Share News

‘గుడ్డు’పుఠాణి

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:15 AM

అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నవయ్యాయి.

‘గుడ్డు’పుఠాణి

అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరాలో అక్రమాలు

మరీ చిన్నవి ఇస్తున్న వైనం.. కనిపించని రంగులు

పట్టించుకోని ఐసీడీఎస్‌ అధికారులు

అత్తిలి, జూలై 17(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నవయ్యాయి. నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బరువు తక్కువ, పరిమాణం చిన్నగా వాటిని సరఫరా చేస్తూ భారీ సొమ్ము చేసుకుం టున్నారన్న విమర్శలున్నాయి. రంగు ముద్రలతో కూడిన గుడ్లను సరఫరా చేయాలి. గుడ్లపై అవి కనిపించడం లేదు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఐసీడీఎస్‌ ద్వారా ప్రభుత్వాలు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నాయి. వాటిని ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీల ద్వారా ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందజేస్తున్నారు. జిల్లాలో 1,626 అంగన్‌ వాడీ కేంద్రాలు వున్నాయి. గర్భవతులు 7607, బాలింతలు 5611, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 73,551 మంది ఉన్నారు. జిల్లాలో వారందరికీ ప్రతి నెలా 21,69,225 గుడ్లు సరఫరా చేస్తున్నారు. అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్డు బరువు 67 గ్రాములు ఉండాలి.. కానీ 35 నుంచి 40 గ్రాముల మధ్యే ఉంటున్నట్లు తెలుస్తోంది. 3 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఒకొక్కరికి నెలకు 25 గుడ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. బాలింతలు, గర్భిణులకు ఇంటికే సరుకులు 25 గుడ్లను అందజేస్తారు. మూడేళ్ళలోపు చిన్నారులకు పాలతో పాటు గుడ్లను ఇంటికే అందించాల్సి ఉంది. నెక్‌ నిర్ధారించిన ధర ప్రకారం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు.

రంగులు వేయకుండానే సరఫరా

కోళ్ల ఫారాల వద్ద గుడ్లను పరిమాణం బట్టే వేరు చేస్తారు. సైజును బట్టి ధర ఉంటుంది. మార్కెట్లో వ్యాపారులు బరువు పరిమాణం తక్కువగా ఉన్న వాటిని తీసుకోరు. వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు అంట గడు తున్నారు. నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నెలలో నాలుగుసార్లు గుడ్లను సరఫరా చేయాలి. కూటమి ప్రభుత్వం పారదర్శకత కోసం గుడ్లపై రంగులు వేయాలని సూచించింది. గుడ్లను రంగులు వేయకుండానే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడం విశేషం.

Updated Date - Jul 18 , 2026 | 12:15 AM