అక్కడ ఎన్నికలు.. ఇక్కడ పందేలు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:31 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి జిల్లాను తాకింది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కావడం, పశ్చిమబెంగాల్, తమిళనాడులో పోలింగ్ సమీపించడంతో పందేలరాయుళ్లు రంగంలో దిగారు.
తమిళనాడు, బెంగాల్ ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్ జోరు
గెలిచే పార్టీ.. సీట్ల సంఖ్యపై పందెం
అంతా బుకీల ద్వారానే..
పోలింగ్ పూర్తయితే మరింత జోరు
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి జిల్లాను తాకింది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కావడం, పశ్చిమబెంగాల్, తమిళనాడులో పోలింగ్ సమీపించడంతో పందేలరాయుళ్లు రంగంలో దిగారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్కఠత నెలకొంది. ఫలితాలపై కొన్ని సర్వేలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో గెలిచే పార్టీలు, వాటి సీట్లపై పందేలు జోరందకున్నాయి.
నరసాపురం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఫలితాలపై బెట్టింగ్ జోరు సాగుతోంది. లక్షల రూపాయలు పందేలు సాగుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తయితే కోట్లకు చేరుతుందని అంచనా. ఎన్నికల పందేలపై క్రికెట్ బుకీలే కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం సాగుతోంది. పందెంరాయుళ్లు కూడా ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఎన్నికల వాతావరణం, పార్టీల విజయావకాశాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అక్కడి ఏజెన్సీలను కూడా కలిసి బెట్టింగ్ పెడుతున్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గెలుపు నువ్వా... నేనా అన్న రీతిలో ఉంది. ఇప్పటికే కొన్ని సర్వేలు ఎన్డీఏకు అనుకూలంగా ఇస్తే మరికొన్ని టీఎంసీకి ఫేవర్‌గా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆ రాష్ట్రంలో 118 సీట్లు దాటవని పెద్ద మొత్తాల్లో బెట్టింగ్ కాస్తున్నారు. మరోవైపు బీజేపీకి 124 సీట్లు వస్తాయని బెట్టింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. తిరిగి టీఎంసీ అక్కడ అధికారం చేపడుతుందని కొందరు భారీ మొత్తం బెట్టింగ్ వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పక్క రాష్ట్రం తమిళనాడు ఫలితాలపై కూడా పందేలు జోరందుకున్నాయి. ఈసారి అక్కడ ఎక్కువ ప్రాంతీయ పార్టీలు బరిలో నిలిచాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్నది ఉత్కఠభరితంగా మారింది. తిరిగి స్టాలిన్ సీఎం అవుతారనే పందేలు ఒక వైపు మిగిలిన పార్టీలతో కలిసి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని మరోవైపు బెట్టింగ్ జరుగుతుంది. ఎక్కువ మంది స్టాలిన్ పార్టీనే అధికారం చేపడుతుందని బెట్టింగ్ సాగుతున్నట్లు అంచనా. ఇటు విజయ సాధించే సీట్లపై కూడా బెట్టింగ్ జరుగుతుంది.
బుకీల ద్వారానే..!
గతంలో బెట్టింగ్‌కు భీమవరం కేంద్రంగా ఉండేది. పోలీసుల నిఘా పెరగడంతో పందెంరాయుళ్లు రూట్ మార్చారు. ఐపీఎల్ బెట్టింగ్ ఏ విధంగా సాగుతుందో అదే రీతిలో యాప్ ద్వారా బెట్టింగ్ పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఫోన్ కాల్ కూడా అవసరం లేకుండా వివరాలన్ని యాప్‌లోనే ఉంటాయి. అక్కడ ఎంపిక చేసుకుని బెట్టింగ్ మొత్తం ఎంతో చెబితే పందెం ఖాయం అవుతుంది. సీక్రెట్‌గా బెట్టింగ్ నిర్వహించడం ఐపీఎల్ బెట్టింగ్‌లా సాఫీగా జరిగిపోతుంది. ఈనెల 28తో ఈరెండు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తికానుంది. ఆ తరువాత ఫలితాలపై బెట్టింగ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి పశ్చిమ బెట్టింగ్‌లకు ప్రసిద్ధి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఉప ఎన్నిక జరిగినా ఫలితాలపై జిల్లాలో కోట్లలో బెట్టింగ్ జరిగేది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో జరిగే ఎన్నికల ఫలితాలపై కూడా జిల్లాలో కోట్లలో పందేలు జరిగాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి చూపు రెండు పెద్ద రాష్ట్రాలపైనే ఉంది.