దువ్వలో 20 కాసుల బంగారు ఆభరణాలు చోరీ
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:12 AM
దువ్వ గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు చోరీ జరిగిన ఘటన జరిగిందని ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ తెలిపారు.
తణుకు రూరల్, జనవరి 4 (ఆంధ్రజోతి): దువ్వ గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు చోరీ జరిగిన ఘటన జరిగిందని ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన సింహాద్రి సూర్య భగవాన్ గ్రామంలోని సంత మార్కెట్ ఏరియా లో తన ఇంటిలో మెడికల్ షాపుతో పాటు వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో మెల కువగానే వున్నప్పటికి తెల్లవారుజామున అతడి భార్య నిద్రలేచి చూసే సరికి ఇంటి తలుపులు తెరచి వుండడం గమనించగా బీరువాలో ఉండా ల్సిన బంగారు ఆభరణాలు ఉంచే ఖాళీ భరిణెలు ఇంటి గోడపై ఉన్నాయి. ఈ ఘటనలో మూడు బంగారు ఉంగరాలు, ఒక బ్రాస్‌లెట్, రెండు గొలుసులు, రెండు కడియాలు, ఒక నెక్లెస్, ఒక జత బంగారు గాజులు, రెండు చెవి దిద్దులు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని వస్తువులు ఉండే అన్ని బాక్సులను ఇంటి బయటకు తీసుకొచ్చి వాటిలో బంగారు వస్తువులను మాత్రమే తీసుకుని, నగదు, వెండి వస్తువులతో పాటు రోల్డ్ గోల్డ్ వస్తువులను అక్కడే వదిలేయడం విశేషం. చోరీ జరిగిన ఇంటిని తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్, తణుకు రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల గుర్తింపు కోసం క్ల్యూస్ టీమ్‌లు విచ్చేసి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.