ఏసీలో హాయిగా వెళదామా
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:19 AM
జిల్లా ప్రయాణికులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లటి వార్త అందించారు.
ఎలక్ర్టిక్ ఏసీ బస్సులు వస్తున్నాయ్ !
జిల్లాకు 100 వాహనాలకు ప్రతిపాదనలు
రెండో విడతలో కేటాయింపు
సిద్ధాంతం సభలో సీఎం ప్రస్తావన
ముందుగా భీమవరం, నరసాపురం డిపోలకు
భీమవరంటౌన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రయాణికులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లటి వార్త అందించారు. త్వరలో ఆర్టీసీకి ఏసీ విద్యుత్ బస్సులు అందించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో ఇప్పటికే పలు జిల్లాలకు బస్సు కేటాయించారు. రెండో విడతలో జిల్లాలో నరసాపురం, భీమవరం డిపోలకు 100 బస్సులు కేటాయించారు. సోమవారం సిద్దాంతం సమావేశంలోనే ఈ విషయం ప్రకటించారు. పశ్చిమలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే విషయం తనకు తెలుసునని అందుకే జిల్లాకు ఏసీ బస్సులను అందిస్తానని ప్రకటించారు. భీమవరం డిపోకు 50 బస్సులు, నరసాపురం డిపోకు 50 బస్సులకు ఇప్పటికే జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ రెండు డిపోలకు బస్సులు వచ్చిన తరువాత తాడేపల్లిగూడెం, తణుకు డిపోలకు ప్రతిపదానలు పంపుతారు.
భీమవరం డిపోకు సంబంధించి ఇలా
భీమవరం డిపోకు వచ్చే 50 బస్సులను ఏఏ రూట్‌లల్లో తిప్పాలనే ప్రతిపాదన సిద్ధం చేశారు. రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, ఏలూరు, ఇలా కొన్ని రూట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. బస్సులను ఛార్జింగ్‌లు చేసుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణానికి భీమవరం ఆర్టీసీ డిపో వెనుక గతంలో ఉన్న క్వార్టర్స్ స్థలాన్ని ప్రతిపాదించారని చెబుతున్నారు.
నరసాపురం డిపోకు..
నరసాపురం డిపోకు కూడా 50 ఏసీ విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూట్ల్‌ను ప్రతిపాదించారని సమాచారం, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి (పాలకొల్లు మీదుగా), భీమవరం మీదుగా మచిలీపట్నం తదితర రూట్లను ఎంపిక చేసారని తెలుస్తోంది. నరసాపురం ఆర్టీసీ గ్యారేజీలో ఉన్న ఖాళీ స్థలంలోనే ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. బస్సుల వచ్చిన తరువాత రూట్ల్‌ను మరోసారి పరిశీలించి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పుష్కరాలకు పరుగులు తీసేనా ?
జిల్లాకు కేటాయించిన 100 విద్యుత్ బస్సులు రానున్న పుష్కరాల్లో పరుగులు తీస్తాయనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఏసీ బస్సులతో పాటు పుష్కరాల కోసం డిపోలకు సీఎన్‌జీతో నడిచే బస్సులు కూడా కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. తాడేపల్లిగూడెం, తణుకు డిపోలకు సీఎన్‌జీ బస్సుల ప్రతిపాదన ఉందంటున్నారు. నరసాపురం, భీమవరం డిపోలకు విద్యుత్ బస్సులతో పాటు అదనంగా సీఎన్‌జీలు వస్తాయని అంటున్నారు.
ఆ రూట్లలో పరిస్థితి ఏమిటి
జిల్లాలోని భీమవరం, నరసాపురం డిపోల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కొత్తగా ఏసీ బస్సులు వస్తే ఆ రూట్‌లలో బస్సులతో పాటు డైవర్లు, కండక్టర్లు మిగిలిపోతారని వారి ఎలా వినియోగిస్తారో అనేదానిపై ఇప్పటికే యూనియన్ నాయకులు సతమతం అవుతున్నారు. భీమవరం డిపోలో ప్రసుత్తం 82 బస్సులు ఉన్నాయి. అదేవిధంగా నరసాపురం డిపోలో 68 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ప్రతీరోజు విద్యుత్ బస్సులు తిరిగే రూట్‌లలో వెళున్నాయి. మరి ఏసీ బస్సులు వస్తే మిగిలిన బస్సులను సిబ్బందిని ఏమి చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.