Share News

50 ఏళ్ల బస్టాండ్‌!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:45 AM

జిల్లా కేంద్రమైన ఏలూరు కొత్త బస్టాండ్‌ 50 ఏళ్ల క్రితం నిర్మించారు. భవనం శ్లాబ్‌ పెచ్చులూడుతోంది.

50 ఏళ్ల బస్టాండ్‌!

ఏలూరు బస్‌ కాంప్లెక్స్‌ భవనం శిథిలం

తాత్కాలిక మరమ్మతులతో సరి

లక్షలాది రూపాయలు నిరుపయోగం

నూతన నిర్మాణం దిశగా చర్యలు లేవు

జిల్లా కేంద్రమైన ఏలూరు కొత్త బస్టాండ్‌ 50 ఏళ్ల క్రితం నిర్మించారు. భవనం శ్లాబ్‌ పెచ్చులూడుతోంది. ఆవరణ గోతులతో చినుకు పడితే నీటిలో వెళ్లాల్సిందే. బస్‌ కాంప్లెక్స్‌ పై అంతస్థు శిథిలం కావడంతో అక్కడ కార్యాలయం ఖాళీ చేసేశారు.. పేరుకు మాత్రం ఇంకా కొత్త బస్టాండ్‌. శిథిల భవనం పునర్నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు మరమ్మతుల పేరుతో లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కొన్నాళ్లకు సమస్యలు షరా మామూలే..! దాదాపు అవసాన దశలో ఉన్న బస్టాండ్‌ భవనం మరమ్మతులతో మనుగడ సాగిస్తుంటే సిబ్బంది అక్కడ ఉండలేక జాగ్రత్త పడ్డారు. తెలియని ప్రయాణికులు కొత్త బస్టాండ్‌ అంటూ ప్రమాదం కింద ప్రయాణం చేస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నగరంలో నాలుగు ఎకరాల స్థలంలో ఏలూరు బస్‌ కాంప్లెక్స్‌ 1976లో నిర్మించారు. ఆర్టీసీ బస్సులు ఆపేందుకు 12 పైగా ప్లాట్‌ఫారాలున్నాయి. బస్టాండ్‌ భవనం శ్లాబ్‌, ఫ్లాట్‌ఫారాల వద్ద శ్లాబ్‌లు పెచ్చులూడి పడుతున్నాయి. పైఅంతస్థు (ఫస్ట్‌ ఫ్లోర్‌) శిథిలావస్థకు చేరడంతో అధికారులు సిబ్బంది ఈ విభాగాలను చాలా కాలం క్రితం ఖాళీ చేసేశారు. వివిధ విభాగాల ఫైళ్లను మాత్రం అక్కడే గాలికి వదిలేశారు. ఏడు నెలలు క్రితం రూ.4 లక్షలతో ప్లాట్‌ఫారాల వద్ద పెచ్చులూడిన శ్లాబ్‌కు అతుకులు వేశారు. ఇప్పుడు అతుకులు కూడా ఊడిపోవడంతో ఇంజనీరింగ్‌ అధికారుల చిత్తశుద్ధిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు స్థానికుడు అయినా అధికారులు బస్టాండ్‌ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు లేవు. బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కార్యాలయంలో ఉండే డిపో మేనే జర్‌ సైతం కనీస పర్యవేక్షణ చేయరని ప్రయాణికు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహణలో నిర్లక్ష్యం..

విజయవాడ నాన్‌స్టాప్‌ బస్సులు నిలిపేచోట లయన్స్‌ క్లబ్‌ నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మహిళల మరుగుదొడ్డికి డోర్‌ లేదు. పురుషుల మూత్రశాల వద్ద దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నా యి. గత ఏడాది రూ.7.5లక్షలతో మరుగుదొడ్ల మరమ్మతులకు బిల్లులు పెట్టడం గమనార్హం.

మరమ్మతు పనులకే ప్రతిపాదనలు

బస్‌ కాంప్లెక్స్‌ శిథిలావస్థకు చేరడంపై ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లారా అని ఆర్టీసీ డీఈ బి.వెంకటేశ్వరరావు, ఏఈ శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మరమ్మతులకు ప్రతిపాదనలు చేశామన్నారు. శాశ్వ త ప్రాతిపదికన పనులు చేపట్టడానికి తీసుకున్న చర్యలపై సమాధానం దాటవేశారు.

మరమ్మతు పనులపై అనుమానాలు..?

బస్టాండ్‌ ఆవరణలో విజయవాడ నాన్‌ స్టాప్‌ బస్సుల పాయింట్‌ వద్ద పైశ్లాబ్‌ దెబ్బతిని ఊచలు తప్పుపట్టాయి. అధికారులు మరమ్మతు పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్లాబ్‌లు పెచ్చులూడిన చోట్ల పై పూతలా ప్లాస్టరింగ్‌ పనులు చేయిస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. శ్లాబ్‌ మరమ్మతులతో పాటు బస్టాండ్‌ ఆవరణలో పెయింటింగ్‌కు మొత్తం రూ.12 లక్షల వెచ్చించారు. తుప్పు పట్టిన ఊచలు బయటకు కనిపిస్తున్నా సిమెంట్‌ పనులకే లక్షలు ఖర్చు పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Mar 25 , 2026 | 12:45 AM