Share News

ఫలితాలు నేడే

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:09 AM

పరిషత్‌ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురంలో రెవెన్యూ డివిజన్‌ల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఫలితాలు నేడే
నరసాపురం వైఎన్‌ కాలేజీలో కౌంటింగ్‌కు ఏర్పాటు చేసిన టేబుళ్లు

నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

అభ్యర్థుల్లో ఉత్కంఠ... కూటమిలో ధీమా

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : పరిషత్‌ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురంలో రెవెన్యూ డివిజన్‌ల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి 20 జడ్పీటీలు తమ ఖాతాలో పడతాయని కూటమి ధీమాతో ఉంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం, ఆరు స్థానాల్లో జనసేన, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేసింది. ప్రతిపక్ష వైసీపీ 20 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కానీ ఎన్నికలు నిర్వహించడంలో వెనుకపడింది. జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులుగా కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా తమదే విజయమంటూ లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీలో ఆచంటలో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయంటూ లెక్కలు కట్టుకుంటున్నారు.

ఎంపీటీసీ స్థానాల్లో ఏం జరుగుతుందో

జిల్లాలో 340 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తంపైన 744 మంది బరిలో నిలిచారు. తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కూటమిలో సర్దుబాటు దిశగా ఎంపిటిసి స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు వైసీపీ పోటీ ఇవ్వడానికి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. జిల్లాలోని 20 మండలాల్లో 371 ఎంపీటీసీ స్థానాలుంటే ముందుగానే 31 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న 340 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశంలో 204 చోట్ల తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. జనసేన 122 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి 337 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి వైపే మొగ్గు ఉంది. ప్రతి మండలం లోనూ అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయన్న ధీమా కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న స్థానాల్లో గెలుపు మాదే అన్న నమ్మకంతో వైసీపీ నాయకత్వం ఉంది. ఎంపీపీ ఆశావహులు పోటీ ఉన్న చోట కూటమిలో కొందరు నాయకులను తమ వైపు తిప్పుకుని గెలుపు పొందేలా వ్యూహాన్ని పన్నింది. ఇటువంటి చోట్ల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయంటూ వైసీపీ కేడర్‌ ఉత్సాహపడుతోంది. కూటమి మాత్రం అన్ని ఎంపీపీ స్థానాలు తమకే దక్కుతాయంటూ లెక్కలు వేసుకుంది.శనివారం ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

భారీ ర్యాలీలకు అనుమతి లేదు : కలెక్టర్‌

భీమవరంటౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) :ఎన్నికల ఫలితాల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్‌ నాగరాణి స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఓట్ల లెక్కింపు అనంతరం బాణసంచా కాల్చడం, భారీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశ మయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం వెనుక రాజకీయ పార్టీల సహకారం, అధికా రుల సమన్వయం ఉందన్నారు. ఈనెల 13న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో తదుపరి ఎన్ని కలను కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

నరసాపురం వైఎన్‌ కాలేజీ, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌, తాడేపల్లిగూడెం నన్నయ వర్సిటీ కేంద్రాల్లో లెక్కింపు

భారీ పోలీసు బందోబస్తు.. ర్యాలీలు, డీజేలు నిషేధం

నరసాపురం/భీమవరం నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు జరగనున్నది. నరసాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎనిమిది మండలాల పరిషత్‌ కౌంటింగ్‌కు వైఎన్‌ కాలేజీలో ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. జడ్పీటీసీలకు ఏడు నుంచి 12 రౌండ్లు, ఎంపీటీసీలకు రెండు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తిచేసే విధంగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ సుధాకర్‌రావు, సీఐ రఘులు బందోబస్తు పరిశీలిం చారు. ఫలితాలు తరువాత ర్యాలీలు, డీజేలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థ్ధి వెంట ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో, తణుకు, తాడేపల్లిగూడెంకు సంబంధించి ఆదికవి నన్నయ్య వర్సిటీలో లెక్కింపు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలు వచ్చేలా అఽధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:09 AM