్నా చేసిన సందర్భాలున్నాయి. చేపలసాగులో ఉన్న అసైన్డ్ భూముల్లో జెండాలు పాతారు. తదుపరి రోజుల్లో ఉద్యమాలు సద్దుమణి గాయి. కానీ అసైన్డ్ భూములు మాత్రం పెద్దల ఆధీనంలో ఉన్నాయి. కొందరు రైతులు సాగుకోసం ఇచ్చేశారు. దీనివల్ల ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ క్రమబద్ధీకరణపై ఆచితూచి అడుగులు వేస్తోంది. పెద్దల చేతుల ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తే బినామీ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాటిపై రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం కష్టతరం కానుంది. ఇటువంటి సమస్యలతో క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. కానీ అర్హత ఉన్న రైతులకు వెసులు బాటు ఇచ్చేలా తాజాగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఆ దిశగా జిల్లా అధికారులు అడుగులు వేస్తున్నారు.