Share News

బడ్జెట్‌.. ఫైట్‌!

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:23 AM

ప్రస్తుత పాలకవర్గంలో ఏలూరు నగర పాలక సంస్థ చివరి బడ్జెట్‌ సమావేశం మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ అధ్యక్షతన గురువారం జరిగింది.

బడ్జెట్‌.. ఫైట్‌!
మేయర్‌ నూర్జహాన్‌తో వైసీపీ కార్పొరేటర్లు వాగ్వాదం

ఏలూరు నగర పాలక సంస్థ 2026–27 బడ్జెట్‌ సమావేశం

రూ.221 కోట్లతో అంచనాలు.. ఆమోదించిన కౌన్సిల్‌

వినోదపు పన్ను ఎందుకు చూపించలేదు..

తాగునీరు సరిగా అందడం లేదు..

ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు.. వాగ్వాదం

ఏలూరు టూటౌన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పాలకవర్గంలో ఏలూరు నగర పాలక సంస్థ చివరి బడ్జెట్‌ సమావేశం మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ అధ్యక్షతన గురువారం జరిగింది. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ.221.76 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పాలక మండలి ఆమో దించింది. ప్రతి పక్ష వైసీపీ కౌన్సిలర్లు వినోదపు పన్ను ప్రస్తావించక పోవ డం, తాగునీటి సమస్యపై కమిషనర్‌ సమాధానం చెప్పా లంటూ అభ్యంతరాలు లేవనెత్తుతూ సభను అడ్డుకోవ డంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ప్రారంభోపన్యాసం చేస్తూ ఐదేళ్లలో విలీన గ్రామాలతో కూడిన ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పాలకమండలిని అభినందించారు. ప్రస్తుతం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయని, రాబోయే కౌన్సిల్‌ మరో ఇద్దరు సభ్యులు పెరిగి 52 మందికి పెరిగే అవకాశాలున్నాయన్నారు. మేయర్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ ‘గత ఐదేళ్లలో పాలకమండలి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతో నగరాన్ని ఎంతో అభివృద్ధి పరిచాం. నగర ప్రజలకు రెండుపూటల పుష్కలంగా తాగునీరు అందించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో సుమారు రూ.50 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాం. రూ.129 కోట్లతో విలీన గ్రామాల ప్రజలకు తాగునీరు అందించబోతున్నాం. రూ.350 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతులు సాధించాం. కోట్లాది రూపాయలతో శనివారపుపేట కాజ్‌వే నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేశా’మని పేర్కొన్నారు. అనంతరం ఏకైక ఏజెండాగా బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. అంచనాలను సూపరింటెంటెండ్‌ షేక్‌ సిరాజుద్దీన్‌ చదివి వినిపించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవాని, కర్రి శ్రీనివాసరావు, అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్‌ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు

బడ్జెట్‌లో వినోదపు పన్ను ఎందుకు చూపించలేదని ప్రతిపక్ష సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుడిదేసి శ్రీనివాసరావు అభ్యంతరం లేవనెత్తారు. నగర ప్రజలకు తాగునీరందించే సమ్మర్‌ స్టోరేజ్‌ట్యాంకు మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని, అయినా తాగునీరు సరిగా అందడం లేదని, నగర కమిషనర్‌ భానుప్రతాప్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోఅప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎం ఆర్‌ పెదబాబు సమాధానం చెప్పడానికి ప్రయత్నించగా కమిషనరే సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. కమిషనర్‌ జోక్యం చేసుకుని సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా ప్రతిపక్ష సభ్యులు వినిపించుకోలేదు. సభ్యుల గందరగోళం మధ్య బడ్జెట్‌ ఆమోదం పొందినట్టు మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ప్రకటించారు. కౌన్సిల్‌ సమావేశానికి 50 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఅప్షన్‌ సభ్యులకు గానూ 39 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో తొమ్మిది మంది ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య బడ్జేట్‌ ఆమోదం పొందింది.

2025–26 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రూ.48 కోట్లను ప్రారంభ నిల్వగా చూపించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయాన్ని రూ.173. 36 కోట్లుగా అంచనా వేశారు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం రూ.221.76 కోట్ల బడ్జెట్‌ అంచ నాలు రూపొందించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరా నికి అయ్యే ఖర్చులను రూ.209.32 కోట్లుగా అంచనా వేసి ముగింపు నిల్వను రూ.12.43 కోట్లుగా చూపిం చారు. 2021, జూలైలో ప్రారంభమైన ఈ కౌన్సిల్‌ ఈ ఏడాది జూలైతో ముగుస్తుంది. ఈ పాలక మండలికి ఈ బడ్జెట్‌ సమావేశం ఆఖరిది.

Updated Date - Mar 27 , 2026 | 12:23 AM