ఇక్కడ ఎంఆర్‌పీ.. పాటించం!
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:15 AM
జిల్లా కేంద్రమైన ఏలూరు కొత్త బస్టాండ్‌లో ఏది ముట్టుకున్న ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. క్వాలిటీ హోటళ్లలోనే ఒక టీ రూ.13 మించి అమ్మడం లేదు.
ఏలూరు కొత్త బస్టాండ్‌లో ఇష్టారాజ్యం
క్యాంటీన్‌లో టీ ధర రూ.20.. వాటర్ బాటిల్ రూ.25
డ్రింక్‌ల ధరలదీ అదేదారి.. ప్రయాణికుల నిలువు దోపిడీ
కానరాని అధికారుల పర్యవేక్షణ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రమైన ఏలూరు కొత్త బస్టాండ్‌లో ఏది ముట్టుకున్న ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. క్వాలిటీ హోటళ్లలోనే ఒక టీ రూ.13 మించి అమ్మడం లేదు. ఏలూరు బస్టాండ్‌లో మాత్రం క్వాలిటీ లేని టీ కూడా రూ.20 అమ్మకాలు సాగిస్తున్నారు. వాటర్ బాటిల్స్, డ్రింకుల్లోను ధరల దోపిడీ తాండవిస్తోంది. చిన్నారులు తినే బిస్కెట్ల ప్యాకెట్లపైన రూ.5 నుంచి 10 వరకు అదనంగా వసూళ్లను చేస్తున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణి కులు రాకపోకలు సాగించే కొత్త బస్టాండ్‌లో ఎంఆర్‌పీ నియమ నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం మాత్రం ప్రజలకు సేవలను సంతృప్తి అందిం చాలని ఐవీఆర్‌ఎస్ సర్వేలను చేపడుతోంది. పలుమార్లు కలెక్టర్ వెట్రిసెల్వి, విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు సైతం ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అయితే స్టాల్స్‌లు, ఇతర దుకాణా లపై కనీసం పర్యవేక్షణ చేయకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా ఆర్టీసీ పరిధిలోనే సెక్యూరిటీ వింగ్ కూడా తనిఖీలు చేసి.. ధరల్లో తేడాలుంటే అపరాధ రుసుం కింద రూ.500, వెయ్యి వసూలు చేసి చేతులు దులుపుకుం టున్నారు. కీలకమైన లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు చేసే పరిస్థితి కానరావడం లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలను పెంచి అమ్ము తున్నారు. ఏవస్తువు ఏధరకు అమ్ముతున్నారో ధరల పట్టికలో వివరాలుండవు.
అడిగేవారేరీ?
ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్న కంగారులో వాటర్ బాటిళ్లు, అలసటగా ఉందని టీ లేదా కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయడానికి దుకాణాల వద్దకు వస్తారు. తీసుకునే వరకు రేటు చెప్పరు.. తాగాక వాటర్ బాటిల్ రూ.25 అంటూ చెబుతారు. వాటర్ అరలీటరు బాటిల్ రూ.15, లీట ర్ బాటిల్ 25కు అమ్ముతున్నారు. కూల్ డ్రింక్‌లు రూ.20 బాటిల్ రూ.25కు, రూ.45 ఉండే అరలీటర్‌కు రూ.50 పైనే తీసుకుంటున్నారు. పుస్తకాలు, పెన్నులు, జ్యూస్, పాప్‌కార్ప్, తినుబండరాలు ధరలు మోతే. చాలావరకు పెద్దగా వ్యాపారాలు చేసే వీరు కేసు లెక్కన కొనుగోలు చేస్తారు.. కాబట్టి.. హోల్‌సేల్‌గా కొన్నప్పుడు మార్జిన్ బాగానే వస్తుంది. మరోవైపు అదనపు రేట్లతో ప్రయాణికులను దోచుకుంటున్నారన్న ఆరోపణులున్నాయి.
నిరంతర నిఘా తూచ్..
ఏలూరు బస్టాండ్‌లో 25 వరకు స్టాల్స్, దుకాణాలు రెండు నుంచి మూడేళ్ల కాలానికి వ్యాపారులు లీజుకు తీసుకుంటున్నారు. వారిలో వారే పోటీపడి కొంత ఎక్కువ రేట్లకు లీజుకు తీసుకుని.. వ్యాపారం కోసం ప్రజలపై భారాలను మోపడం ఎంత వరకు సబబన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : డీపీటీవో షేక్ షబ్నం
వ్యాపారులు విధిగా ఎంఆర్‌పీ ధరలకు అమ్మాలని ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైనా ధరలు పెంచి విక్రయాలు చేస్తే మాకు ఫిర్యాదు చేస్తే షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటాం..ఎంఆర్‌పీ బోర్డులను పెట్టి ధరల పట్టికలను విధిగా బయట ప్రదర్శించాలని ఆదేశించాం. దీనిపై విచారిస్తాం.