Share News

బాలింతకు హెచ్‌ఐవీ లేకున్నా ఉన్నట్టు నిర్ధారణ

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:19 AM

హెచ్‌ఐవీ లేకున్నా ఓ బాలింతకు ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

బాలింతకు హెచ్‌ఐవీ లేకున్నా ఉన్నట్టు నిర్ధారణ

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్‌ సిబ్బంది నిర్వాకం

ల్యాబ్‌ సిబ్బంది, వైద్యురాలిపై చర్యలకు బాధితుల డిమాండ్‌

ఆసుపత్రి ల్యాబ్‌లో పరీక్షలన్నీ తప్పులతడకలే !

అయోమయంలో రోగులు

ఏలూరు క్రైం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ లేకున్నా ఓ బాలింతకు ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాళ్ల మండలానికి చెందిన ఓ గర్భిణీ పురుడు పోసుకోవడానికి ఈనెల 4వ తేదీ సాయంత్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. చేరిన గంటలోపే నార్మల్‌ డెలివరీ జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం బాలింత రక్తాన్ని తీసిన సిబ్బంది ప్రభుత్వాసుపత్రి ఎంసీహెచ్‌ భవనంలోని ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా ఒకసారి నెగిటివ్‌, రెండుసార్లు పాజిటివ్‌ వచ్చింది. రిపోర్టు చూసిన గైనిక్‌ వైద్యులు బాలింతపై ఆమె భర్తపై చిందులు తొక్కారు. ఎవరి ప్రాణాలతో చెలగాటం ఆడదామని ఒంటి నిండా జబ్బులు పెట్టుకుని ఆసుపత్రులకు వస్తారంటూ దుర్భాషలాడారని బాధితులు వాపోయారు. భర్త ఆటో డ్రైవర్‌ కావడంతో అతడిని అవమానంగా మాట్లాడారు. చివరకు ఆ బాలింత గ్రామానికి సమాచారం అందించేశారు. అక్కడ ఉన్న ఏఎన్‌ఎం కొద్ది రోజుల క్రితమే ఆమెకు రక్త పరీక్షలు చేయించామని హెచ్‌ఐవీ నెగిటివ్‌ వచ్చిందని మీరు చెప్పే రిపోర్టు ఒక్కసారి సరిచూసుకోండి అంటూ చెప్పిం ది. ఇంతలోనే బుధవారం ఉదయం పుట్టిన బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా ఉండేందుకు సిరప్‌ వేయడానికి సిద్ధపడ్డారు. కౌన్సిలర్‌ వీసీటీసీ (వాలెంటరీ కౌన్సెలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌, స్వచ్ఛంద కౌన్సెలింగ్‌, హెచ్‌ఐ వి పరీక్ష కేంద్రం) పరీక్ష అనంతరమే సిరఫ్‌ వేయాలని సూచించడంతో బుధవారం ఉదయం బాలింత రక్తాన్ని వీసీటీసీ కేంద్రంలో పరీక్ష చేయిం చారు. ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. అంతకు ముందు ఎంసీహెచ్‌ బ్లాక్‌లో వున్న ల్యాబ్‌లో ర్యాపిడ్‌ టెస్ట్‌(హెచ్‌ఐవీ కిట్‌)పై పరీక్షలు జరినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఆ మహిళ రక్తాన్ని బయట ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. అక్కడ నెగిటివ్‌ రావడంతో బుధవారం బాలింత బంధువులు ఆసుపత్రికి చేరుకుని వైద్యులను నిలదీశారు. ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే ఆ సమాచారాన్ని రెండో వ్యక్తికి తెలియకుండా వీసీటీసీ కౌన్సిలర్‌ ద్వారా వారికి ఆత్మస్థైర్యం కల్పించడానికి కౌన్సెలింగ్‌ చేయాలి. ఇక్కడ వైద్యులు బాలింతను, కుటుంబ సభ్యులను అవమాన పరిచి వార్డులో అందరి ముందు వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడడంతో వారు జీర్ణించుకోలేకపోయారు. చివరకు ఆందోళనకు దిగినవారు 112 పోలీస్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయా లని సూచించారు. బాలింతను, ఆమె కుటుంబ సభ్యులను దూషించిన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌లో ఆరు నెలల క్రితం ఇదే విధంగా హెచ్‌ఐవీ ఉన్నట్లు చెప్పడంతో వారు ఆఘమేఘాల మీద బయట ఆసుపత్రుల్లో టెస్టులు చేయించారు. అక్కడ నెగిటివ్‌ రావడంతో ఆ రిపోర్టు చూపించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోమని ఆసుపత్రిలో ఉన్న వీసీటీసీ పరీక్ష కేంద్రంలోనే చేయించాలని సూచించడంతో అక్కడ చేయించారు. అక్కడ నెగిటివ్‌ రావడంతో వైద్యులు మిన్నకుం డిపోయారు. ఆసుపత్రిలో ఒక్క హెచ్‌ఐవీ పరీక్ష కాదు మిగిలిన పరీక్షలు తప్పులు తడకలుగానే ఉంటున్నాయని పలువురు బాధితులు చెప్తున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:19 AM