తిరువీధుల మెరిసెనే.. దేవదేవుడు
ABN , Publish Date - May 02 , 2026 | 12:29 AM
చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం భక్తజనులకు ఆద్యంతం కన్నుల పండువైంది. రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీస్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు.
చిన్న తిరుపతిలో కనుల పండువగా..
ద్వారకాతిరుమల, మే 1 (ఆంధ్రజ్యోతి): సమ్మోహితమైన రూపం... చిరు దరహాసంతో అభయహస్తాన్ని ప్రసాదిస్తూ ఉభయ నాంచారులతో రథంపై కొలువైన ద్వారకా తిరుమళేశుడు శుక్రవారం రాత్రి క్షేత్ర తిరు వీధుల్లో ఊరేగారు. ఈ వైభవాన్ని కనులారా వీక్షించిన భక్తజనులు పరవశించారు. చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం భక్తజనులకు ఆద్యంతం కన్నుల పండువైంది. రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీస్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు.మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కొలాటభజనలు, అర్చకులు, ఆగ మ విద్యార్థుల వేదమంత్రోచ్ఛరణల నడుమ రఽథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను అలంకరించి హారతులిచ్చారు. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈఓ త్రినాథరావులు తొలుత రఽఽథానికి బలిహరణ సమర్పించారు.తరువాత క్షేత్రపురవీధుల్లో తిరుగాడింది. భక్తులు రథవాహనంలో కొలువైన శ్రీవారు, అమ్మవార్లను దర్శించారు.కూర్మావతారం అలంకరణలో చినవెంకన్న శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఇది రెండవది. క్షీరసాగర మథనంలో మందరపర్వతం మునిగి పోకుండా తన వీపుపై మోసి దేవదానవులకు అమృతం లభించేలా విష్ణువు ఈ అవతారం ధరించారు.
కాళ్ళకూరులో శోభాయమానంగా ..
కాళ్ళ, మే 1 (ఆంధ్రజ్యోతి) : ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అంటూ గోవింద నామస్మరణతో కాళ్ళకూరు గ్రామం మారు మోగింది. కాళ్ళ మండలం కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి రథయాత్ర శోభాయమానంగా జరిగింది. సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కాళ్ళకూరులోని దారులన్నీ కిక్కిరిసిపోయాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,రమాదేవి దంపతులు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు దర్శించుకున్నారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో కాళ్ళ పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో ఎం.అరుణ్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైభవంగా ఉప్పులూరు చెన్నకేశవస్వామికి..
ఉండి, మే 1(ఆంధ్రజ్యోతి):ఉండి మండలం ఉప్పులూరు చెన్నకేశవస్వామి ఉత్సవాలు పురస్క రించుకుని శుక్రవారం రఽథోత్సవం వైభవంగా జరిపారు.ఆలయకమిటి చైర్మన్ యర్రా వెంకట సుబ్బారావు, అర్చకుల పూజా కార్యక్రమాలతో స్వామివారి రథోత్సవం ప్రారంభించారు. భక్తులు, మహిళలు పెద్దసంఖ్యలో రఽథం లాగేందుకు పోటీపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మీ పూజలు చేశారు.