Share News

చెత్తకు చోటేది?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:23 AM

పట్టణాల్లో చెత్తతో సంపద తయారు చేసేందుకు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

చెత్తకు చోటేది?
భీమవరం తాడేరు మార్గంలో సేకరించిన స్థలం

సంపద కేంద్రాలకు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

రూ.37 కోట్లు కేటాయింపు

భూమి కోసం అన్వేషణ

పాలకొల్లు, తణుకులో ఓకే

మిగిలిన పట్టణాల్లో ఇబ్బందే

భీమవరంలో పూడిక చేయాలి

తాడేపల్లిగూడెంలో సేకరణకు కసరత్తు

పట్టణాల్లో చెత్తతో సంపద తయారు చేసేందుకు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తడి చెత్తతో వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేసేలా ప్రణాళిక చేసింది. పొడిచెత్తను ప్రోసెసింగ్‌ చేసి గుంటూరు తరలించేలా ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ఆరు పట్టణాల్లోనూ కంపోస్ట్‌ యార్డు యూనిట్‌లు ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.37 కోట్లు కేటాయించింది. టెండర్లను పిలిచి ఏజన్సీని ఖరారు చేసింది. అయితే నాలుగు ప్రాంతాల్లో స్థల సమస్య వెంటాడుతోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కంపోస్ట్‌ యార్డులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తోంది. తీరా రంగంలోకి దిగాక భూ సమస్య వెంటాడుతోంది. అధికారులు తలలు పట్టుకుం టున్నారు. తణుకు, పాలకొల్లు పట్టణాల్లోనే భూమి అందు బాటులో ఉంది. డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేదు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఆకివీడులో సమస్య ఏర్పడింది. స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గడచిన నెల రోజుల నుంచి భూముల కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. కంపోస్ట్‌ యార్డులతో తడిచెత్త అంతా సేంద్రియ ఎరువుగా మారిపోనుంది. దీనివల్ల చెత్తగుట్టలుండవు. పొడిచెత్త ఎప్పటికప్పుడు గుంటూరు తరలించేస్తారు. దీనివల్ల పర్యావరణానికి హాని ఉండదు. చెత్త ఎక్కడ వేయాలన్న సమస్య ఉత్పన్నం కాదు.

తాడేపల్లిగూడెంలో సేకరించాల్సిందే

తాడేపల్లిగూడెంలో కనిష్టంగా నాలుగు ఎకరాలు అవసరం కానుంది. ప్రస్తుతం చెరువు పోరంబోకులో డంపింగ్‌ యార్డు నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్కడ చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. చెరువు పోరంబోకు కావడంతో కంపోస్ట్‌ యార్డును అధికారికంగా నిర్వహించడానికి వీలు లేదు. దానికి ఆనుకుని భూమిని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూసేకరణ చేస్తేనే కంపోస్ట్‌ యార్డు తయారు కానుంది. లేదంటే తాడేపల్లిగూడెం లోనూ చెత్త సమస్య ఉండనుంది. పాలకొల్లు, తణుకు పట్టణాల్లో మాత్రం మూడు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. తణుకులో ఇదివరకే ఉన్న డంపింగ్‌ యార్డులోనే ప్రత్యేకంగా మూడు ఎకరాల్లో కంపోస్ట్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నరసాపురంలో స్థలం ఉన్నప్పటికీ అక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆకివీడులో భూమి అందుబాటులో లేదు. ఇలా నాలుగు పట్టణాల్లో భూ సమస్య కంపోస్ట్‌ యార్డులకు ప్రధాన అవరోధంగా మారింది.

భీమవరంలో లోతట్టు భూమి

భీమవరంలో తాడేరు రోడ్డు వైపు దాదాపు 6.20 ఎకరాల భూమిని డంపింగ్‌ యార్డు కోసం సేకరించారు. ఇప్పుడక్కడే కంపోస్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే అక్కడ భూమి లోతట్టుగా ఉంది. నీరు నిలిచిపోతోంది. పూడిక చేయాలంటే దాదాపు రూ.1.50 కోట్లు అవసరం. పూడిక చేయాలంటే మట్టి కావాలి. మరోవైపు భీమవరం–యనమ దుర్రు రోడ్డు వైపు దాదాపు డంపింగ్‌ యార్డు కోసం గతంలో సేకరణకు పెట్టారు. అదిప్పుడు కోర్టులో ఉంది. దాంతో తాడేరులో ఉన్న భూమిలో కంపోస్ట్‌ యార్డు యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళిక చేస్తున్నారు. యనమదుర్రు కాలువపై ప్రస్తుతం డంపింగ్‌ యార్డు ఉంది. అక్కడైతే పొడవుగా ఉండడడంతో కంపోస్ట్‌ యార్డు యూనిట్‌ పనికిరాదని తేల్చారు.

Updated Date - Jun 04 , 2026 | 12:23 AM