భారీ వాహనాలకు బ్రేక్
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:29 AM
ఏలూరు నగరంలోకి ఉద యం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాలు జా రీ చేశారు.
ఏలూరు శివార్లలో ట్రాఫిక్, ఈ–బీట్ పోలీసుల గస్తీ
ఏలూరు క్రైం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి):ఏలూరు నగరంలోకి ఉద యం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాలు జా రీ చేశారు. నిబంధనలు మీరి ప్రవేశిస్తే వాహన యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం నగరానికి వచ్చే అన్ని మార్గాల శివార్లలో ట్రాఫిక్, ఈ–బీట్ పోలీసులు గస్తీ నిర్వహించారు. టిప్పర్లు వస్తే వెనక్కు పంపించారు. నగరంలో గతంలో టిప్పర్ల వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఇష్టానుసారం భారీ వాహనాలు ప్రవేశిస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. 23వ తేదీ రాత్రి మాదేపల్లి రోడ్డు సుంకరవారి తోట బ్రిడ్జి వద్ద ఒక లారీ సైకిలిస్టును ఢీకొనడంతో మృత్యువాతపడ్డాడు. ల్యాబ్ టెక్నీషియన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 24 ఉదయం మోటారు సైకిల్‌పై ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వస్తుండగా ఫిల్‌హౌస్‌పేట వద్ద లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్థానికులు తమ ప్రాంతంలోకి భారీ వాహనాల రాకపోకలు నిషేధించాలని, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిరసిస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ వారితో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇనస్పెక్టర్ లక్ష్మణరావు మోటారు వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడానికి చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. లైసెన్సు లేకుండా వాహనాలను నడిపితే ఐదు వేలు, హెల్మెట్ లేకుంటే రూ.1,000, త్రిబుల్ రైడింగ్‌కు రూ.1,000, ప్రమాద కరమైన డ్రైవింగ్‌కు మొదటిసారి రూ.1,500, రెండోసారి పది వేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.