Share News

ఖైదీలకు ‘ఓపెన్‌ స్కూల్‌’ విద్యావకాశాలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:09 AM

చదువుకు వయస్సుతోపాటు పరిస్థితులు కూడా అడ్డంకి కాకూడదని జైలు జీవితం గడుపుతున్న ఖైదీలలో విద్యాకాంతులు నింపేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీఓఎస్‌ఎస్‌) అధికారులు వినూత్న అడుగు వేశారు.

 ఖైదీలకు ‘ఓపెన్‌ స్కూల్‌’ విద్యావకాశాలు

భీమవరం క్రైం, నవంబరు 24 (ఆంధ్రజ్యో తి): చదువుకు వయస్సుతోపాటు పరిస్థితులు కూడా అడ్డంకి కాకూడదని జైలు జీవితం గడుపుతున్న ఖైదీలలో విద్యాకాంతులు నింపేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీఓఎస్‌ఎస్‌) అధికారులు వినూత్న అడుగు వేశారు. ‘ఏపీఓఎస్‌ఎస్‌ అడ్మిషన్స్‌ డ్రైవ్‌’లో భాగంగా మంగళవారం భీమవరం పట్టణంలోని సబ్‌ జైలును ఏపీఓఎస్‌ఎస్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ పీవీ సత్యనారాయణరాజు సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో జైలులోని ఖైదీలందరితో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఓపెన్‌ స్కూల్‌ విధానం ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ పూర్తి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలను సత్యనారాయణరాజు ఖైదీలకు వివరించారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సొంత ఖర్చులతో చేయూత

ఖైదీల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచు కుని జిల్లా కో–ఆర్డినేటర్‌ పీవీ సత్యనారాయణరాజు ఉదారత చాటుకున్నారు. ఆసక్తి గల ఖైదీలు ముందుకువస్తే వారి పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల ఖర్చును తానే స్వయంగా భరిస్తానని, భవిష్యత్‌లో వారి పరీక్ష ఫీజులను కూడా సొంత ఖర్చులతోనే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీనితో ముగ్గురు ఖైదీలు చదువుకునేందుకు ముందుకు వచ్చారు.

Updated Date - Nov 25 , 2026 | 12:09 AM