Share News

చోరీ సొత్తు ఇంటికే..!

ABN , Publish Date - May 06 , 2026 | 12:33 AM

జిల్లాలో వివిధ నేరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రాజెక్టు రీస్టోర్‌లో భాగంగా పోలీసులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అప్పగించారు.

చోరీ సొత్తు ఇంటికే..!
మహిళకు సెల్‌ఫోన్‌ అందిస్తున్న పోలీసులు

బాధితుల ఇళ్లకు వెళ్లి అందించిన పోలీసులు

మీ ఫోన్‌ పోయిందా..? అది ఇదేనా ?

అయితే మీరు తీసుకోండి..

మీ నగలు పోయాయా.. మీ బైక్‌ అపహరించారని ఫిర్యాదు చేశారా ?

మీ బైక్‌.. మీ డబ్బులు.. పోయాయని ఫిర్యాదు చేశారు.. కదా..? మేం వెతికి పట్టుకొచ్చాం.. తీసుకోండి అంటూ పోలీసులు బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ అప్పగించారు.

ప్రాజెక్ట్‌ రీ స్టోర్‌ పేరిట ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌ చేపట్టిన ప్రత్యేక కార్యకమంతో ప్రజలకు పోయిన వస్తువులు త్వరితగతిన దక్కుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు క్రైం, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ నేరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రాజెక్టు రీస్టోర్‌లో భాగంగా పోలీసులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అప్పగించారు. జిల్లాలో మంగళవారం రూ.2.93 కోట్ల సొత్తును పోలీసులు పోగొట్టుకున్న వారికి తిరిగి అందజేశారు. ఒక కేజీ 20 గ్రాముల బంగారం, రూ.1.32 కోట్ల నగదు, 30 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, 248 మొబైల్‌ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. చోరీ సొత్తు స్టేషన్లలో ఉంచకుండా ‘ప్రాజెక్టు రీస్టోర్‌’ పేరుతో బాధితులకు తక్షణమే అందించేవిధంగా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చర్యలు తీసుకున్నారు. ఏదైనా చోరీ కేసుల్లో నేరస్తుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు బాధితుడు పొందాలంటే కోర్టు అనుమతి తీసుకుని పొందేవారు. ఎస్పీ కిశోర్‌ బాధితులకు చోరీ సొత్తు వెంటనే అందించే విధంగా చర్యలు చేపట్టారు. గతంలో కూడా రూ.5 కోట్ల చోరీ సొత్తును పోలీసులు నేరుగా బాధి తులకు స్వయంగా అందించారు. ఎస్పీ కిశోర్‌ కూ డా పలువురు బాధితులకు బంగారు ఆభరణాలు, నగదును అందించారు. మరోసారి మంగళ వారం జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించి రికవరీ చేయబడిన చోరీ సొత్తును బాధితులకు పోలీసులు స్వయంగా అప్పగించారు. సైబర్‌ సెల్‌ విభాగం ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఫోన్లను ట్రాక్‌ చేయడంలో ప్రతిభ కనబర్చింది. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి వస్తాయని ఆశ వదిలేసుకున్న బాధితులకు పోలీసులు స్వయంగా ఇంటికి వెళ్లి ఫోన్లు అప్పగించడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 248 ఫోన్లు (వాటి విలువ రూ.37.2 లక్షలు) అప్పగించారు. జిల్లా ఎస్పీ చేపట్టిన ప్రాజెక్టు రీస్టోర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - May 06 , 2026 | 12:33 AM