నేత్రపర్వం.. శ్రీవారికి ఎదుర్కోలు ఉత్సవం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:32 AM
బ్రహ్మాండనాయకుడైన ద్వారకాతిరుమల వాసుని ఆశ్వయుజ మాస దివ్యబ్రహ్మోత్సవాలు శ్రీవారి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 21న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28 వరకు జరుగనున్నాయి.
నేత్రపర్వం.. శ్రీవారికి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకాతిరుమల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మాండనాయకుడైన ద్వారకాతిరుమల వాసుని ఆశ్వయుజ మాస దివ్యబ్రహ్మోత్సవాలు శ్రీవారి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 21న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28 వరకు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు మహోత్సవాన్ని స్వామివారి నిత్యకల్యాణమండ పంలో అర్చకులు, పండితులు, అధికారులు, భక్తులతో వేడుకగా నిర్వహించారు. శనివారం భక్తులతో శ్రీవారి ఆలయం కిటకిటలాడింది. దాదాపు పదిహేనువేల మంది పైబడి భక్తులు సందర్శించినట్టు అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారి దర్శన అనంతరం శ్రీవకుళమాత అన్నప్రసాద భవనానికి వెళ్లి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఎదుర్కోలు ఉత్సవం ఇలా..
స్వామివారి కల్యాణానికి ముందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది, శ్రీవారి ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయదేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అట్టహాసంగా నిత్యకల్యాణ వేదిక వద్దకు తెచ్చారు. అనం తరం హారతులిచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండప ఆవరణలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలిపారు. వివాహం జరిగే ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు.
సువర్ణ హనుమపై.. తిరువీధులకు శ్రీవారు
భక్తవరదుడైన శ్రీవారు సువర్ణ హనుమద్వాహనాన్ని అధిష్టించి శనివారం ఉదయం తిరువీధుల్లో ఊరేగారు. ధనుర్భాణాలను ధరించి రామావతారంలో కొలువుతీరిన శ్రీవారు బంగారు హనుమంత వాహనంపై భక్తజనరంజకంగా తిరువీధుల్లో ఊరేగారు.
శ్రీరామ పాదుకా సమేత భరతుని అలంకరణ
శ్రీవారి దివ్య బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు అలంకరణల్లో భాగంగా శనివారం శ్రీరామ పాదుకా సమేత భరతుని అలంకారం భక్తులను ఆకట్టుకుంది. నిరుపమానమైన సోదరప్రేమకు, ధర్మ నిరతికి, త్యాగానికి సమున్నత చిహ్నం భరతుడు. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు వచ్చి అయోధ్యకు రమ్మని పట్టాభిషిక్తుడు కమ్మని కోరతాడు. దీనిని శ్రీరాముడు తిరస్కరిం చడంతో ఆయన ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించేందుకు పాదుకలు ఇమ్మని ప్రార్థిస్తాడు. ఈమేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించడంతో వాటిని ఎంతో భక్తిశ్రద్ధలతో తన శిరస్సుపై ఉంచుకుని అయోధ్యకు తీసుకొచ్చే ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది.
శ్రీవారి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమలేశుని దివ్య కల్యాణమహోత్సవానికి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. చినవెంకన్న కల్యాణాన్ని ఆదివారం రాత్రి అం గరంగ వైభవంగా జరిపేందుకు కళావైభవాలతో అనివేటి మం డపంలో ఏర్పాటుచేసిన కల్యాణ మండపాన్ని ముస్తాబు చేస్తు న్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కల్యాణ వేడుకలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని ఈవో త్రినాథరావు తెలిపారు.
మద్ది ఆంజనేయుడికి పంచామృతాభిషేకం
జంగారెడ్డిగూడెం రూరల్: గుర్వార ుుగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఉదయం 8 గంటలకు ఆలయ అర్చ కులు, వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. పలు సేవల రూపంలో రూ.2,56,653 ఆదాయం సమకూరినట్లు, ఆలయాన్ని సందర్శించిన సుమారు 3253 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించినట్లు ఈవో చందన తెలిపారు.