వ్యాపారవేత్తలుగా మారండి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:15 AM
ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త పఽథకంలో ‘చాయ్ రాస్తా’ అవుట్ లెట్‌లు ప్రారంభం కానున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం మార్చి నెలాఖరు నాటికి జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఆరు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి
ఆరు పట్టణాల్లో ‘చాయ్ రాస్తా’ అవుట్‌లెట్‌ల ఏర్పాటు
ఒక్కో దానికి ఆరు లక్షల వరకు బ్యాంకు రుణ సదుపాయం
తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
మహిళలను ఎంపిక చేస్తున్న మెప్మా అధికారులు
భీమవరం టౌన్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త పఽథకంలో ‘చాయ్ రాస్తా’ అవుట్ లెట్‌లు ప్రారంభం కానున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం మార్చి నెలాఖరు నాటికి జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఆరు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. దీంతో ఈ రాస్తా అవుట్‌లెట్‌ల ఏర్పాటుకు మెప్మా అఽధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చాయ్ రాస్తాతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ అవుట్‌లెట్‌లు ప్రారంభించటంతోపాటు ఆర్థికంగా వ్యాపారం బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భీమవరం, తణుకుల్లో స్థలాలు గుర్తింపు
భీమవరం, తణుకు పట్టణాల్లో చాయ్ రాస్తా ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు. తణుకులో స్వయం సహాయక సంఘంలో ఒకరిని ఎంపిక చేశారు. ఈ అవుట్ లెట్ ప్రారంభానికి ఆరు లక్షల 60 వేలు పెట్టుబడి అవసరం. ఇందులో ఆరు లక్షలు బ్యాంకు రుణం. మిగిలిన 60 వేలు లబ్ధిదారుడు పెట్టుకోవాలి. ముడి సరుకుకు రూ.50 వేలు అవసరం. నెలకు రూ.40 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. 8 నుంచి 12 నెలల్లో పెట్టుబడి తిరిగివస్తుంది. ఐఐటీ పట్టభద్రుల సహకారంతో దీనిని రూపొందించారు. మిగిలిన పట్టణాల్లో వీటి ఏర్పాటుకు మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ అవసరం లేకుండా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. డిజిటల్ బిల్లింగ్ విధానం అమలు చేస్తారు. సమయం, సొమ్ము ఆదా, మెటీరియల్ ఆదా అవుతుంది. దీని కోసం ప్రత్యేక మెనూ ఉంటుంది. స్నాక్స్ కూడా అమ్ముకోవచ్చు. 3–4 రోజుల్లో పూర్తి శిక్షణ ఇస్తారు. రెడీ టూ యూజ్ మెనూతోపాటు ఇద్దరు మహిళలు ఉంటే చాలు అవుట్‌లెట్‌ను నడుపుకోవచ్చు. అతి తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
త్వరలో తృప్తి క్యాంటీన్ల ఏర్పాటు
మెప్మా, సారా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి రెండుచోట్ల ఈ క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో పెట్టుబడి రూ.16.40 లక్షల వరకు అవుతుంది. 20–12 సైజు కంటైనర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. నలుగురు మహిళా సభ్యులు ఒక యూనిట్‌గా తీసుకుని వారికి ఈ తృప్తి క్యాంటీన్లను అప్పగించనున్నారు. నలుగురుకి రూ.3.10 లక్షల వంతున రూ.12.40 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మిగతా పెట్టుబడి కంటైనర్, యంత్ర పరికరాలతోపాటు సూర్యఘర్ పఽథకం కింద సౌర విద్యుత్ ఇతర అవసరాల రూపంలో మెప్మా, సారా అధికారులు అందజేస్తారు. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయం కల్పిస్తారు. క్యాంటీన్‌లు తాడేపల్లిగూడెం, భీమవరంలల్లో ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే పట్టణవాసులకు తృప్తి క్యాంటీన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.