ముగిసిన ఏలూరు నగర పాలక కౌన్సిల్ గడువు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:42 AM
నగర పాలక సంస్థ పాలక మండలి గడువు బుఽధవారంతో ముగిసింది. నగర పాలక సంస్థ పాలక మండలి జూలై 30, 2021లో ఏర్పడింది. దీంతో ఐదేళ్ల కాల పరిమితి పూర్తయింది.
నేటి నుంచి స్పెషల్ అధికారి పాలన
ఏలూరు టూటౌన్, జూలై 29 (ఆంధ్రజ్యోతి):నగర పాలక సంస్థ పాలక మండలి గడువు బుఽధవారంతో ముగిసింది. నగర పాలక సంస్థ పాలక మండలి జూలై 30, 2021లో ఏర్పడింది. దీంతో ఐదేళ్ల కాల పరిమితి పూర్తయింది. నేటి నుంచి స్పెషల్ అధికారిగా జిల్లా కలెక్టర్ పాలనలోకి నగర పాలక సంస్థ రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి వుంది. ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 50 మంది కార్పొరేటర్లతో పాలక మండలి ఏర్పడింది. మేయర్‌గా షేక్ నూర్జహాన్‌ను ఎన్నుకున్నారు. వైసీపీ తరపున 47 మంది కార్పొరేటర్లు ఎన్నిక కాగా టీడీపీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. మూడేళ్ల పాటు నగర పాలక సంస్థ పాలక మండలి వైసీపీ ఆధ్వర్యంలో నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల క్రితం మేయర్ నూర్జహాన్‌తో సహ 30 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీ వైపు వచ్చారు. అప్పటి నుంచి కూటమి పాలన ఇప్పటి వరకు కొనసాగింది. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్తపాలక మండలి ఏర్పడే వరకు స్పెషల్ అధికారి పాలనలో నగర పాలక సంస్థ కార్యాకలాపాలు జరుగుతాయి. ఏలూరు మునిసిపాలిటీ నగర పాలక సంస్థగా 2005లో ఆవిర్భవించింది. కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు మేయర్‌గా పని చేసిన ఘనత నూర్జహాన్‌కు దక్కింది. మొదటిసారిగా జూలై 3, 2014లో టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికై జూలై 2వ తేదీ 2019 వరకు మేయర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం ఏప్రిల్ 2021 వరకు అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు, అనంతరం జూలై 3, 2021 వరకు కార్తీకేయ మిశ్రా స్పెషల్ అధికారులుగా విధులు నిర్వహించారు. అనంతరం ఈనెల 29 వరకు నూర్జహాన్ మేయర్‌గా కొనసాగారు.
మేయర్ నూర్జహాన్‌కు అభినందన వీడ్కోలు
నగర పాలక సంస్థ పాలక మండలి ముగింపు సందర్భంగా అభినందన సభ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులను నగర పాలక సిబ్బంది సన్మానించారు. నూర్జహాన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.1,267 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ శ్రీనివాసరావు, డిప్ తంగిరాల అరుణ, ఎస్‌ఈ వెంకటరామిరెడ్డి, ఎంఈ సురేంద్రబాబు, డీఈలు నారాయణరావు, రజాక్, ఏసీపీ బాబురావు, మేనేజర్ మూర్తి, సూపరిండెం టెంట్లు సిరాజుద్దీన్, కృష్ణ మూర్తి, విజయభాస్కరరావు, అరుణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.