తిరువీధుల మెరిసెనే దేవదేవుడు..
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:15 AM
చిన్నతిరుమలేశుని రథ రంగ డోలోత్సవం క్షేత్రపురవీధుల్లో సోమవారం రాత్రి అట్టహాసంగా జరి గింది. ఉభయనాంచారులతో రథంపై కొలువైన స్వామి క్షేత్రపుర వీథుల్లో విహరించారు.
తిరువీధుల మెరిసెనే దేవదేవుడు..
చిన్నతిరుపతిలో వైభవంగా శ్రీవారి రథోత్సవం... ప్రత్యేక అలంలకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిన భక్తులు
ద్వారకాతిరుమల, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): చిన్నతిరుమలేశుని రథ రంగ డోలోత్సవం క్షేత్రపురవీధుల్లో సోమవారం రాత్రి అట్టహాసంగా జరి గింది. ఉభయనాంచారులతో రథంపై కొలువైన స్వామి క్షేత్రపుర వీథుల్లో విహరించారు. ఈ ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తులు పరవ శించారు. ఈనెల 21 నుంచి జరుగుతున్న శ్రీవారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు జరిగిన రథవాహన సేవ భక్త జనులకు ఆద్యంతం కన్నులపండువగా జరిగింది.
వేడుకగా రథోత్సవం..
శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున రథోత్స వాన్ని జరపడం సాంప్రదాయం. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వయంగా సేవచేసుకునే భాగ్యం ఈ రథోత్సవం ద్వారానే కలుగుతుంది. రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీస్వామిని తొళక్కం వాహనంపై ఉంచి మేళతాళాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ వాహ నాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటుచేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. ఆ తరువాత విశేష వాయిద్యాలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ క్షేత్రపురవీధుల్లో రథం తిరుగాడింది. ఆలయ చైర్మన్ రాజా ఎస్.వి.సుధాకరరావు, ట్రస్టీ ఎస్వీ నివృతరావు, ఈవో వి.త్రినాథ రావులు తొలుత రథానికి బలిహరణ సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రథవాహనంలో కొలువైన శ్రీవారు, అమ్మవార్లను దర్శించి, అలాగే రథసేవ చేసి తరించారు.
పాండురంగడుగా చిన్నతిరుమలేశుడు..
పాండురంగడు అలం కారంలో చిన్నతిరుమలేశుని దర్శనం భక్తులను పరవశిం పచేసింది. శ్రీవారి అశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజుకో అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. 6వ రోజైన సోమవారం ఆలయ ముఖ మండపంలో ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. రెండు చేతులు నడుముపై ఉంచుకుని సర్వాభరణాలు ధరించి పుష్పా లంకారంలో ఉన్న స్వామిని భక్తులు దర్శించుకుని తరించిపోయారు.