నేటి నుంచి ఏలూరు జడ్పీ
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:16 AM
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ శుక్రవారంతో మూడు జిల్లా ప్రజా పరి షత్‌లుగా మార్పు చెందబోతోంది. ఏలూరులోని జిల్లా ప్రజాపరిషత్ ఏలూరు జిల్లాకే పరిమితం కానుంది.
ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వెట్రిసెల్వి
తాత్కాలికంగా 39 మంది ఉద్యోగులు కేటాయింపు
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ శుక్రవారంతో మూడు జిల్లా ప్రజా పరి షత్‌లుగా మార్పు చెందబోతోంది. ఏలూరులోని జిల్లా ప్రజాపరిషత్ ఏలూరు జిల్లాకే పరిమితం కానుంది. ఈనెల 24తో జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ పదవీకాలం ముగియడంతో 25వ తేదీ నుంచి ఏలూరు జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యే కాధికారిగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. 1936లో స్వాతంత్ర్యానికి పూర్వం ఏలూరులో జిల్లా బోర్డు ఏర్పాటు కాగా 1959లో జిల్లా పరిషత్‌గాను, 1987 లో మండల వ్యవస్థ ఏర్పాటు తర్వాత జిల్లాప్రజాపరిషత్ గాను ఏర్పాటు అయింది. తొలుత జిల్లాలో 46 మండలాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం రెండు మండలలాలు విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న 48 మండలాల్లో 19 మండలా లు ఏలూరు జిల్లాలో ఉండగా, జిల్లాల విభ జన తర్వాత కృష్ణా జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాలు ఈ జిల్లాలో కలవడంతో ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ 27 మండలాలతో కొన సాగనుంది. భీమవరం కేంద్రంగా ఏర్పాటు అవు తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ 20 మండలాలతో ఏర్పాటు అవుతోంది. ఇక మిగిలిన 9 మండలాలు రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు అవుతున్న తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌లో విలీనం కానున్నాయి.
తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు
కొత్త జిల్లా ప్రజాపరిషత్‌లకు తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్‌లో మొత్తం 117 ఉద్యోగ పోస్టులుండగా ఇందులో ప్రస్తుతం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 95 పోస్టులలో పనిచేసే వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులను ఈ మూడు జిల్లా ప్రజాపరిషత్‌లకు కేటాయించారు. ఏలూరు జిల్లా ప్రజాపరిషత్‌కు 39 మంది, పశ్చిమకు 37 మంది, తూర్పుగోదావరి జడ్పీకి 19 మంది ఉద్యోగులను కలెక్టర్ కేటాయించారు. మిగిలిన ఖాళీ పోస్టులలో ఏలూరు జడ్పీకి ఎనిమిది మంది, పశ్చిమ జడ్పీకి 11 మంది, తూర్పుగోదా వరి జడ్పీకి మూడు పోస్టులు కేటాయించారు.
కృష్ణాతో వీడనున్న 67 ఏళ్ల అనుబంధం
నేటి నుంచి పూర్తిగా ఏలూరు జిల్లాలో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు
ముదినేపల్లి: కృష్ణా జిల్లా పరిషత్‌తో కైక లూరు, నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఉన్న 67 ఏళ్ల అనుబంధం శుక్రవారంతో తెగిపో నుంది. 1959 నవంబరు 1న కృష్ణా జిల్లా పరి షత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాలు ఈ జడ్పీ పరిధిలోనే ఉన్నా యి. జిల్లా పరిషత్‌ల పాలక వర్గాల పదవీ కాలం గురువారంతో ముగియడంతో శుక్రవారం నుంచి కొత్త జడ్పీలు ఏర్పాటు కానుండడంతో ఈ నియోజకవర్గాలు ఏలూరు జిల్లా పరిషత్ పాలనలోకి రానున్నాయి.
కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం ముగియకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ పరంగా ఈ నియోజక వర్గాలకు కృష్ణా జిల్లా పరిషత్‌తోనే లావాదేవీలు సాగాయి. రెవెన్యూతోపాటు ఇతర శాఖలతో సంబంధాలు ఏలూరు జిల్లాతోనే కొనసాగాయి.