‘సంపద పంపిణీతోనే సంక్షేమ సమాజం’
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:11 AM
సంపద పంపిణీతోనే సంక్షేమ సమాజం సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా అన్నారు.
తణుకు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సంపద పంపిణీతోనే సంక్షేమ సమాజం సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా అన్నారు. ఆదివారం తణుకు సురాజ్య భవన్‌లో ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. కుల,మత,లింగ పరమైన వివక్ష ఉన్నందు వల్లే ఆయా తరగతుల సమూహాలు పేదరికంలో ఉన్నాయన్నారు. సంపదను సృష్టించే శ్రమజీవులకీ, సామాన్యులకీ కార్పొరేట్ల దగ్గర పోగుబడ్డ సంపదపై వివిధ పన్నుల ద్వారా ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పలు పద్ధతులు ద్వారా పేదరికం లేని సమాజాన్ని సాధించే లక్ష్యంతో ప్రారంభమైన ప్రజా రిపబ్లిక్ ఉద్యమంలో శ్రమజీవుల సంఘాలు, మైనార్టీల సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. విశ్రాంత ఐఏఎస్ బండ్ల శ్రీనివాసు మాట్లాడుతూ వామపక్షాలు, శక్తులు ఒకే వేదికపై కలసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ప్రజల ముందుకు రావాలన్నారు.సభకు అధ్యక్షత వహించిన ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డీవీవీఎస్ వర్మ మాట్లాడుతూ రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం తలపెట్టిన ఉద్యమం రాజ్యాంగ లక్ష్యాలు అమలు కోసం అవసమైన ప్రజా చైతన్య కార్యకలా పాలను చేపడుతుందని ప్రకటించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమం అవసరం అన్నారు. ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ రమేష్ చంద్రబాబు, సంకు మనోరమ, అబ్దుల్ రెహ్మాన్ తదితరులు మాట్లాడారు.