చిన వెంకన్నకే శఠగోపం..
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:37 AM
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కొందరు జంకూ గొంకూ లేకుండా శ్రీవారి సొమ్ముకే గండి కొడుతున్నారు.
హుండీ లెక్కింపులో చేతివాటం.. దర్శన టిక్కెట్లలో నకి‘లీల’లు
వివాదాలకు కేంద్రంగా ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం...
చట్టపరమైన చర్యలు చేపట్టిన అధికారులు
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కొందరు జంకూ గొంకూ లేకుండా శ్రీవారి సొమ్ముకే గండి కొడుతున్నారు. హుండీలోని కానుకలపై ఒకరి కన్నుపడితే.. ఏకంగా దర్శనం టిక్కెట్లనే నకిలీవి సృష్టించి మరికొందరి ముఠా శ్రీవారి ఆదాయానికి కన్నం వేసింది.
(ద్వారకాతిరుమల–ఆంధ్రజ్యోతి)
కొందరు ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది భక్తులను దొడ్డిదారిన దర్శనాలకు పంపుతూ కాసులు దండుకుం టున్నారు. ఫిబ్రవరి 11న ఓ హోంగార్డు భక్తుల నుంచి సొమ్ము దండుకుని దర్శనాలకు పంపే దృశ్యా లు సీసీ కెమేరాలో రికార్డ్ అయింది. సెక్యూరిటీ వారు పంపిన భక్తులను ఆలయ సిబ్బంది తీసుకెళ్లి దర్శనా లు చేయిస్తున్నారు. ఇదీ రికార్డయింది. దాంతో విచా రణ నిర్వహించి సెక్యూరిటీని గుర్తించిన అధికారులు అతడ్ని మాతృ సంస్థకు అప్పగించారు. ఆ మరుసటి రోజే దేవస్థానంలో పనిచేసే ఓ మహిళా సెక్యూరిటీ గార్డు భక్తుడి వద్ద డబ్బులు తీసుకుని దర్శనానికి పంపుతూ అధికారులకు పట్టుబడింది. దీంతో అధికా రులు ఆమెను విధుల నుంచి తప్పించారు. అయితే సెక్యూరిటీ సిఫార్సులతో వెళుతున్న భక్తులను ఆల యంలోకి పంపుతున్న సిబ్బంది ఎవరనేది అధికారులు తేల్చడం లేదు. తీగలాగితే తమకు కావా ల్సిన వారి డొంక ఎక్కడ కదులుతుందో అన్న భయం తోనే అధికా రులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిసున్నాయి. శ్రీవారి రూ.500ల అంతరాలయ దర్శ న టిక్కెట్లతోపాటు మిగతా దర్శన టిక్కెట్లను రీ ప్రిం ట్ చేస్తున్నట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఆన్ లైన్‌లో వస్తున్న టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసి వాటిని రీ ప్రింట్ చేసి భక్తులకు విక్రయిస్తూ కొందరు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.
నకిలీ దర్శన టిక్కెట్ల బాగోతం..
తాజాగా రూ.200ల దర్శనం నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్‌జె రాజు కీలక పాత్ర పోషించడంతో అతనితో సహా 9 మందిని పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదంతా ఓ గ్రూపు గూడుపుఠాణిలా జరుగుతున్నా.. సంబంధిత విభాగ అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో తమ ఇష్టారాజ్యంగా చిరుద్యోగులు సైతం ప్రవర్తిస్తున్నారు. వీరంతా భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆది వారా ల్లో అవినీతికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. రూ.200 దర్శన టిక్కెట్లను గత నెల 15న స్కాన్ పాయింట్ వద్ద స్కాన్ అవకుండా నాట్ ఫౌండ్ అని వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ ఈ విషయాన్ని ఆలయ ఈఈ, ఆలయ ఏఈవో, సూపరిం టెండెంట్‌లకు తెలపగా వారు హుటాహుటిన టిక్కెట్ల ను కంప్యూటర్‌లో పరిశీ లించారు. ఆలయ సాఫ్ట్‌వేర్‌కు సమాంతరంగా మరో సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఈ అక్రమాలకు పాల్పడు తున్నట్లు అధికారులు గుర్తించా రు. అలాగే టిక్కెట్ల ఐడీ పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్)– 3 అని రావాలి అయితే పీవోఎస్–1 అని ఉండటంతో అనుమానం బలపడింది. దీంతో టిక్కెట్ కౌంటర్‌లోని సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల నుంచి తొలగించి రిమాండ్‌కు పంపారు. అయితే తాజాగా ఐదుగురు నిందితుల కస్టడీ కోసం పోలీసులు కస్టడీ పిటిషన్‌ను వేశారు. ఇంకా పెద్దలు ఎవరి హస్త మైనా ఉందా అన్న సందేహంతో వారి విచారణ జరుగ నుంది. వ్యవహారం బయటపడిన రోజైన ఆది వారం రూ.200 వి 61 టికెట్లు విక్రయాలు జరిపి సొమ్ము దండుకున్నాడంటే ఇంతకు ముందు ఎంతటి అక్రమా లకు పాల్పడ్డాడో అన్నది విచారణలో తేల్చాల్సి ఉంది.
ఆర్థిక లావాదేవీలున్న చోట ఔట్ సోర్సింగా..?
ఆలయంలో ఆర్థిక లావాదేవీలున్న చోట అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు విధులు వేయకూడ దన్న నిబంధనలను తుంగలోని తొక్కి అటువంటి వారికే ఇక్కడి అధికారులు ప్రాధాన్యత కల్పించడంతో అవినీతికి బీజం పడుతోంది. దీంతో శ్రీవారి సొమ్ము దోచుకునే మార్గం సులువవుతోంది.. పట్టుబడితే ఏముందిలే... కొద్దిరోజులు సస్పెన్షన్.. ఆ తర్వాత తమ పలుకుబడితో మరలా డ్యూటీలో చేరవచ్చు.. ఇదీ వారి ఆలోచన. ఇదే జరుగుతోంది... ఇటువంటి చోట అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా విధుల్లో ఉంచు తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి ఆర్థిక వనరులు తెచ్చిపెట్టే విధుల్లో జవాబుదారీ తనానికి పూర్తి స్థాయి ఉద్యోగి విధుల్లో ఉండాల్సి ఉంది.
సేవకుడి పేరుతో హుండీ సొమ్ము తస్కరణ
శ్రీవారి సేవకుడి పేరుతో ఆలయంలో ఇటీవల హుండీల లెక్కింపునకు వచ్చిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా స్వామివారికే ఎగనామం పెట్టబోయాడు. అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యాడు. భద్రతా వైఫల్యం కారణంగా సేవకుడి పేరుతో గత నెల 11న హుండీలు లెక్కించిన వ్యక్తి స్వామివారికి చెందాల్సిన 59.700 గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించాడు. ఇరగ వరం మండలం సూరంపూడికి చెందిన బొల్లా సురేష్ పై కేసు నమోదైంది. ద్వారకాతిరుమలతో పాటు విజయవాడ, అన్నవరం, సింహాచలం, వాడపల్లిలో ఇతను హుండీల లెక్కింపులో పాల్గొన్నట్లు రుజువైంది. అయితే ద్వారకాతిరుమలలో గత 8 ఏళ్లుగా లెక్కిం పులో పాల్గొంటున్న ఇతను చోరీ చేయడం ఇదే మొద టిసారా అనేది పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. హుండీల లెక్కింపులో పాల్గొనే వారి వివరాలు దేవస్థానం రికార్డుల్లో ఉండాలి. అయితే ఎవరి వివరా లూ లేనట్టు చెబుతున్నారు. హుండీల లెక్కింపులో పాల్గొనే సేవకుల నుంచి ఆధార్, పాన్, వారి ఫోటోలు, సేవా సంఘ సిఫార్సు లేఖలు అధికారులు తీసుకో వాలి. ఈ నెల 11న జరిగిన చోరీని ఇక్కడి భద్రతా సిబ్బంది గుర్తించలేదు. తోటి సేవకుడు చూసి చెప్ప డంతో కనిపెట్టారు. దీంతో ఆలయ భద్రతలో డొల్లత నం స్పష్టమౌతోంది. హుండీల లెక్కింపులో పాల్గొనే వారిలో మరో పది మంది బ్యాచ్ ఉన్నట్లు పట్టుబడిన సురేష్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పదిమంది ఎవరు.. వారికి సహకరి స్తున్న వారెవరో పోలీసులు తేల్చి వారిపై నిఘా ఉంచాలి.
ఈవో ‘వేండ్ర’ అనుభవం ఫలిస్తుందా..?
ఆలయానికి నూతనంగా వస్తున్న ఈవో వేండ్ర త్రినాథరావుకు ప్రస్తుత ఆలయ పరిస్థితులు సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితిని ఆయన చాకచక్యంతో చక్కదిద్దాల్సి ఉంది. ఈ ఆలయ పరి పాలనపై అనుభవమున్న ఆయన మున్ముందు ఆలయంలో ఇటువంటివి జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాల్సి ఉంది.